తెలుగు చిత్రసీమలో 'ఛలో' చిత్రంతో అడుగుపెట్టిన కథానాయిక రష్మిక మందన. ఆ తర్వాత 'గీతా గోవిందం', 'సరిలేరు నీకెవ్వరు', 'భీష్మ' సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అనతి కాలంలోనే అగ్రకథానాయికల జాబితాలో చేరిపోయింది. ఈ మధ్యే తమిళంలో కార్తీ సరసన 'సుల్తాన్' చిత్రంలో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి 'పుష్ప'లో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ.. భిన్నమైన పాత్రల్లో నటించడం తనకిష్టమని అంటోంది.
"ప్రేక్షకులు నా నటన గురించి ఎలా స్పందిస్తారో తెలుసుకోవడానికి ఎప్పుడూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటా. అదే నన్ను వైవిధ్యమైన పాత్రల వైపు నడిపిస్తోంది. నటనలో నాకు ఎక్కువ అనుభవం లేదు. అందుకే ఓ వ్యక్తిగా భిన్నమైన పాత్రలు చేసినప్పుడు అవి ఎలా ఉంటాయో తెలుసుకోవడం ఆసక్తిగా ఉంటుంది. ఒకే రకమైన కథల్లో నటించడం ఇష్టం ఉండదు. నేను నటించిన 'గీతా గోవిందం', 'డియర్ కామ్రేడ్', ఇప్పుడు నటిస్తోన్న 'మిషన్ మజ్ను', 'గుడ్‌బై'.. ఇవన్నీ భిన్నమైనవి. ప్రేక్షకులు నన్ను విభిన్నమైన ప్రాతల్లో చూస్తున్నారు. అలా వారిని మెప్పించడం అంతా ఈజీ కాదు. నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ప్రజలు వాటిని వివిధ భాషల్లో చూశారు. అందులో ఒకటి 'డియర్ కామ్రేడ్'. ఈ చిత్రం పదికోట్ల వ్యూస్ సాధించిందని ఇటీవల తెలిసింది. ఇది చాలా పెద్ద విషయం. ముంబయి ప్రేక్షకులు నన్ను ఇప్పటికీ దక్షిణాది సినిమా పాత్రల ద్వారానే గుర్తుపడతారు. ఆ విధంగానే భాషపరమైన అడ్డంకులు తొలగిపోతున్నాయని తెలుసు. నేడు ప్రేక్షకులు మంచి కథ ఉన్న ఏ భాషా చిత్రాన్నైనా చూస్తున్నారు. నేను దక్షిణాది నటిని కనుక ఇక్కడి సినిమాలు చేస్తున్నాను. కానీ బాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్నా. ఇప్పుడు భాషకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతున్నాయి. కాబట్టి మంచి సినిమాల్లో నటించాలనుకుంటున్నా" అని తెలిపారు.
ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి 'మిషన్ మజ్ను'లో నటిస్తోంది. సినీయర్ నటుడు అమితాబ్ బచ్చన్‌తో 'గుడ్‌బై' చిత్రంలోనూ చేస్తోంది. షూటింగ్ జరుగుతోంది. ఇక తెలుగులో 'ఆడవాళ్లు మీకు జోహార్లు'లోనూ చేస్తోంది.
ఇదీ చూడండి: రష్మిక నటి కాకపోయి ఉంటే?- 'ఖైదీ 2' అప్పుడే!