బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసులో అరెస్టయిన నటి రియా బెయిల్ పిటిషన్ గురువారానికి వాయిదా పడింది. అక్టోబర్ 6వ తేదీవరకూ ఈమెకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఆమె బెయిల్ కోసం బొంబాయి హైకోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్‌పై బుధవారం విచారణ జరగాల్సి ఉంది. కానీ ముంబయిలో భారీగా వర్షాలు పడుతున్న కారణంగా హైకోర్టు విచారణలను గురువారానికి వాయిదా వేసింది.
తాను అమాయకురాలినని, ఎన్సీబీ బృందం ఉద్దేశపూర్వకంగానే తనతోపాటు తన కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని రియా.. బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నట్లు పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. పోలీసులు, కేంద్ర దర్యాప్తు బృందాల విచారణ కారణంగా ఇప్పటికే తన మానసిక ఆరోగ్యం ఇబ్బందికరంగా మారిందని పిటిషన్‌లో ఆమె పేర్కొంది. తాను పరిచయం కాకముందు నుంచే సుశాంత్‌కు డ్రగ్స్ అలవాటు ఉందని, కొన్ని సందర్భాల్లో మాత్రమే అతడికి తాను మాదకద్రవ్యాలు అందించానని, అది కూడా తన సొంతడబ్బుతో కొనుగోలు చేశానని బెయిల్ పిటిషన్‌లో రియా వెల్లడించింది.
స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించిన బిహార్ డీజీపీ
సుశాంత్ సింగ్ కేసు విచారణలో భాగంగా, ముంబయి పోలీసులపై పలు వ్యాఖ్యలు చేసిన బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించారు. సొంత రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనేందుకే ఆయన విరమణ చేసినట్లు సమాచారం.
దీంతో రియా తరఫు న్యాయవాది.. 'సుశాంత్ సింగ్‌కు ఎలాంటి న్యాయం జరగలేదు కానీ, గుప్తేశ్వర్ పాండేకు మాత్రం న్యాయం జరిగింది' అని ఆరోపణలు చేశారు. దీంతో గుప్తేశ్వర్ పాండే మీడియాతో మాట్లాడారు.
'సుశాంత్ సింగ్ కేసు విచారణకు, నా రిటైర్‌మెంట్‌కు సంబంధం లేదు. న్యాయానికి అనుగుణంగానే నేను నడుచుకుంటాను. ఇప్పటివరకూ ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదు. అలాగే దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాజకీయాల్లోకి వెళ్లకుండా సామాజిక సేవ చేయగలను' గుప్తేశ్వర్ అన్నారు.