చిత్రసీమ ఎప్పుడూ కొత్తదనం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. కొత్త కథలు, కొత్త నేపథ్యాలు, కొత్త లుక్‌లు.. ఇలా అంతటా కొత్తదనం కనిపించాల్సిందే. అందులో భాగమే కొత్త హీరోయిన్ కూడా! అందుకే కథానాయికలు ఎంత మంది ఉన్నా.. కొత్తగా మరొకరికి చోటు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది తెలుగు చిత్రసీమ. ఈ ఏడాదీ మన తెరపై కొత్తందాలు బలంగా మెరిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అనుష్క, కాజల్, తమన్నా, శ్రుతిహాసన్ తదితర సీనియర్ నాయికలు ఇంకా జోరుమీద ఉన్నారు. సమంత, ప్రియమణి, శ్రియ తదితర భామలు పెళ్లి తర్వాతా వరుస అవకాశాలతో అదరగొడుతున్నారు. రష్మిక, పూజా హెగ్డే, కీర్తి సురేష్, సాయి పల్లవి, రకుల్‌ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా స్టార్లుగా హవా చూపుతున్నారు. నివేదా థామస్, అనుపమ పరమేశ్వరన్, నివేదా పేతురాజ్, నిధి అగర్వాల్, నభా నటేష్.. ఇలా నవతరం హీరోలకి తగ్గ భామలూ బోలెడంతమంది ఉన్నారు. అయినా సరే.. ఈ ఏడాది కొత్తందాలకి ఎర్రతివాచీ పరిచేసింది తెలుగు చిత్రసీమ. అమృత అయ్యర్, కేతికాశర్మ, ప్రియా భవాని శంకర్, కృతిశెట్టి, వర్ష బొల్లమ్మ.. ఇలా పలువురు అవకాశాల్ని దక్కించుకున్నారు. మొత్తంగా తెలుగు తెరపై ఆకట్టుకోబోతున్న కొత్త అందాలపై ఓ లుక్కేద్దాం.
అమృతా అయ్యర్
అనువాద చిత్రం 'విజిల్'తో తెలుగులోనూ మెరిసింది అమృతా అయ్యర్. అందులో చేసింది చిన్న పాత్రే అయినా..ఆమె అందం తెలుగు పరిశ్రమని ఆకట్టుకుంది. దాంతో వరుసగా అవకాశాలు వెల్లువెత్తాయి. '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' చిత్రంలో నటించిందామె. రామ్ చిత్రం 'రెడ్'లోనూ ముఖ్య పాత్ర పోషించింది. ఇటీవల నాగశౌర్యకి జోడీగా మరో చిత్రం కోసం ఎంపికైంది..
![Heroines who just started their Journey in Tollywood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10798263_her-2.jpg)
పూరి కాంపౌడ్లో కొత్త అందం
పూరి జగన్నాథ్ కాంపౌండ్ కొత్త భామలకి కేరాఫ్ అడ్రస్. ఆయన ఎంతోమంది నాయికల్ని పరిచయం చేశారు. ఈ ఏడాది బాలీవుడ్ భామ అనన్యా పాండేని 'లైగర్'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది.
![Heroines who just started their Journey in Tollywood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10798263_her-3.jpg)
కేతికా శర్మ
పూరి కాంపౌండ్ నుంచి వస్తున్న మరో నాయిక కేతికా శర్మ. ఆయన తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటిస్తున్న 'రొమాంటిక్'తో పరిచయమవుతోంది. ఈ సినిమా ఇంకా విడుదల కాకపోయినప్పటికీ ప్రచార చిత్రాల్లో ఆమె అందం తెలుగు పరిశ్రమని ఆకట్టుకుంది. దీంతో పాటు నాగశౌర్య సరసన ఓ మూవీ చేయనుంది కేతిక.
![Heroines who just started their Journey in Tollywood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10798263_her-1.jpg)
ప్రియా భవాని శంకర్
మంచు మనోజ్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'అహం బ్రహ్మాస్మి'. ఈ సినిమాతో తమిళమ్మాయి ప్రియా భవాని శంకర్ తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. తమిళంలో పలు చిత్రాల్లో మెరిసిన ఆమెపై కూడా చిత్రసీమ దృష్టిసారించింది.
![Heroines who just started their Journey in Tollywood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10798263_her-5.jpg)
కృతిశెట్టి
మంగళూరు ముద్దుగుమ్మలకి తెలుగు చిత్రసీమ బాగా అచ్చొచ్చింది. అనుష్క మొదలు ఎంతోమంది అక్కడి నుంచి వచ్చినవాళ్లే. 'ఉప్పెన'తో పరిచయమైన కృతిశెట్టి అక్కడి నుంచే వచ్చింది. ఆమె అందం ప్రచార చిత్రాలతోనే 'ధక్ ధక్ ధక్' అనిపించింది. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన చిత్రమిది. ఈ సినిమా ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇందులో కృతి నటనను మెచ్చిన నిర్మాతలు ఆమెకు వరుస ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం కృతి.. రామ్‌తో పాటు నాని, సుధీర్ బాబు, నిఖిల్ సరసన నటిస్తోంది.
![Heroines who just started their Journey in Tollywood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10798263_her-6.jpg)
వర్ష బొల్లమ్మ
'విజిల్'తో మెరిసిన వర్ష బొల్లమ్మ తెలుగులో 'చూసీ చూడంగానే' చిత్రంతో అదృష్టాన్ని పరీక్షించుకుంది. తర్వాత విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండకి జోడీగా 'మిడిల్ క్లాస్ మెలొడీస్'తో తెలుగు తెరకు పరిచయమైంది.
![Heroines who just started their Journey in Tollywood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10798263_her-7.jpg)
సయీ మంజ్రేకర్
బాలీవుడ్లో మొదటి సినిమాతోనే సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది సయీ మంజ్రేకర్. తాజాగా టాలీవుడ్‌లోనూ అవకాశం దక్కించుకుంది. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న 'గని'లో కథానాయికగా ఎంపికైంది. కిరణ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనుంది.
![Heroines who just started their Journey in Tollywood](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10798263_her-4.jpg)