శివానీ రాజశేఖర్ హీరోయిన్గా పరిచయమవుతున్న చిత్రం 'టూస్టేట్స్'. అడివి శేష్ హీరో. చిత్ర నిర్మాత- దర్శకుడు మధ్య మనస్పర్ధల కారణంతో షూటింగ్ మధ్యలోనే ఆపేశారు. ప్రస్తుతం ఈ విషయం కోర్టు కేసుల వరకు వెళ్లింది. నిర్మాత ఎం.ఎల్. వి సత్యనారాయణపై దర్శకుడు వెంకట్రెడ్డి కేసు పెట్టాడు.
అసలేం జరిగింది...?
చేతన్ భగత్ నవల ' టూస్టేట్స్' ఆధారంగా.. అదే పేరుతో తెలుగులో సినిమాను రూపొందిస్తున్నారు. అడివి శేష్, శివానీ రాజశేఖర్ నటిస్తున్నారు. వెంకట్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎం.ఎల్.వి.సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మాత. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. చిత్రీకరణ సాగుతుండగా కథలో కొంత భాగాన్ని మార్చాలని నిర్మాత, దర్శకుడికి చెప్పాడు. ఈ కారణంలో వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి షూటింగ్ ఆగిపోయింది.
"వి.వి. వినాయక్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పలు చిత్రాలకు పనిచేశాను. "టూస్టేట్స్" సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నా. హీరో, హీరోయిన్, నిర్మాతలకు కథ పూర్తిగా వినిపించిన తర్వాతే షూటింగ్ మొదలు పెట్టాను. ప్రస్తుతం 70 శాతం చిత్రీకరణ పుర్తయింది. 'టూస్టేట్స్' కథలో మార్పులు చేయమని నిర్మాత నన్ను అడిగారు. నేను తిరస్కరించాను. ఈ సినిమా నుంచి నన్ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే నిర్మాతపై కోర్ట్ లో కేసు వేశాను." -వెంకట్రెడ్డి, చిత్ర దర్శకుడు
సినిమాపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయని, ఈ కథలో మార్పులు చేసినా, దర్శకత్వం నుంచి తనను తప్పించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని దర్శకుడు వెంకటరెడ్డి తెలిపాడు.
ఇది చదవండి: బైక్పై ప్రభాస్.. అభిమానులకు సర్ప్రైజ్