బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ వరుస పెట్టి ఆలయాలు తిరుగుతోంది. శనివారం గుజరాత్లోని ద్వారకాదీశ్ మందిరాన్ని దర్శించుకున్న కంగనా అనంతరం ప్రఖ్యాతిగాంచిన సోమనాథ్ ఆలయాన్ని సందర్శించింది. సౌరాష్ట్రలోని సోమనాథ్ మహాదేవునికి ప్రత్యేక పూజలు చేసింది.
మధ్యాహ్నం హారతి ఇచ్చే సమయానికి హాజరైంది కంగనా. మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథుడిని దర్శించుకోవడం మర్చిపోలేని అనుభవమంటూ చెప్పింది.
"భగవంతుడి మీద చాలా నమ్మకం ఉంది. ఆయన ఆశీస్సులు ఉంటే చాలు. ఇంకేమి అవసరం లేదు. సోమనాథుడిని దర్శించుకోవడం మర్చిపోలేని గొప్ప అనుభవం" -కంగనా రనౌత్
శనివారం ఉదయం గుజరాత్ ద్వారకలో శ్రీకృష్ణుడి ఆలయాన్ని దర్శించుకుంది కంగనా. సంప్రదాయ ఎరుపు రంగు దుస్తుల్లో కనిపించి భక్తి శ్రద్ధలతో భగవంతుడిని కొలిచింది. అనంతరం నాగేశ్వరి జ్యోతిర్లింగాన్ని సందర్శించింది.
ప్రస్తుతం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి'లో నటిస్తోంది కంగనా. ఈ సినిమా కోసం భరతనాట్యం నేర్చుకుంది. ఎల్.విజయ్ దర్శకుడు. ప్రముఖ రచయితలు విజయేంద్ర ప్రసాద్, రజత్ అరోరా కథ అందిస్తున్నారు. విష్ణువర్ధన్ ఇందూరి సినిమాకు నిర్మాత. జీవీ ప్రకాష్ సంగీత దర్శకుడు. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
జయలలిత బయోపిక్ తర్వాత ఓ కుటుంబ కథా చిత్రంలో నటించనుంది కంగనా. ఇందులో కబడ్డీ క్రీడాకారిణిగా కనిపించనుంది.
ఇదీ చదవండి: మై డియర్ డార్లింగ్.. ఎందుకంత ఫైరింగ్