బాలీవుడ్ జోడి రణ్బీర్ కపూర్-అలియా భట్.. గత రెండేళ్ల నుంచి ప్రేమలో మునిగితేలుతున్నారు. ఒకవేళ వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే, ప్రపంచంలో తన కంటే ఎక్కువ సంతోషించేవారు ఉండరని అంటోంది హీరోయిన్ కరీనా కపూర్. ముంబయిలో ఆదివారం జరిగిన 'ఎమ్ఏఎమ్ఐ సినిమా మేళా విత్ స్టార్' కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పింది.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత-దర్శకుడు కరణ్ జోహార్.. "ఎప్పుడైనా కరీనా కపూర్ నీకు వదిన అవుతుందని అనుకున్నావా" అని అలియాను ప్రశ్నించగా, ఆమెకంటే ముందే స్పందించిన కరీనా "అలియా నాకు మరదలైతే ప్రపంచంలో నాకన్నా సంతోషించే వ్యక్తి ఇంకెవరు ఉండరేమో" అంటూ సమధానమిచ్చింది.
అనంతరం మాట్లాడిన అలియా.. ఇంతవరకు ఈ విషయం గురించి ఆలోచించలేదని, ప్రస్తుతానికైతే ఆలోచించకూడదని అనుకున్నానని చెప్పింది.
ఒకేవేళ పెళ్లి చేసుకుంటే, కరీనా కపూర్లా సినీ కెరీర్ను సమన్వయం చేసుకోవాలని అలియాకు సూచించాడు కరణ్. ఈ వ్యాఖ్యలపై స్పందించిందీ భామ. తనకు ప్రేరణనిచ్చిన వారిలో కరీనా ఒకరని చెప్పింది. ఎవరైనా వివాహం చేసుకున్న తర్వాత సినిమాలు చేయడంలో నెమ్మదిస్తారు. కానీ ఆమె మాత్రం ఈ పద్ధతిని మార్చేసిందని తెలిపింది అలియా.
ప్రస్తుతం కరీనా కపూర్, అలియా భట్.. కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న 'తఖ్త్' సినిమాలో కలిసి నటిస్తున్నారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందీ చిత్రం.