ప్రముఖ దక్షిణాది నటుడు గిరీష్ కర్నాడ్ ఈరోజు ఉదయం బెంగళూరులో కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. మహారాష్ట్రలోని మాతేరన్‌లో 1938 మే 19న జన్మించిన గిరీష్ కర్నాడ్... గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొంతకాలంగా బెంగళూరులో ఇంటి వద్ద చికిత్స తీసుకుంటున్న ఆయన... పరిస్థితి విషమించి ఈరోజు ఉదయం 6గంటల 30నిముషాల సమయంలో మృతిచెందారు.
ఉత్తమ దర్శకుడు...
ప్రముఖ రచయితగానూ, దర్శకుడుగానూ అందరికీ సుపరిచితం. పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు గిరీష్ కర్నాడ్. 1972లో గిరీష్ కర్నాడ్‌కు బీవీ కారంత్‌తో కలిపి 'వంశ వృక్ష' అనే కన్నడ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు లభించింది.
- 1974లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు గిరీష్. 1992లో పద్మభూషణ్ పురస్కారం,1998లో ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్ అవార్డు అందుకున్నారు.
పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న గిరీష్ కర్నాడ్... ప్రేమికుడు, ధర్మచక్రం, రక్షకుడు, పెళ్లిచేసుకుందాం తదితర తెలుగు చిత్రాల్లో నటించారు. తెలుగులో శంకర్‌దాదా ఎంబీబీఎస్, కొమరం పులి చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. చివరిగా సల్మాన్ ఖాన్ నటించిన 'టైగర్ జిందా హై' చిత్రంలో రా చీఫ్ గా నటించారు. గిరీష్ కర్నాడ్ మృతిపై దక్షిణాది చిత్ర పరిశ్రమలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి.