బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్(బాఫ్టా) ప్రచారకర్తగా మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ ఇటీవలే ఎంపికయ్యాడు. దీనిపై రెహమాన్ స్పందిస్తూ.. కెరీర్లో అత్యుత్తమ బాధ్యతలు దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. అదే విధంగా భారత్‌లో ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న ప్రతిభావంతులకు తాను సహాయం అందించాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశాడు.
ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ మద్దతుతో భారతదేశంలోని చలనచిత్రాలు, టీవీ రంగాల్లో పనిచేసే ఐదుగురు ప్రతిభావంతులను రెహమాన్ గుర్తించాల్సిఉంది. వారికి మద్దతుగా నిలవడమే లక్ష్యంగా రెహమాన్ బృందం పనిచేయాల్సి ఉంటుంది. దేశంలోని సృజనాత్మకను కనుగొనడానికి బాఫ్టా సహాయం చేయడమే కాకుండా ఆ సంస్థ గురించి దేశంలోని ప్రజలకు అవగాహన కల్పిస్తామని రెహమాన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
"నా బృందంలోని ఇతర న్యాయమూర్తులతో భారతదేశంలోని అద్భుతమైన, అసలైన స్వరాలను కనుగొనడం నా పని. ఎంపిక చేసిన వారికి ఏడాది పాటు శిక్షణ అందిస్తాం. శిక్షణలో భాగంగా సరైన వ్యక్తులకు అవకాశం ఇవ్వడం సహా మెంటర్షిప్, స్క్రీనింగ్, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తాం. అలాంటి ప్రతిభ గల బాఫ్టా ప్రతినిధులతో మాట్లాడినప్పుడు వారిలో మరింత మార్పు వస్తుంది".
- ఏఆర్ రెహమాన్, సంగీత దర్శకుడు
గత 20ఏళ్లలో నిర్మాతగా, స్వరకర్తగా భారతీయ చిత్రపరిశ్రమలో తన అనుభవం దేశంలోని అత్యున్నత ప్రతిభను వెలికి తీయడానికి సహాయపడుతుందని రెహమాన్ భావించాడు. తన అనుభవం గురించి ప్రశ్నలు ఎదుర్కొన్న రెహమాన్.. సంగీతంలో ఉత్తమ స్థాయి స్వతహాగా అనుభవంతోనే వస్తుందని అభిప్రాయపడ్డాడు. "ఏ పనిలోనైనా మీ స్వభావం కలిగి ఉండాలి. నాకు నేనుగా స్వరాన్ని కనుగొని అసలైనదిగా ఉండాలనే తపనతో ఉండాలి. ఇలాంటివి ఉంటే అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి" అని రెహమాన్ అన్నాడు.
భారతీయ సంగీతం అంతర్జాతీయంగా ఎప్పుడో ప్రసిద్ధి చెందినప్పటికీ.. దేశం కోసం మనవంతు ప్రయత్నం చేయడానికి అందరూ కలిసి రావాలని రెహమాన్ అన్నాడు. ఐకమత్యమే మహాబలం అన్నట్టుగా భారతదేశం మొత్తం కలిసి మన గొప్పతనాన్ని చాటుకోవాలని రెహమాన్ పిలుపునిచ్చాడు.
ఇదీ చూడండి: 'బాఫ్టా' బ్రాండ్ అంబాసిడర్‌గా ఏఆర్ రెహమాన్