సినిమాల్లో ఎవరో చేయాల్సిన పాత్రల్ని కొన్ని కారణాల వల్ల మరొకరు చేస్తుంటారు. అలాంటి పాత్రల్లో కొన్ని.. నటులకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెడతాయి. ఇలాంటి సంఘటనే జగపతిబాబు విషయంలో చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు అరవింద్ స్వామి నటించాల్సిన ఓ కీలకపాత్ర జగపతిబాబు ఖాతాలోకి వెళ్లింది.
జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో కృష్ణమూర్తి పాత్ర ఎంతో కీలకమైంది. ప్రతినాయక ఛాయలున్న ఈ పాత్రలో నటించేందుకు ముందుగా చిత్రబృందం అరవింద్ స్వామిని సంప్రదించిందట. అప్పటికే తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న అరవింద్.. ఈ అవకాశాన్ని వదులుకున్నాడు. ఆ సమయంలో తెలుగులో స్టైలిష్ విలన్గా కొనసాగుతున్న జగపతిని ఎంపిక చేశాడు సుకుమార్. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న జగపతి బాబు మరోమెట్టు ఎదిగాడు.