విక్టరీ వెంకటేశ్, రానా కాంబినేషన్‌లో ఓ వెబ్‌సిరీస్ రాబోతోందంటూ కొంతకాలంగా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుందని కూడా చర్చలు సాగుతున్నాయి. వెబ్‌సిరీస్‌కు సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. దీనిపై ఎలాంటి క్లారిటీ రాకుండానే మరో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది.
కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ ఈ వెబ్‌సిరీస్‌లో ఓ కీలకపాత్ర పోషించనుందట. వివాహం అనంతరం నిషా అగర్వాల్ సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే.. ఈ వెబ్‌సిరీస్‌తో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెబ్ సిరీస్ దర్శకనిర్మాతలు ఆమెను సంప్రదించినట్లు.. దానికి ఆమె కూడా పచ్చజెండా ఊపిందట. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరికొంత కాలం ఎదురుచూడక తప్పదు.
కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ 'ఏమైంది ఈవేళ' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత 'సోలో', 'సుకుమారుడు', 'సరదాగా అమ్మాయితో' వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళం, మలయాళంలోనూ ఆమె పలు సినిమాల్లో నటించింది. 2013 డిసెంబర్‌లో ఆమె ముంబయికి చెందిన వ్యాపారవేత్త కరణ్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆమె సినిమాలకు గుడ్‌బై చెప్పింది. కాగా.. ఈ మధ్య నిషా అగర్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పోస్టు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రీఎంట్రీ ప్రయత్నాల్లో భాగంగానే ఆమె పోస్టులు చేస్తూ ఉండవచ్చు అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.