అభిమానులు తమ స్టార్స్ సినిమాల్ని ఎంజాయ్ చేస్తారని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి అన్నాడు. కానీ సాధారణ ప్రేక్షకులూ చిత్రాల్ని ఇష్టపడేలా తీయాలని చెప్పాడు. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన జక్కన్న.. ఇటీవల విడుదల చేసిన 'ఆర్.ఆర్.ఆర్' మోషన్ పోస్టర్ గురించి ముచ్చటించాడు. కరోనా ప్రభావం ఇంతలా ఉంటుందని ఎవరూ ఊహించలేదని పేర్కొన్నాడు.
'వైరస్ నియంత్రణకు లాక్‌డౌన్ మంచిదే'
"ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్ని ఎవరూ ఊహించలేదు. అంతా ఉన్నట్లుండి జరిగింది. 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతోంది. చివరి దశకు వచ్చింది. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో కరోనా భారత్‌కు వచ్చింది. దీంతో సామాజిక దూరం పాటించాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా రెండు రోజుల్లోనే సినిమా షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది. ఆపై నలుగురు ఆఫీసుకు వెళ్లి సినిమా పనులు చూసేవారు. ఇప్పుడు ఇంట్లో కూర్చుని పనిచేస్తున్నాం. ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ విధించడం, ఆపై 21 రోజులు లాక్‌డౌన్ ప్రకటించడం.. అంతా అకస్మాత్తుగా జరిగాయి. వైరస్ నియంత్రణకు ఇలా చేయడం మంచిదే"
అదో గొప్ప ఫీలింగ్
"నా మైండ్ సగం కరోనా ఆలోచనలతో నిండిపోయింది. మిగిలిన సగం.. చరణ్ పుట్టినరోజు వస్తోంది కదా అని, దానికి ముందే మోషన్ పోస్టర్ విడుదల చేయాలి. మనం చేయగలమా? లేదా? అనే ఆలోచనలతో ఉన్నా. మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. మన క్రియేటివిటీని ప్రజల ముందుకు తీసుకొచ్చినప్పుడు వాళ్లు ప్రశంసిస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అది గొప్ప ఫీలింగ్"
సాధారణ ప్రేక్షకుడూ కేకలు వేయాలి
"మా సినిమాలో తారక్, చరణ్‌లాంటి ఇద్దరు స్టార్స్ ఉన్నారు. మనం థియేటర్‌కు వెళితే ఫ్యాన్స్ తక్కువగా ఉంటారు, ప్రేక్షకులు ఎక్కువగా ఉంటారు. అభిమానులు కేకలు వేస్తూ సినిమాను ఎంజాయ్ చేస్తారు. కానీ, ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, వారి అభిప్రాయాలు ఏంటని గమనించాలి. ఇప్పుడు సాధారణ ప్రజలూ మా మోషన్ పోస్టర్‌ను ఇష్టపడ్డారు. అందుకు చాలా హ్యాపీగా ఉంది"
'ఆర్.ఆర్.ఆర్'ను భారంగా భావించలేదు
"'ఆర్.ఆర్.ఆర్'లో ఇద్దరు హీరోలు ఉన్నారు. వారికి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగని వారితో సినిమా తీయడాన్ని భారంగా భావించలేదు. నా చిన్నతనంలో కామిక్ పుస్తకాలు చదివినప్పుడు సూపర్‌మ్యాన్, స్పైడర్ మ్యాన్ లాంటి ఇద్దరు హీరోలు కలిస్తే బాగుంటుందనే ఆలోచనలు ఉండేవి. ఇప్పుడు ఈ సినిమాకు అలా అన్నీ కలిసి వచ్చాయి. చరణ్, ఎన్టీఆర్ మంచి స్నేహితులు. ఇప్పుడు సినిమాకు వారి బంధం ఉపయోగపడుతోంది"
2021లో రానున్న 'ఆర్.ఆర్.ఆర్'
'ఆర్.ఆర్.ఆర్'లో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమరం భీమ్‌గా తారక్ నటిస్తున్నారు. ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లు. 2021 జనవరి 8న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్: ఉత్తమ నటులుగా నాని, సమంత