ఆస్కార్ వేడుక.. అదిరిపోయే విశేషాలు - ఆస్కార్ లేటేస్ట్ న్యూస్
మరికొన్ని గంటల్లో మొదలయ్యే 'ఆస్కార్స్' అంగరంగ వైభవంగా జరిగేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ అవార్డుకున్న ప్రత్యేకత ఏంటి? ఎప్పుడు మొదలైంది? ఎక్కడెక్కడ జరిగింది? లాంటి ఆసక్తికర విశేషాలు మీకోసం.
వచ్చేసింది.. ఆస్కార్ పండగొచ్చేసింది. తారలను, సినీ ప్రేమికులను ఆనంద డోలికల్లో ముంచెత్తే హాలీవుడ్ పెద్ద పండగకు సర్వం సిద్ధమైంది. పదమూడున్నర అంగుళాలుండే పుత్తడి బొమ్మను అందుకోవాలనేది చిత్రపరిశ్రమలోని అందరి కల. ఇది సినిమాకే కళ. ఈ ప్రతిమ అందుకున్నాక.. సూపర్ హీరోలను కూడా కంటతడి పెట్టిస్తుంది. తమ సినీ ప్రయాణాన్ని గుండెల్లో ముద్రిస్తుంది. ప్రేక్షకుల కళ్లలో మెరిపిస్తుంది. ఆ బంగరు బొమ్మకున్న విలువ అలాంటిది మరి. ఇది ఈ ఏడాది ఎవరి చేతుల్లోకి వెళ్లి ఎంత భావోద్వేగానికి గురి చేస్తుందో చూడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ఇంతటి గొప్ప ఆస్కార్ వేడుక గురించిన కొన్ని ఆసక్తికర విషయాలివి...
మొదటి వేడుక 15 నిమిషాల్లోనే..
సినీ ప్రపంచంలోని ప్రతిభావంతులకు దక్కే అత్యున్నత పురస్కారం అకాడమీ అవార్డను భావిస్తారు. దీన్నే మనం ఆస్కార్ అని పిలుస్తాం. మొదటి ఆస్కార్ పండగ జరిగింది మే 16, 1929. ప్రఖ్యాత హాలీవుడ్ రూజ్‌వెల్ట్ హోటల్‌లో 270 మంది అతిథుల సమక్షంలో అవార్డులు ప్రదానం చేశారు. దర్శకులు, సాంకేతిక నిపుణులకు మొత్తం 15 అవార్డులను అందజేశారు. ఆ వేడుక 15 నిమిషాల్లోనే ముగిసిపోవడం విశేషం. ఆ ఏడాదికి విజేతల వివరాలను మూడు నెలల ముందుగానే మీడియాకు తెలిపారు. కానీ 1930 నుంచి ఆ పద్ధతి మారిపోయింది.
ఇప్పటి సంబరం..
కరోనా కారణంగా ఫిబ్రవరిలో జరగాల్సిన 93వ అకాడమీ వేడుకలు రెండు నెలల ఆలస్యమయ్యాయి. అయినా లాస్‌ఏంజిలెస్‌లోని డాల్బీస్ వేదికగా ఆదివారం రాత్రి (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున) అట్టహాసంగా జరగనున్నాయి. మొత్తం 23 విభాగాల్లో అవార్డులను అందించనున్నారు. నామినేషన్లతోనే ప్రత్యేకతను సంతరించుకుంది ఆ వేడుక. 83 ఏళ్ల వయసులో ఉత్తమ నటుడిగా ఆంటోని హాఫ్కిన్స్ పోటీలో నిలిచి ఆశ్చర్యపరిచారు. అంతేకాదు తొలిసారి ఇద్దరు మహిళలు దర్శకత్వ విభాగంలో పోటాపోటీగా తలపడుతున్నారు. మ్యాంక్ అత్యధికంగా 10 విభాగాల్లో నామినేషన్ సాధించి తన సత్తా చాటింది. అంతేకాదు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ మొత్తం 35 నామినేషన్లు దక్కించుకుంది. ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలు. కరోనా కారణంగా సినిమాల సంఖ్య తగ్గినా, ఆస్కార్ అందించే వినోదంలో 'తగ్గేదే లే' అన్నట్లుగా ఏర్పాట్లు చేశారు.
ఒకే అవార్డు వేర్వేరుగా..
మొదటి అకాడమీ వేడుకల్లో ఉత్తమ దర్శకుడి విభాగాన్ని డ్రామా, కామెడీ... ఇలా రెండుగా విడగొట్టి ప్రత్యేకంగా అవార్డులిచ్చారు. బెస్ట్ ఒరిజనల్ స్కోర్ విభాగంలోనూ ఇలా రెండు రకాలుగా పురస్కారాలు అందేవి. ఆర్ట్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, కాస్ట్యూమ్ డిజైనింగ్‌లను కూడా 1930ల నుంచి 1960 మధ్య కాలంలో కలర్, బ్లాక్ అండ్ వైట్ చిత్రాలకు వేర్వేరుగా అవార్డులిచ్చారు.
తడబడి.. తప్పు దిద్దుకొని..
ఇంత భారీ వేడుకలో ఓసారి అవార్డు గ్రహీతల పేర్లు మార్చి తప్పులో కాలేసింది అకాడమీ. 89వ ఆస్కార్ వేడుకల్లో ‘మూన్‌లైట్’కి బదులుగా ‘లాలా ల్యాండ్’ను ఉత్తమ చిత్రంగా ప్రకటించింది. ఆ తర్వాత తప్పు దిద్దుకొని అసలైన విజేతను ప్రకటించారు.
అట్టహాసంగా వేదిక
లాస్ ఏంజిలెస్‌లో హాలీవుడ్‌లోనే పలు మార్లు ఆస్కార్ వేదికలు మారాయి. హాలీవుడ్ రూజ్‌వెల్ట్ హోటల్, అంబాసిడర్ హోటల్, ష్రైన్ ఆడిటోరియమ్.. ఇలా ఎప్పటికప్పుడు వేదిక మారుతూ వచ్చింది. 1961లో తొలిసారి వేదికను కాలిఫోర్నియాకు మార్చారు. మళ్లీ 1969లో తిరిగి లాస్ ఏంజిలెస్‌కు తీసుకొచ్చారు. 1990ల నుంచి 2001 వరకు ష్రైన్ ఆడిటోరియమ్‌లోనే వేడుకలు జరగగా 2002 నుంచి ఇప్పుడు లాస్ ఎంజిలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో చేయడం మొదలెట్టారు. అప్పటి నుంచి ఈ ఏడాది వరకూ ఈ పసిడి పండగ అక్కడే అట్టహాసంగా జరుగుతోంది.
ఆస్కార్‌నే తిరస్కరించారు
బంగారు బొమ్మను కళ్లకద్దుకు తీసుకునేవారే కాదు, బాహాటంగా తిరస్కరించినవారూ ఉన్నారు. డ్యుడ్లీ నికోల్స్ అనే రచయిత అకాడమీకి, రచయితల సంఘానికి వచ్చిన విభేదాల కారణంగా 1935లో అవార్డును తీసుకోలేదు. ఆ తర్వాత మూడేళ్లకు తిరిగి స్వీకరించాడు. ఉత్తమ నటుడి విభాగంలో జార్జ్ సి. స్కాట్ 1970లో తిరస్కరిస్తే, సినీ పరిశ్రమలోని వివక్షకు వ్యతిరేకంగా గాడ్‌ఫాదర్(1972)లో మార్లన్ బ్రాండో అవార్డును బహిష్కరించారు.
‘ఉత్తమ విదేశీ చిత్రం’లో మనం
ఉత్తమ విదేశీ చిత్రం అవార్డును 29వ అకాడమీ అవార్డుల వేడుకలో అంటే 1957లో ప్రవేశపెట్టారు. ఈ అవార్డు ప్రవేశపెట్టిన మొదటి ఏడాదే మనదేశం నుంచి ‘మదర్ ఇండియా’ చిత్రం నామినేట్ అయింది. దీనికి అవార్డు దక్కలేదు. ఆ తర్వాత మీరా నాయర్ ‘సలాం బాంబే’(1988), ఆమిర్ ఖాన్ ‘లగాన్’ (2001) చిత్రాలు పోటీలో నిలిచాయి. ఇవీ పురస్కారానికి నోచుకోలేదు. ఈ ఏడాది మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ను బరిలోకి దింపినా.. అకాడమీ నుంచి మొండి చేయే ఎదురైంది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగాన్నే ఇప్పుడు ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా మార్చారు. 1957కి ముందు స్పెషల్ అచీవ్‌మెంట్ అవార్డు పేరున మాత్రమే బయటి చిత్రాలను గుర్తించేవారు.