తన నటనతో పాటు గ్లామర్‌తో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసే హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఇటీవలే 'ఖైదీ నెంబర్ 150', 'సీత' వంటి సినిమాలతో తెలుగు బాక్సాఫీసు వద్ద మంచి హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌ను ఎంచుకోవడంలో తీసుకున్న నిర్ణయాలపై పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
"నిజానికి చిన్నప్పటి నుంచే భవిష్యత్తులో ఏం చేయాలన్న దానిపై పిల్లలకు ఓ స్పష్టత ఉంటుంది. వాళ్లు తర్వాత అదే చేస్తారా? లేదా? అన్నది తెలియదు. నేనేం చేయాలో అర్థం కాక గందరగోళానికి గురవుతుండేదాన్ని. ఈ పరిస్థితుల నుంచే నాకొక చక్కటి ఆలోచన తట్టింది. అసలు నేను ఏ పని చేస్తే నా మనసుకు సంతృప్తికరంగా అనిపిస్తుందని తెలుసుకోవడానికి ముందు ఏదోక పని చేసి చూడాలి అనుకున్నా. తొలుత ప్రకటనలు, ప్రజా సంబంధాలకు సంబంధించిన ఓ సంస్థలో చేరా. అలా పదహారేళ్ల వయసు నుంచే పనిచేయడం అలవాటు చేసుకున్నా"
-- కాజల్ అగర్వాల్, నటి
"కాలేజీలో ఉన్నప్పుడు ప్రతి వేసవిలోనూ ఓ ఉద్యోగం వెతుక్కునేదాన్ని. ఏ పనినైతే ఇష్టంగా చేస్తానో తెలియడానికే అలా చేశా. డిగ్రీ చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు లోరియల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో చేరా. కాలేజీ అయ్యాక దాదాపు పది నెలలు అందులోనే చేశా. తర్వాత ఎంబీఏలో చేరా. అప్పుడే సినిమా అవకాశాలు రావడం, నటిగా బిజీగా మారడం చకచకా జరిగిపోయాయి. మొత్తానికి ఈ నటనలోనే నాకు సంతృప్తి, సంతోషం ఉన్నాయని తెలుసుకున్నా" అంటూ కాజల్ చెప్పుకొచ్చింది.
కాజల్ ప్రస్తుతం చిరంజీవితో 'ఆచార్య'లో, కమల్‌హాసన్‌తో 'ఇండియన్ 2' చిత్రాల్లో నటిస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'ప్యారిస్ ప్యారిస్' విడుదలకు సిద్ధంగా ఉంది.