'నువ్వు నాకు నచ్చావ్'.. ఈ పేరు వినగానే ప్రేమ కంటే పొట్ట చెక్కలయ్యే కామెడీయే గుర్తొస్తుంది. సినిమా అంటే హాస్యం ఉండాలనే ధోరణిలో కాకుండా కథలోనే నవ్వు సన్నివేశాలు ఒదిగిపోయేలా తీసిన ఈ చిత్రం విడుదలై నేటికి 18 ఏళ్లు పూర్తయ్యాయి. అందులోని కొన్ని సీన్లు ఇప్పటికీ నవ్విస్తూనే ఉన్నాయి.
2001 సెప్టెంబరు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. త్రివిక్రమ్ కథ-మాటలు అందించగా, విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు. సురేశ్‌బాబు సమర్పణలో స్రవంతి రవికిశోర్ నిర్మాతగా వ్యవహరించారు.
ఇందులో త్రివిక్రమ్ రాసిన ప్రతి డైలాగ్ ప్రేక్షకుడ్ని ఆలోచింపజేస్తుంది. కొన్నిసార్లు నవ్విస్తుంది. మరికొన్నిసార్లు ఏడిపిస్తుంది. వాటితో పాటే ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి.
వెంకటేశ్వర్లు(వెంకీ)గా వెంకటేశ్, నందుగా ఆర్తి అగర్వాల్ ఇద్దరూ పోటీపడి నటించారు. ఈ సినిమాతోనే టాలీవుడ్‌కు పరిచయమైంది ఆర్తి. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రకాశ్ రాజ్- వెంకటేశ్, బ్రహ్మానందం- వెంకటేశ్ మధ్యసాగే సంభాషణలు వచ్చినపుడు నవ్వు ఆపుకోవడం చాలా కష్టం. బంతి పాత్రలో సునీల్ నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆర్తి అత్తగా సుహాసిని నటన ప్రేక్షకుడ్ని కట్టిపడేస్తుంది. ఎం.ఎస్ నారాయణ, సుధ, హేమ, పృథ్వీ, ఆషా షైనీ తమ తమ పాత్రలతో మెప్పించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ చిత్రంలోని కొన్ని ప్రముఖ డైలాగ్స్
- నీకు ప్రేమ కావాలి, మీ నాన్నకు పరువు కావాలి, మా నాన్నకు మీరు కావాలి.. అంటే ఈ పెళ్లి జరగాలి, నువ్వు వెళ్లి పోవాలి, నన్ను మరిచిపోవాలి.
- నేను అమెరికా వెళ్లి డబ్బు సంపాదించి కారు కొంటాను. దాని పక్కన నిలబడి ఓ ఫొటో దిగి పంపించాలి. అంతేకాని అందులో మా నాన్నని ఎక్కించుకుని తిరగ్గలనా? లేదు. అదే మా ఊరిలో వ్యవసాయం చేసుకుంటే కనీసం మా నాన్నను స్కూటర్ ఎక్కించుకుని తిరగ్గలను అది నాకు హ్యాపీగా ఉంటుంది.
- ప్రేమ ఫలానా టైంకి ఫలానా వాళ్ల మీదే పుడుతుందని ఎవరు చెప్పగలరు అన్నయ్య? అదే తెలిస్తే ఏ ఆడపిల్ల ఆ టైంకి ఇంట్లో నుంచి బయటకు వెళ్లదు. ఇలా అందరి ముందు దోషిలా నిలబడదు.
- పెళ్లికొచ్చి అక్షింతలు వేసేవాడు ముఖ్యమా? నీ కూతురు మెడలో తాళి కట్టేవాడు ముఖ్యమా?
- మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టే వాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టే వాళ్ళు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా, ఎంత పోగొట్టుకున్న తేడా ఏముండదు.
- ఒక మనిషిని ద్వేషించడానికి కారణాలు ఉంటాయి కానీ ప్రేమించడానికి కారణాలు చెప్పలేం
- ఒక మనిషి ఎదిగాక అందరూ నమ్ముతారు, కానీ కేర్ అఫ్ అడ్రస్ లేని రోజుల్లోనే ఏదో సాధిస్తాం అని నమ్మినవాడే నిజమైన స్నేహితుడు
- నాకు జీవితం ఇచ్చినవాడు తన కొడుక్కి జీతం ఇప్పించమనడం పెద్ద సాయమా
- పొదిగిన గుడ్డు పిల్ల అయినప్పుడు కోడికి.. ఎదిగిన కొడుకు ప్రయోజకుడు అయినప్పుడు తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం
సినిమాకే హైలెట్‌గా నిలిచిన డైనింగ్ టేబుల్ సీన్..ఇప్పటికీ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. "దేవుడా ఓ మంచి దేవుడా" అంటూ వెంకీ.. "అమ్మా.. అడక్కుండానే జన్మనిచ్చావ్" అంటూ ప్రకాశ్ రాజ్ పండించిన హాస్యం పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">