లాక్డౌన్ కారణంగా మూసేసిన థియేటర్లు ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చిన్న బడ్జెట్ సినిమాల్ని నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 'అమృతరామమ్', 'పొన్మగళ్ వందాళ్', 'గులాబో సితాబో' విడుదలయ్యాయి. నిర్మాతలపై పడ్డ భారాన్ని తగ్గించడానికి పలువురు నటీనటులు పారితోషికం తగ్గించుకున్నారు. మిగిలిన వారు కూడా కొంత శాతం రెమ్యునరేషన్ తగ్గించుకుని.. నిర్మాతలకు చేయూతగా ఉండాలని కోరారు.
ఈ కోవలోనే కథానాయిక కీర్తి సురేశ్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నిర్మాతలకు సాయంగా ఉండేందుకు ఆమె ముందుకు వచ్చారు. ముందుగా మాట్లాడుకున్న పారితోషికం నుంచి 20-30 శాతం తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారట. ఈ మేరకు కథనాలు వెలువడ్డాయి.
కీర్తి సురేశ్ నటించిన 'పెంగ్విన్' సినిమా మరో రెండు రోజుల్లో అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఆమె చేతిలో ప్రస్తుతం 'మిస్ ఇండియా', 'గుడ్ లక్ సఖి', 'రంగ్‌దే', 'మరక్కర్', 'అన్నాత్తే' ఉన్నాయి.