తొలి ప్రేమ శిల లాంటిది.. శాశ్వతంగా గుర్తుండిపోతుంది. మలి ప్రేమ కల లాంటిది.. ఎన్నో కలలు వస్తుంటాయి. పోతుంటాయి. వెండితెరపై రసవత్తర ప్రేమకథలతో అలరించే నాయకానాయికలూ ఈ ప్రేమ భావనలకు అతీతులు కాదు. ప్రతిఒక్కరినీ ఆ తొలివలపు ఏదో ఒక సమయంలో తీయగా చుట్టుముట్టే ఉంటుంది. ఓ వయసుకొచ్చాక ప్రేమ సంద్రంలో మునిగి తేలడం వేరు.. తెలిసీ తెలియని వయసులో ఆ అపురూప భావనకు లోను కావడం వేరు. నిజానికి తొలి ప్రేమకథలు భలే గమ్మత్తుగా అనిపిస్తుంటాయి. జీవితాన్ని వెనక్కు తిరిగి చూసుకున్నప్పుడల్లా మనసుల్ని సుతిమెత్తగా మీటుతుంటాయి. అలాంటి మధురమైన తొలి ప్రేమ భావనలు మన వెండితెర ముద్దుగుమ్మల జీవితాల్లో చాలానే ఉన్నాయి. ఆ ముచ్చట్లేంటి? అసలిప్పుడు ప్రేమ, పెళ్లిపై వాళ్ల అభిప్రాయాలేంటి తెలుసుకుందాం.
కిండర్‌గార్డెన్ రోజుల్లోనే..
"ఎప్పటికైనా ప్రేమ పెళ్లే చేసుకుంటా. ప్రస్తుతం ఓ గొప్ప ప్రేమికుడి కోసం ఎదురు చూస్తున్నా. కిండర్‌గార్డెన్‌కు వెళ్లే రోజుల్లోనే నేను తొలిసారి ప్రేమలో పడ్డా. ఆ అబ్బాయి పేరు ఆడమ్. అతనొక అమెరికన్ అబ్బాయి. 'టైటానిక్' సినిమా చూశాక లియోనార్డో డికాప్రియోపై మనసు పారేసుకున్నా. ప్రస్తుతానికైతే సింగిల్‌గానే ఉన్నా. నాకు కాబోయే వాడికి హాస్య చతురత, పరిశుభ్రత ఉండాలి. అన్నింటి కంటే మంచి మనసు ముఖ్యం.’’
-శ్రుతిహాసన్
మూడు నుంచి పన్నెండో తరగతి వరకు!
"నా దృష్టిలో ప్రేమ అందమైన అనుభూతి. ప్రతిఒక్కరూ జీవితంలో ఏదో ఒక దశలో ప్రేమలో పడే ఉంటారు. నేను మూడో తరగతిలోనే తొలిసారి ప్రేమలో పడ్డా. అది నా పన్నెండో తరగతి వరకు కొనసాగింది. ఆ అబ్బాయి పేరు నేను చెప్పను. తను చాలా అందంగా ఉండేవాడు. దూరం నుంచే చూసి ఇష్టపడేదాన్ని. కానీ పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. పన్నెండో తరగతి వరకు ఇద్దరం కలిసే చదువుకున్నాం. తనతో అప్పుడప్పుడు మాట్లాడినా.. ఆ విషయం ఎప్పుడూ బయట పడలేదు".
- పాయల్ రాజ్‌పుత్
అప్పట్లోనే అమ్మకి చెప్పా
"పదో తరగతి చదివేటప్పుడు నేనొక అబ్బాయిని చూసి ఆకర్షితురాలినయ్యా. తనూ నన్ను ఇష్టపడే వాడు. అదంతా ఆకర్షణే అని నాకు తెలుసు. ఓసారి ధైర్యం చేసి మా అమ్మకి మా ప్రేమ విషయం చెప్పా. తను అరుస్తుంది అనుకున్నా. కానీ, అమ్మ ముందు చదువుపై దృష్టి పెట్టు.. ఈ వయసులో ఇవన్నీ సహజమే. తర్వాత చదువు ధ్యాసలో పడి ఆ అబ్బాయిని మర్చిపోయా. అమ్మానాన్నలది ప్రేమ వివాహమే. వాళ్ల ప్రేమానురాగాల్ని చూసినప్పుడల్లా.. ప్రేమించే పెళ్లి చేసుకోవాలని బలంగా అనిపిస్తుంది."
- కియారా అడ్వాణీ
4వ తరగతిలోనే ప్రేమ పాఠాలు
"నాలుగో తరగతిలోనే నా మదిలో ప్రేమ గంటలు మోగాయి. కొంచెం పెద్దయ్యాక ఓ అబ్బాయితో డేట్‌కు వెళ్లా. నాకు తొలి వాలెంటైన్ ప్రపోజ్ అందింది అతని నుంచే. ఇక ఇప్పటి వరకు తీవ్రస్థాయిలో హార్ట్ బ్రేక్ అయింది మాత్రం ఒకేసారి. అదెవరితో అన్నది చెప్పను. హీరోల్లో అయితే ఫస్ట్ క్రష్ షారుఖ్. ప్రేమించే వ్యక్తి విషయంలో పెద్దగా కోరికలు లేవు.
- నిధి అగర్వాల్
తొమ్మిదిలో ప్రేమ.. పదిలో బ్రేకప్
"నా స్నేహితులందరి కన్నా ఆలస్యంగా ప్రేమలో పడింది నేనే. తొమ్మిదో తరగతి చదివే రోజుల్లో నేను తొలిసారి ప్రేమలో పడ్డా. ఏడాదికే అది విఫలమైంది. నేను ప్రేమించిన అబ్బాయి ఎవరన్నది చెప్పను కానీ, మా ఇద్దరి ప్రేమ ఏడాది నడిచింది. తర్వాత నన్ను ప్రేమించిన అబ్బాయి పదో తరగతి పరీక్షలు వస్తున్నాయని చెప్పి నన్ను వదిలేశాడు. అప్పుడు నాకు బాధగా అనిపించింది. ఆ రోజుల్లో సెల్‌ఫోన్లు లేవు కదా. అందుకే మా ఇంటి పక్కనే ఉన్న పీసీవో నుంచి తనకు ఫోన్ చేసి ఏడ్చేదాన్ని. నన్నెందుకు వదిలేశావ్? అని అడిగేదాన్ని. ఇప్పుడవన్నీ తలచుకుంటే చాలా నవ్వొస్తుంటుంది."
- తాప్సి