28..44..4..
ఏమిటీ నంబర్లు..? దర్శకుడు కే.రాఘవేంద్రరావు సినిమాలో హీరోయిన్ కొలతలా..! అనుకుంటున్నారా? కాదు కాదు.. ఆయన జీవితంలో ముఖ్యమైన నెంబర్లివి. ఇంద్రధనస్సుకు చీరకట్టి.. మల్లెలు తురిమి అలంకరిస్తే.. ఆయన సినిమాల్లో కథానాయికలా మెరిసిపోతుంది. చంద్రుడికి ప్యాంటు షర్ట్ వేసి, మాస్ లుక్‌ను అద్దితే ఆయన చిత్రంలో కథానాయకుడై మన మనసు దోచేస్తాడు. సెలయేళ్లు దర్శకేంద్రుడి పాటల్లో నాట్యమాడతాయి. పూలు, పండ్లు తామెందుకు పుట్టామో అనే విషయాన్ని ఆయన గీతాల్లోనే తెలుసుకుంటాయి. ‘అవన్నీ తెలుసండీ... ఇంతకీ పై నంబర్లేంటి?’ అంటారా? ఇదే విషయాలను 'ఈనాడు సినిమా' దర్శకేంద్రుడు రాఘవేంద్రరావునే అడిగింది. 78 ఏళ్ల వయసులో ‘28’ఏళ్ల యువకుడిలా ఆలోచించే ఆయన దాంతో పాటు తన కొత్త సినిమా 'పెళ్లిసంద..డి' విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
వాటి ప్రాధాన్యమిది
‘‘ఏప్రిల్ 28న నందమూరి తారక రామారావు నటించిన ‘అడవిరాముడు’ సినిమా విడుదలైంది. అది ఎంతటి బ్లాక్‌బస్టర్ అయిందో మీకు తెలుసు. తెలుగులో మొట్టమొదటగా కోటి రూపాయల కలెక్షన్లు కొల్లగొట్టిన చిత్రమది. అందుకే నా జీవితంలో అతి ముఖ్యమైన సినిమా ‘అడవిరాముడు’. అలాగే నా సమర్పణలో రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ అదే తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటింది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రపంచ సినిమా తెలుగు సినీ పరిశ్రమవైపు చూసి ఆశ్చర్యపోయాలా చేసింది. అందుకే ఈ నెల 28 నాకు అంత ప్రత్యేకం. ‘అడవిరాముడు’ విడుదలై 44 ఏళ్లవుతోంది. ‘బాహుబలి 2’ వచ్చి 4ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా నా ఆధ్వర్యంలో రూపొందుతున్న ‘పెళ్లిసంద...డి’ చిత్రం పాటను విడుదల చేస్తున్నా.’’
వాళ్లే కారణం
శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న 'పెళ్లి సంద..డి' నేను తీయడానికి కారణం రాజమౌళి, కీరవాణి, సత్యానంద్‌లే. శ్రీకాంత్ హీరోగా తీసిన ‘పెళ్లిసందడి’ ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో అందరికీ తెలుసు. ఆ సినిమా విడుదల తర్వాత పెళ్లి వాహనాలకు, మండపాలకు.. పలానా వారి పెళ్లి సందడి అని రాయడం మొదలు పెట్టారు. ఒక దర్శకుడిగా, కథకుడిగా ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది. ఈ సినిమాకు కొనసాగింపు చిత్రం మీరు తీస్తే చూడాలని ఉందని దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత సత్యానంద్ అడిగారు. అప్పటి నుంచి నాలో ఆలోచన మొదలైంది.
రక్తి-భక్తి... రాఘవేంద్రరావు-కీరవాణి
‘పెళ్లిసంద...డి’ అని పేరు ఎందుకు పెట్టాం? ఆంగ్ల అక్షరం డీ కి ఉన్న అర్థమేంటి? అనేది అందరి ప్రశ్న. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడానికే అలా పెట్టాం. ఈతరం కథతో రూపొందుతోంది. ఇది ఒక మ్యారేజ్ రొమాంటిక్ కామెడీ చిత్రం. బుధవారం విడుదల చేస్తున్న ఈ సినిమాలోని తొలిగీతాన్ని కశ్మీరులో చిత్రీకరించాం. చాలా అందంగా వచ్చింది. ఇందులో మొత్తం 7 పాటలుంటాయి. చంద్రబోస్ సాహిత్యం అందించారు. కీరవాణి, నా కాంబినేషన్లో పాటలు ఎలా ఉంటాయో తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితమే. మేం ఇద్దరం కలసి రక్తి పాటలు చేసినా... భక్తి పాటలు వినిపించినా... ప్రేక్షకులు ఆదరించారు. అలాగే ఈ చిత్రంలోని పాటలకు మంచి ప్రశంసలు అందుతాయని ఆశిస్తున్నా.
ఆ ఆలోచనలూ ఉన్నాయి..
సినిమాలకు దర్శకత్వం చేశాను. నిర్మించాను. అలాగే టీవీలో సీరియళ్లకు దర్శకత్వ పర్యవేక్షణ చేశా. నిర్మించా. రేపటి తరం మాధ్యమం అయిన ఓటీటీపై అడుగుపెట్టాల్సి ఉంది. ఆ చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ వివరాలు చెబుతా.
అలా కుదిరింది
పెళ్లిసందడికి కొనసాగింపు చిత్రం తీస్తే ఎలాంటిది తీయాలి? అని ఆలోచిస్తున్న తరుణంలో నా దగ్గర 10ఏళ్లుగా రచయితగా పనిచేస్తున్న గౌరి రోనంకి ఒక ఐడియా చెప్పారు. దాన్ని డెవెలప్ చేశాం. ఆమె దర్శకత్వంలోనే ‘పెళ్లిసంద...డి’ తెరకెక్కుతోంది. నేను స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నా. దాదాపు చిత్రీకరణ పూర్తి చేశాం. మరో రెండు, మూడు రోజులు షూటింగ్ చేస్తే మొత్తం అయిపోతుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు చేసి... త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. రోషన్ చాలా బాగా చేశాడు. శ్రీలీల తెలుగమ్మాయే. వైద్యవిద్య అభ్యసిస్తోంది. ఇద్దరి మధ్య కెమెస్ట్రీ బాగా కుదిరింది. వారి జంటను చూసి ప్రేక్షకులు కూడా ప్రశంసిస్తారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మళ్లీ థియేటర్లలో ఆ సందడి
కాస్త జాగ్రత్తగా ఉంటూ.. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తే.. కచ్చితంగా ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి అందరం బయటపడతాం. త్వరలోనే వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వస్తుంది. అప్పుడు ప్రేక్షకులకు ధైర్యం వస్తుంది. థియేటర్లు మళ్లీ అభిమానుల సందడితో కళకళలాడతాయి. మా ‘పెళ్లిసంద..డి’ చిత్రం ఆ సందడిని రెట్టింపు చేసేలా ఉంటుంది.
ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ సంస్థలు కలిసి.. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ‘పెళ్లిసంద..డి’ని నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రానికి చంద్రబోస్ సాహిత్యమందించారు. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లు.