విషయం ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడుతుంది బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్. ఇటీవలే హృతిక్ రోషన్‌ను 'నా మాజీ ప్రియుడు' అని సంబోధిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ రోజు అతడి కంటే తాను ఉన్నత స్థాయిలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది.
"నా పట్ల నేను గర్వంగా ఉన్నా. నా మాజీ ప్రియుడు అద్దె ఇంట్లో ఉంటే.. నేను సొంత ఇల్లు, ఆఫీసు కొన్నానని చెప్పుకోవడం సంతోషంగా ఉంది. అతడున్న ఇల్లు వాళ్ల నాన్న కట్టారు. నేను కెరీర్ ఆరంభించే సమయంలో నాకు ఎటువంటి లక్ష్యాలు లేవు. కానీ కొన్నేళ్ల క్రితం నా మాజీ ప్రియుడితో ప్రేమలోపడ్డ తర్వాత లీగల్ కేసు నడిచింది. ఆ సమయంలో జరిగిన చర్చలు నాకింకా గుర్తున్నాయి. నేను చిన్న గ్రామానికి చెందిన అమ్మాయినని.. డబ్బుల కోసం అతడి వెంటపడ్డానని అందరూ అనుకున్నారు. అమ్మాయిల్ని ఈ సమాజం అలా చూస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మాటల గురించి ఆలోచిస్తూనే ఉన్నా. ఓ మహిళగా నాకు డబ్బులపై ఆశలేదు.. కానీ ప్రజలు నన్ను ఆస్తికోసం ప్రేమించే అమ్మాయిగా చూశారు. నా మనసు మారింది.. నాకంటూ అన్నీ ఉండాలని నిర్ణయించుకున్నా"
-కంగనా రనౌత్, బాలీవుడ్ కథానాయిక
దేశంలోనే ధనవంతురాలిగా
డబ్బుల కోసం తాను హృతిక్ వెంటపడేదాన్నంటూ అతడు పలువురితో చెప్పుకున్నట్లు తెలిపింది కంగనా. అందుకే తాను భారతదేశంలోని ధనవంతుల్లో ఒకదానిదా నిలిచి తనేంటో నిరూపించుకోవాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెప్పింది.
"అతడు (హృతిక్) తన స్నేహితులందరికీ 'హో.. ఆమె నా డబ్బుల కోసం వెంటపడింది' అని చెప్పుకున్నాడు. అది నిజం కాదని నిరూపించడం ఎలాగో నాకు అర్థం కాలేదు. చిన్న గ్రామంలోని సంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయికి ప్రేమించే అవకాశం లేదా? అందుకే ఎవరికీ లేనంత అందమైన ఇల్లు, ఆఫీసు నాకుండాలి అనుకున్నా. నాకు 50 ఏళ్లు వచ్చేసరికి ఇండియాలోని ధనవంతుల్లో ఒకదానిగా నిలవాలని లక్ష్యం పెట్టుకున్నా. పరిస్థితులు నాలో ఈ కసిని పెంచాయి"
- కంగన, బాలీవుడ్ కథానాయిక.
ఇది చూడండి : బాలీవుడ్ భామలు అబ్బాయిలైతే!