తాను మాట్లాడిన ఓ ఆడియో టేప్ లీక్ కావడంపై నటి, నిర్మాత ఖుష్బూ ట్విటర్ వేదికగా స్పందించారు. తన మాటలతో పాత్రికేయులను ఇబ్బందిపెడితే క్షమించాలని కోరారు. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో త్వరలో బుల్లితెర, వెండితెర షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టెలివిజన్ ప్రొడ్యూసర్స్ వాట్సాప్ గ్రూప్‌లో ఖుష్బూ ఇటీవల ఓ ఆడియో పెట్టారు.
"ప్రస్తుతం మీడియా వాళ్లకు కరోనా గురించి కాకుండా రాయడానికి ఏం లేదు. షూటింగ్స్ ప్రారంభం కాగానే వాళ్ల దృష్టి మనపైన పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఫొటోలు, వీడియోలకు అనుమతి ఇవ్వకండి" అని ఖుష్బూ మాట్లాడిన సదరు ఆడియో బయటకు లీక్ అయింది. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.
ఈ విషయంపై స్పందించిన ఖుష్బూ.. మీడియా మిత్రులను అమర్యాదపరచాలనే ఉద్దేశంతో అలా చేయలేదని చెబుతూ, క్షమాపణ కోరారు.
"ప్రెస్ వాళ్ల గురించి నేను మాట్లాడిన ఓ ఆడియో నిర్మాతల గ్రూప్ నుంచి బయటకు లీకైంది. మన మధ్య ఇలాంటి మనుషులు ఉన్నారని చెప్పడానికి నేను చింతిస్తున్నాను. ప్రెస్‌ను అమర్యాదపరచాలనేది నా ఉద్దేశం కాదు. మన స్నేహితులతో ఎలా మాట్లాడతామో అదేవిధంగా ప్రెస్ గురించి మాట్లాడాను. పాత్రికేయుల పట్ల నాకున్న గౌరవం అందరికీ తెలిసిందే. నా 34 ఏళ్ల కెరీర్‌లో ఎలాంటి సందర్భంలోనూ ప్రెస్ గురించి అమర్యాదపూర్వకంగా మాట్లాడలేదు. నా మాటలతో ఎవరినైనా ఇబ్బందిపెట్టి ఉంటే క్షమించండి"
ఖుష్బూ, సినీ నటి
'మీరు ఎవరి కోసం పనిచేస్తారో వాళ్లే మీ వెనుక గోతులు తవ్వుతున్నారని తెలిస్తే ఎంతో బాధాకరంగా ఉంటుంది. నా ఆడియో టేప్‌ను ఏ నిర్మాత బయటపెట్టారో నాకు తెలుసు. కానీ వాళ్ల పేరు నేను బయటపెట్టను. నా నిశ్శబ్దం, క్షమాగుణమే వారికి అతిపెద్ద శిక్ష' అని ఖుష్బూ పేర్కొన్నారు.