చాలా రోజుల విరామం తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేసింది హీరోయిన్ వేదిక. 'బాణం' నుంచే టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఇక్కడ కెరీర్‌ను సరిగ్గా మలచుకోలేకపోయింది. అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చింది. 'దగ్గరగా దూరంగా' తర్వాత ఆమె 'రూలర్' చేసింది. నందమూరి బాలకృష్ణ హీరోగా, కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా వేదిక.. హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ఆ విషయాలివే.

అలా 'రూలర్'లో అవకాశమొచ్చింది
"తెలుగులో నాకు అవకాశాలకు ఎప్పుడూ కొదవ లేదు. క్రమం తప్పకుండా పిలుపు వస్తూనే ఉంది. అయితే తమిళం, మలయాళం, కన్నడ సినిమాలతో బిజీ కావడం వల్ల ఇక్కడ ఎక్కువగా చేయలేకపోయా. నా వ్యవహారాల్ని చూసుకోవడానికి ఇక్కడ మేనేజర్లను నియమించుకోలేదు. ఈ కారణంతోనే ఇతర భాషలపైనే దృష్టి పెట్టాల్సి వచ్చింది. కానీ ఈ ఏడాది ఇక్కడ అనువాదమైన 'కాంచన3'తో మరోసారి అందరూ నా గురించి మాట్లాడుకున్నారు. అదే నాకు 'రూలర్'లో అవకాశం తెచ్చిపెట్టింది. బాలకృష్ణతో అవకాశం అనగానే మరో మాట లేకుండా, వెంటనే ఓకే చెప్పా. ఆయన తెలుగు సినిమా లెజెండ్. పైగా ఈ కథ నాకు బాగా నచ్చింది. అలా 'రూలర్'లో నటించా"

బాలకృష్ణ మంచి డ్యాన్సర్
"ఇందులో నా పాత్రలో మూడు కోణాలు కనిపిస్తాయి. గ్లామర్, నటనతో పాటు సంప్రదాయబద్ధమైన లుక్ ఉంటుంది. బాలయ్యతో కలిసి రెండు పాటల్లో ఆడిపాడాను. అవి మంచి అనుభవాన్నిచ్చాయి. బాలకృష్ణ మంచి డ్యాన్సర్. నేనూ డ్యాన్స్‌ను ఇష్టపడతా. దాంతో సెట్‌లో ఇద్దరం ఉత్సాహంగా డ్యాన్స్ వేశాం. మాకు మళ్లీ ప్రేమ్‌రక్షిత్ మాస్టర్ తోడయ్యారు. ఆయన పాటల్ని తీర్చిదిద్దే విధానం చాలా బాగుంటుంది. చిరంతన్ భట్ మంచి పాటలు ఇచ్చారు"

బాలకృష్ణ సర్ది చాలా పెద్ద మనసు
"బాలకృష్ణతో కలిసి నటించడం ఎప్పటికీ మరిచిపోలేని అనుభవం. నటించడం ఒకెత్తయితే, సెట్‌లో ఆయన్నుంచి నేర్చుకున్న మంచి విషయాలు మరో ఎత్తు. ఎన్ని చెబుతారో. క్రమశిక్షణ, నిబద్ధత విషయంలో ఆయన తర్వాతే ఎవరైనా. సెట్‌లో అందరినీ ఒకలాగే చూస్తుంటారు. హీరోయిన్‌కో లేదంటే, ఇతర నటులకో ఏమైనా అయితే ఓకే కానీ, వాళ్ల స్టాఫ్‌కు సమస్య వచ్చినా స్పందించే హీరోలు ఎవరైనా ఉంటారా? నా స్టాఫ్‌లో ఒకరికి కాలి నొప్పి వచ్చిందని తెలిసేసరికి ఆయన వెంటనే స్పందించి డాక్టర్ దగ్గర అపాయింట్‌మెంట్ ఇప్పించారు. బాలకృష్ణది చాలా పెద్ద మనసు"

ఇకపై తెలుగు వరుసగా సినిమాలు చేస్తా
"మాస్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. తమిళం, మలయాళంలో ఎక్కువగా మాస్ మసాలా కథలు చేసే అవకాశం రాలేదు. తెలుగులో ఆ అవకాశం మరోసారి 'రూలర్'తో వచ్చింది. ఆద్యంతం ఆస్వాదిస్తూ సినిమాను చేశాను. ఇకపై తెలుగులో తరచూ కనిపిస్తుంటా. కొత్తగా మరికొన్ని కథలు వింటున్నా"
- " class="align-text-top noRightClick twitterSection" data="">