Super model Miss India Lipi Meshram: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా ప్రాంతంలో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా అక్కడ ప్రజలు విపరీతమైన కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతానికి చెందిన లిపి మెష్రమ్ అనే యువతి గోవాలో జరిగిన 'సూపర్ మోడల్ మిస్ ఇండియా' పోటీలో గెలుపొంది టైటిల్‌ను అందుకుంది. కిరీటాన్ని ముద్దాడిన అతి చిన్న వయస్కురాలిగా ఆమె ఘనత సాధించి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది.
తండ్రి కలను నిజం చేయాలనే తపనతో..
బస్తర్ జిల్లాలోని ఓ గ్రామంలో లిపి మెష్రమ్ పెరిగింది. ఆమె తండ్రిని 2009లో లాండిగూడ గ్రామంలో నక్సలైట్లు కాల్చి చంపారు. అయితే ఆయనకు తన కూతురు అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలవాలని కోరిక ఉండేది. దీంతో తన తండ్రి కలను నిజం చేయాలనే తపనతో.. లిపి మెష్రమ్ చదువుతో పాటు మోడలింగ్ షోల్లో పాల్గొనేది. ఈ క్రమంలోనే ఇటీవల గోవాలో జరిగిన అందాల పోటీల్లో పాల్గొని.. దేశ నలుమూలల నుంచి వచ్చిన పోటీదారులందరినీ ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.
"ఎవరైనా ఉన్నత స్థితికి రావాలంటే మంచి ఆలోచన అవసరం. నాకు కూడా అలాంటి ఆలోచనే వచ్చింది. దాన్ని నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాను. అందులో మా అమ్మ నాకు చాలా సహకరించింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ అండగా నిలిచారు. నేను మోడలింగ్ కోసం భిలాయ్‌లోని గ్లామరస్ స్టూడియోలో చేరాను. గ్రామీణ ప్రాంతం నుంచి వెళ్లిన నాకు మొదట చాలా కష్టమనిపించింది. ఇంటర్ననేషనల్ వీక్‌లో నాలుగు రౌండ్లు పూర్తయ్యాక గోవా నుంచి రమ్మని కాల్ వచ్చింది. ధైర్యంగా వెళ్లాను. టైటిల్‌ను గెలుచుకున్నాను."
- లిపి మెష్రమ్, సూపర్‌మోడల్ మిస్ ఇండియా
అందాల పోటీల్లో పాల్గొనడమే కాకుండా లిపి ఐఏఎస్‌కు కూడా సిద్ధమవుతోంది. అంతేకాదు సామాజిక కార్యకర్తగా పనిచేస్తోంది. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద బస్తర్ జిల్లా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది. లిపి జగదల్‌పుర్‌తో పాటు పెద్ద నగరాల్లో స్టేజ్ షోలు ఇచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలోని ఫిల్మ్ వరల్డ్‌లో ఆడిషన్స్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో జరిగే గ్లామరస్ పోటీల్లో పాల్గొనాలనుకుంటుంది. బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది.
ఇదీ చదవండి: 'ప్రభాస్ సెట్లో ఉంటే ఫుల్ ఎంజాయ్'