కమల్ హాసన్-శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'భారతీయుడు 2' షూటింగ్లో, ఇటీవలే క్రేన్ అదుపుతప్పి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమైన క్రేన్ ఆపరేటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ చిత్రీకరణ జరిగిన స్టూడియోపై ఇక నుంచి నిషేధం విధించనున్నారని సమాచారం.
స్టూడియోపై నిషేధం
ప్రమాదం జరిగిన ఈవీపీ ఫిల్మ్ స్టూడియోపై, గతంలో ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా(ఎఫ్ఈఎఫ్ఎస్ఐ) మూడేళ్లపాటు నిషేధం విధించింది. తాజాగా దీనిని పునః ప్రారంభించి చిత్రీకరణలకు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'భారతీయుడు 2' షూటింగ్లో ప్రమాదం జరగటం వల్ల మరోసారి వార్తల్లో నిలిచిందీ స్టూడియో.
చిత్రయూనిట్నూ విచారించే అవకాశం
ప్రమాదానికి కారణమైన క్రేన్ ఆపరేటర్ శిక్షణ తీసుకోలేదని, యంత్రాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియదని పోలీసుల విచారణలో తేలింది. అతడిపై ప్రస్తుతం కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి, చిత్ర దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్‌లను ప్రశ్నించే అవకాశముంది.
ఇదీ చూడండి..విజయ్ దేవరకొండ తర్వాతి చిత్రం ఆ దర్శకుడితో!