సూపర్ స్టార్‌గా, యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా నటుడు అమితాబ్ బచ్చన్ నాటి బాలీవుడ్ చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. అనంతరం సీనియర్ నటుడిగా కీలక పాత్రలకు జీవం పోస్తున్నారు. ఇక ఈయన నిర్వహిస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమం దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ షోగా నిలిచింది. అయితే కేబీసీ 12వ సీజన్‌లో ఆయన ఓ అనూహ్య పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అమితాబ్ అంటే తనకు ఇష్టం లేదని ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఓ యువతి తెలిపింది. అందుకు గల విచిత్రమైన కారణాన్ని కూడా ఆమె వివరించింది.
![KBC 12 contestant says she doesnt like Amitabh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9434276_2.jpg)
బిగ్‌బీ క్షమాపణ
దిల్లీకి చెందిన రేఖారాణి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమౌతోంది. ఇటీవల కేబీసీ 12లో పాల్గొన్న ఈ యువతి తాను షారుక్‌ఖాన్‌కు పెద్ద అభిమానినని వెల్లడించింది. అంతవరకు బాగానే ఉన్న సంభాషణ.. అమితాబ్ అంటే తనకు ఇష్టం లేదని రేఖ చెప్పడం వల్ల షాక్ తినడం బిగ్‌బీ వంతైంది. పలు సినిమాల్లో తన అభిమాన నటుడు షారుక్‌తో అమితాబ్ దురుసుగా ప్రవర్తించారని.. 'కభీ ఖుషీ కభీ ఘమ్'లో అయితే ఏకంగా ఇంటి నుంచి బయటకు పంపేశారని ఆమె ఆరోపించటం వల్ల ఎలా స్పందించాలో తెలియక అమితాబ్ ఒక్క క్షణం మౌనం వహించారు. అదంతా కేవలం నటనే అని, స్కిప్టు ప్రకారమే అలా చేయాల్సివచ్చిందని చెప్పినా రేఖ అంగీకరించలేదు. దాంతో అమితాబ్ చివరికి ఆమెకు క్షమాపణ చెప్పారు. అంతేకాకుండా షారుక్‌కూ సారీ చెపుతానంటూ వాగ్దానం చేశారు.
![KBC 12 contestant says she doesnt like Amitabh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9434276_3.jpg)
షారుక్ కుమారుడిది ఇదే తీరు
సినిమాల ప్రభావం జీవితంపై ఉంటుదన్న మాట నిజమే. ఇక సినిమాలో జరిగే సంఘటనలను నిజ జీవిత ఘటనలుగా అభిమానులు భావించటం కూడా సహజమే. అయితే.. తమ నటనను నిజమని నమ్మేంత అభిమానం ఎదురైనపుడు నటులు సంభ్రమానికి గురౌతారు. ఇదే మాదిరిగా షారుక్ చిన్న కుమారుడు అబ్‌రామ్ ఖాన్ తనను తాతగా భావిస్తాడని గతంలో అమితాబ్ పలుమార్లు తెలిపారు. అంతేకాకుండా అమితాబ్ తమతో కలసి ఎందుకు ఉండడం లేదని కూడా ఆ చిన్నారి తరచు ప్రశ్నిస్తాడట.