కరోనా పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ఊరటనిచ్చేందుకు కేంద్రీయ చలన చిత్ర ధ్రువీకరణ సంస్థ (సెన్సార్ బోర్డ్) కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌తో సినిమాల విడుదల ఆగిపోవడం, చిత్రీకరణలు నిలిచిపోవడం వల్ల నిర్మాతలపై అదనపు భారం పడుతోంది. ఇప్పుడీ విషయంపై సెన్సార్ బోర్డు దృష్టి సారించింది.
తాజాగా సంస్థ ఛైర్మన్ ప్రసూన్ జోషి ఆధ్వర్యంలోని బృందం.. ముంబయి, హైదరాబాద్, త్రివేండ్రం, చెన్నై, ఒడిశా, కోల్‌కతా, గువాహటి, దిల్లీ, బెంగళూరులోని ప్రాంతీయ సెన్సార్ కార్యాలయాల అధికారులతో చర్చించారు. ఈమేరకు ప్రాథమికంగా రెండు అంశాలపై నిర్మాతలకు వెసులుబాటు కల్పించాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయ అధికారి వి.బాలకృష్ణ వెల్లడించారు.
"లాక్‌డౌన్ వల్ల నిర్మాతలకు ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధ్యమైనంత త్వరగా సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయాలని నిర్ణయించాం. తొలి ప్రాధాన్యతగా సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేస్తాం. అలాగే సినిమా సెన్సార్‌కు నిర్మాతలు వ్యక్తిగతంగా హాజరుకాకున్నా అవసరమైన మేర ఆన్‌లైన్‌లోనే సంప్రదించి, ఈ-మెయిల్‌లో సర్టిఫికెట్లు జారీ చేస్తాం. నిర్మాత కోరుకున్న చోట సెన్సార్‌కు ఏర్పాట్లు చేసి తన సినిమాను ఏ రూపంలో(హార్డ్ డిస్క్, క్యూబ్) తీసుకొచ్చినా సెన్సార్ చేస్తాం. ఈ విధానాన్ని హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం అమలు చేయబోతుంది. కరోనాకు ముందు చాలా మంది చిన్న నిర్మాతలు అప్పులుచేసి సినిమాలు తీశారు. థియేటర్ల మూసివేతతో వారి చిత్రాలు ఆగిపోయాయి. ఇప్పుడు వారికి ఆర్థికభారం ఎక్కువ కావడం వల్ల ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నారు. వారంతా సెన్సార్ చేయాలని కోరుతున్నారు. అలాంటి వాళ్లు నష్టపోకుండా ఉండేందుకు సాధ్యమైనంత త్వరగా సెన్సార్ చేస్తున్నాం" అని బాలకృష్ణ చెప్పారు.
ఇదీ చూడండి.. బాలీవుడ్ స్టార్స్.. వర్క్ ఫ్రమ్ హోమ్