బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణానికి తానే కారణమని వస్తున్న ఆరోపణలపై ఎట్టకేలకు స్పందించింది అతడి గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి. ఆత్మహత్యకు తాను ప్రేరేపించానని వస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదని చెప్పారు. న్యాయవ్యవస్థ పట్ల తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపింది. నిజమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ఈమేరకు ఓ వీడియోను విడుదల చేసింది.
"నేను దేవుడిని నమ్ముతాను. నాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. నాపై పలు మీడియాల్లో వస్తున్న కథనాలపై న్యాయవాదుల సూచన మేరకు స్పందిస్తాను. సత్యం గెలుస్తుందని భావిస్తున్నాను. నిజమే విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను" అని రియా ఈ వీడియోలో చెప్పింది.
కోర్టు పరిధిలో ప్రస్తుతం ఈ కేసు ఉన్నందున న్యాయవాదుల సూచన మేరకు స్పందిస్తానని రియా చక్రవర్తి స్పష్టం చేసింది. సుశాంత్ నుంచి ఈమె భారీగా డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై రియాపై సుశాంత్ సింగ్ తండ్రి కేసు పెట్టగా, ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.