కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు(puneeth rajkumar health). ఉదయం జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా ఒక్కసారిగా పునీత్ రాజ్‌కుమార్ కుప్పకూలిపోయారు(puneeth rajkumar news). వెంటనే అప్రమత్తమైన ఆయన సహాయకులు, జిమ్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
"ఛాతిలో నొప్పి కారణంగా నటుడు పునీత్ రాజ్‌కుమార్‌ను ఈ రోజు ఉదయం 11:30కి ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు చికిత్స అందించేందుకు కృషి చేస్తున్నాము. పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆసుపత్రికి తీసుకొచ్చే ముందే ఆయన పరిస్థితి విషమించింది. ఐసీయూలో చికిత్స అందిస్తున్నాము. ఇప్పుడే ఏం చెప్పలేము."
-- డా. రంగనాథ్ నాయక్, విక్రమ్ హాస్పిటల్.
విషయం తెలిసిన వెంటనే పునీత్ రాజ్‌కుమార్ కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కుటుంబసభ్యులతో మాట్లాడారు. విక్రమ్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడిన బొమ్మై పునీత్ రాజ్‌కుమార్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
46ఏళ్ల పునీత్ రాజ్‌కుమార్ 1976లో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. 1989 వరకు బాలనటుడిగా 13 సినిమాలు చేశారు. కొంత విరామం తర్వాత 2002లో అప్పు సినిమా ద్వారా కన్నడ సినీపరిశ్రమలో హీరోగా తెరంగేట్రం చేశారు. పునీత్ ఇప్పటివరకు 32 సినిమాల్లో హీరోగా నటించారు. తాజాగా ఈ ఏడాది యువరత్న సినిమాతో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం మరో 2 సినిమాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.