ఆ సినిమాలు వెన్నెల బృందావనాలు. పరిమళ పారిజాతాలు. జీవన వేదాలు. ప్రణవ నాదాలు. హృద్య గానాలు. అవి సంస్కరణల సప్తపదులు. సంగీత నాట్య సమలంకృతులు. సరస్వతీ నిలయాన ఓంకార ధ్వానాలు. శారదవీణా రాగచంద్రికలు. జీవన లయ మాధురీ శృతిగీతికలు. ఆ జనశీలి ఐదున్నర దశాబ్దాల సినీ నవ్య చరితకు భవ్యగీతిక. తెలుగు సంస్కృతికి సమున్నత పతాక. ఆయన కళాతపస్వి, సినీ యశస్వి, సందేశాత్మక చిత్రాల రూపశిల్పి, అద్భుత కళాఖండాల సృష్టికర్త కాశీనాథుని విశ్వనాథ్.
వ్యక్తిగతం
రేపల్లె దగ్గర ఓ పల్లెటూరు పెద్దపులివర్రు. కాశీనాథుని సుబ్రహ్మణ్యం,సరస్వతి ఇంట ఉదయించిన వెలుగురేఖ విశ్వనాథ్. బెజవాడలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తయ్యింది. గుంటూరు ఏసీ కాలేజీలో బి.ఎస్సీ. పూర్తయ్యింది. తండ్రి ప్రోత్సాహంతో తనయుడు విశ్వనాథ్ వాహినీ స్టూడియోలో రికార్డిస్టుగా ప్రవేశించారు. అప్పుడే నాటి ప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు మార్కస్ బార్ట్‌లీ వెలుగునీడల భాషను నిశితంగా పరిశీలించారు. బీఎన్ రెడ్డి, కేవీరెడ్డి దర్శక నైపుణ్యాలను ఔపాసన పట్టారు. 1957లో 'తోటికోడళ్లు' సినిమాకు పనిచేసిన సందర్భం.. దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దృష్టిని ఆకర్షించిన శుభసందర్భం. తర్వాత విశ్వనాథ్ 'మూగమనసులు' స్క్రిప్టు చర్చల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన ప్రతిభకు అక్కినేని నాగేశ్వరరావు, దుక్కిపాటి మధుసూదనరావు అప్రతిభులయ్యారు. అన్నపూర్ణ పిక్చర్స్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. కొంతకాలానికి విశ్వనాథ్ ఆ సంస్థలో అసిస్టెంటు డైరెక్టరుగా చేరారు. 1963లో చదువుకున్న అమ్మాయిలు చిత్రానికి రెండో యూనిట్ డైరెక్టర్ అయ్యారు. మరుసటి ఏడాది 'డాక్టర్ చక్రవర్తి' చిత్రానికీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.
దర్శకుడిగా తొలిచిత్రం
1965లో 'ఆత్మగౌరవం' చిత్రానికి దర్శకత్వం వహించే సువర్ణావకాశం తలుపుతట్టింది. ఏయన్నార్, కాంచన హీరో, హీరోయిన్గా నటించిన 'ఆత్మగౌరవం' సినిమాకు మెగా ఫోన్ పట్టుకున్నారు. జమీందారీ ఆస్తి వారసత్వ కథాంశంగా తీసిన ఈ సినిమా 1966లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్ర ఘన విజయం విశ్వనాథుని జైత్ర యాత్రకు పూలబాట పరిచింది.
తర్వాత కాలంలో విశ్వనాథ్.. స్త్రీల హృదయవేదనకు అద్దంపట్టే చిత్రాలు తీశారు. సామాజిక సంస్కరణా దృక్పథాన్ని తన పంథాగా ఎంచుకున్నారు. జీవన సంద్రంలో ఎదురీదే దివ్యాంగులు, అపసవ్య మానసిక స్థితిలో ఉండే నిర్భాగ్యుల పాత్రలతో అనేక సినిమాలు తెరకెక్కించారు.
శోభన్ బాబుతో డీ-గ్లామర్ వేషం
ఎన్టీఆర్, కాంచన నటించిన సినిమా 1968లో విడుదలైన 'కలిసొచ్చిన అదృష్టం'. అదే ఏడాది వచ్చిన సినిమా.1971లో చెల్లెలి కాపురం చిత్రం విశ్వనాథ్‌కు దర్శకుడుగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. అందగాడిగా పేరున్న.. విజయాల జోరు మీద ఉన్నశోభన్ బాబును డీ-గ్లామర్ వేషంలో చూపించటం విశ్వనాథ్ వెండితెరపై చేసిన ప్రయోగాలకు నిదర్శనం.
విశ్వనాథ్ హృదయ గవాక్షం లోంచి వెలువడిన సినిమా 'జీవనజ్యోతి'. ఒక క్లాసిక్. ప్రతిఫ్రేమ్ అద్భుత చిత్రీకరణకు హాట్సాఫ్ చెప్పాలి. దర్శకునిగా విశ్వనాథ్ కళా సృజన, ప్రతిభకు విశ్వరూపం 'సిరిసిరిమువ్వ'. మూగభాషలో, సిరిమువ్వల సవ్వడితో కలను, కళను పండించుకున్న హైమ హృద్యగాథ.
సంప్రదాయ కళలకు ప్రతిబింబంగా..
పాశ్చాత్య సంస్కృతీ ప్రభావంతో మన సంప్రదాయ కళలన్నీ కొడిగడుతున్న దీపాల్లా ప్రమాదంలో పడినవేళ.. విశ్వనాథ్ చేసిన కళాసృష్టి 'శంకరాభరణం'. ఈ చిత్రం నుంచి విశ్వనాథ్ చిత్రాలన్నీ నాదోపాసనలు, నాట్యోపాసనలతో తెరకెక్కాయి. సామాజిక ఇతివృత్తాలు మేళవించి, తెలుగుసంస్కృతిని ప్రతిబింబించే కళాఖండాలు ప్రేక్షకులను పలకరించాయి.
తెలుగు సినిమా దశను, దిశను మార్చివేసిన 'శంకరాభరణం'. శాస్త్రీయ సంగీత అమృత ధారలను పంచిన శంకరాభరణం.. గురుశిష్య సంబంధ ఇతివృత్తం. సంగీత ప్రాధాన్నాన్ని వివరిస్తూనే మానవతావిలువలకు పట్టం కట్టిన సినిమా ఇది.
చిరంజీవితో తొలి చిత్రం
తులసి తనను కాటేసిన ప్రతినాయకుడి రక్తాన్ని శంకరశాస్త్రి కాళ్లకు రాసే దృశ్యం దర్శక విరించి విశ్వనాథ్ అద్భుత ప్రతిభకు నిదర్శనం. మౌన భాషే తప్ప మాటలుండవు. 'శంకరాభరణం'లో సంభాషణలు తక్కువ అయినా.. అవి అదను చూసి పదునుగా దూసుకొచ్చాయి. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యలో అమ్మవారిని చూసిన యాజులు తనయుడు అవధాని. భార్యను ఆమె మనసుపడ్డ వ్యక్తికిచ్చి ఏడడుగులు వేయించిన కథ. వరకట్న దురాచారంపై సంధించిన అస్త్రం 'శుభలేఖ' చిత్రం. విశ్వనాథ్‌తో కథానాయకుడు చిరంజీవికి తొలిసినిమా.
క్లాసికల్ విజయగీతిక
'సాగర సంగమం' 1983లో ఒక క్లాసిక్. బ్లాక్ బ్లస్టర్. ఓ పరాజిత కళాకారుని విఫల, విషాద గాధ. ఒక ఫెయిల్యూర్ స్టోరీని కళాఖండంగా తీర్చి దిద్దటం దర్శకుని సాహసంగా విమర్శకులు కొనియాడారు. ఈ సినిమా పాటలన్నీ విజయగీతికలే. కుమారుణ్ణి గొప్ప డ్యాన్సర్‌గా చూడాలని కలలు కంటుంది వంటలక్క డబ్బింగ్ జానకి. కానీ కలలు తీరకముందే చనిపోతుంది. తల్లిమరణం, ప్రేమవైఫల్యంతో అతడు వ్యసనాలకు బానిసవుతాడు. అయినా సమున్నత వ్యక్తిత్వంతో అందరి సానుభూతి పొందిన పాత్ర బాలు. బాలుగా కమల్ హాసన్ నటన నభూతో నభవిష్యతి.
విశ్వనాథ్ సినిమాల్లో వెంకటేశ్, భానుప్రియ నటించిన 'స్వర్ణకమలం' సంప్రదాయ కళలకు నృత్యాంజలి. విధాత తలపున ఏమి ప్రభవించిందో.. కానీ విశ్వనాథ్ 'సిరివెన్నెల' తీశారు. సీతారామశాస్త్రి పాటలు రాశారు. పండిట్ హరిప్రసాద్ పాత్రధారికి చూపులేదు. సుభాషిణిగా నటించిన సుహాసినికి మాటలు రావు. అతడు లోకం చూడలేడు. ఆమె పాడలేదు. అటువంటి పాత్రల చుట్టూ అల్లిన అద్భుత చిత్రం 'సిరివెన్నెల'. జ్యోతిర్మయి పాత్రధారి మూన్ మూన్ సేన్.. కథానాయకుడికి విరిసే భానూదయం, కురిసే విన్నెల చూపటం వినూత్నం.
1987లో 'శ్రుతిలయలు'
1989లో 'సూత్రధారులు'
1992లో చిరంజీవి, మీనాక్షి శేషాద్రి నాయకా, నాయకిగా 'ఆపద్బాంధవుడు'
1992లో 'స్వాతికిరణం'.. కళాకారులలో ఈర్ష్య, అసూయ, ద్వేషాలను ఎండగట్టిన చిత్రం.
1992లో వచ్చిన 'ఆపద్బాంధవుడు' చిత్రం చిరంజీవి నటకౌశలానికి అద్దం పట్టింది.
కళాతపస్వి. అభినయంలో యశస్వి. దర్శకుడుగా నటీనటులకు సూచనలిచ్చే సమయంలో వారికంటే ఆయనే అద్భుతంగా నటిస్తారని పేరు. తెరవెనుక నుంచి తెరముందుకు వచ్చే సందర్భం రానే వచ్చింది. ఓ శుభసమయంలో 'శుభసంకల్పం' సినిమా ద్వారా నటుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తండ్రిగా, భర్తగా, క్యారెక్టర్ యాక్టరుగా విభిన్న పాత్రలలో జీవించారు. మీసకట్టు, పంచెకట్టుతో అచ్చమైన తెలుగుతనానికి స్వచ్చమైన ప్రతీకలా కనిపించారు విశ్వనాథ్.
నటుడిగానూ మెప్పించి..
విశ్వనాథ్ బహుపాత్రధారి. దర్శకుడుగా తెరవెనుక ఉండి సినిమాలు తీసే విశ్వనాథ్ అనూహ్యంగా తెరమీదికి వచ్చారు. అద్భుత నటనతో ప్రేక్షక నీరాజనాలు అందుకున్నారు. 1995లో కమలహాసన్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 'శుభసంకల్పం' సినిమా తీశారు. ఆ చిత్రానికి కాశీనాథుని విశ్వనాథుడు దర్శకుడు. ఒక ముఖ్య పాత్రకు సీనియర్ నటుడి కోసం అన్వేషణ ప్రారంభించారు. కానీ ఎవరూ దొరకలేదు. కమల్ ఓత్తిడితో పెద్దాయన పాత్రలో విశ్వనాథ్ నటించి మెప్పించారు. సంభాషణలు లేకుండా నటింపజేయడంలోనే కాదు. నటనలోనూ దర్శకుడు విశ్వనాథ్ శైలి నభూతో నభవిష్యతి. కీరవాణి పాట, కమలహాసన్.. ఆమని ఆట. విశ్వనాథ్ గ్రామపెద్దగా వివాదాలు పరిష్కరించే క్రమంలో ఓ దృశ్యం చూడాల్సిదే. ఆ నుంచి 28 సినిమాలలో నటించారు.
విశ్రాంతి జీవనంలో..
శిల్పి చేతికి ఉలిలా.. విశ్వనాథుని చేతికి కథ. కాశీవిశ్వనాథుడు నచ్చిందే తడవుగా ఆ కథ వెండితెరకెక్కి కళాఖండం అవుతుంది. విశ్వనాధ్ చిత్రాలంటే కేవలం నాదవినోదాలే కావు. నాట్యవినోదాలే కావు. ఆ సినిమాలు విశ్వనాద వినోదాలయ్యాయి. 2004లో 'స్వరాభిషేకం', 2010లో 'శుభప్రదం' చిత్రాలకు దర్శకత్వం వహించారు. మళ్లీ మెగాఫోను ముట్టుకోలేదు. తన సినీ జీవనయానంలో జ్ఞాపకాల జావళిని అందరితో పంచుకుంటూ విశ్రాంత జీవితం గడుపుతున్నారు.
ఇదీ చూడండి.. Vijay: 'బండమొహం.. వీడు హీరో ఏంటి?'