దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భాషా చిత్ర పరిశ్రమల్ని ఒక్కటి చేస్తే.. భారత్ ప్రపంచంలోనే అగ్ర స్థానానికి చేరుతుందని నటి కంగనా రనౌత్ అభిప్రాయపడ్డారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ రాష్ట్రంలో ఫిల్మ్ సిటీ నిర్మాణం గురించి ప్రకటించారు. దేశంలోనే ఎంతో అందమైన ఫిల్మ్ సిటీని త్వరలో ఉత్తర్‌ప్రదేశ్‌లో నిర్మిస్తామని పేర్కొన్నారు. దీన్ని ఉద్దేశించి కంగన ట్వీట్లు చేశారు. వివిధ భాషా చిత్ర పరిశ్రమల్ని కలిపితే మరింత ప్రయోజనం చేకూరుతుందంటూ ప్రధాని మోదీని ట్యాగ్ చేశారు.
'యోగి ఆదిత్యనాథ్ జీ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నా. చిత్ర పరిశ్రమలో ఇలాంటి మార్పులు ఇంకా చాలా రావాలి. 'భారతదేశ చిత్ర పరిశ్రమ' అనే ఓ పెద్ద పరిశ్రమ మనకు కావాలి. మనం ఒక్కటిగా లేకపోవడం వల్ల హాలీవుడ్ చిత్రాలు భారత్‌లో వివిధ అంశాల్లో అవకాశం తీసుకుంటున్నాయి. ఒక్క చిత్ర పరిశ్రమ.. అనేక ఫిల్మ్ సిటీలు కావాలి'
'దేశంలో అగ్ర శ్రేణిలో హిందీ చిత్ర పరిశ్రమ ఉందని ప్రజలు అనుకుంటుంటారు, కానీ అది తప్పు. తెలుగు చిత్ర పరిశ్రమ అగ్ర స్థాయికి చేరింది. ఇప్పుడు వివిధ భాషల్లో పాన్ ఇండియా సినిమాలు తీసి, ప్రేక్షకులకు అందిస్తోంది. అనేక హిందీ సినిమాల్ని హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ(ఆర్‌ఎఫ్‌సీ)లో షూట్ చేశారు'
'దేశం మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చే సామర్థ్యం సినిమాలకు ఉంది. అందుకే వ్యక్తిగత గుర్తింపు ఉండి, సామూహిక గుర్తింపు లేని అనేక చిత్ర పరిశ్రమలను అఖండ భారతదేశంలా ఒక్కటి చేద్దాం. భిన్న భాషల్లో ఉన్న ఈ చిత్ర పరిశ్రమల్ని కలపండి (ప్రధానిని ఉద్దేశించి..). అప్పుడు మనం ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుతాం' అని ఆమె ట్వీట్లు చేశారు.