కరోనా బారిన పడకుండా నియంత్రించాలన్నా.. సోకిన తర్వాత త్వరగా కోలుకోవాలన్నా శరీరంగా రోగ నిరోధక శక్తి బలంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు ఇంటిపట్టునే ఉండి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవడానికి తామెలాంటి చిట్కాలు పాటిస్తున్నామో తెలుపుతూ పోస్టులు, ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. తాజాగా పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్.. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి తాను పాటిస్తోన్న ఓ ఆరోగ్య సూత్రాన్ని అందరితో షేర్ చేసుకుంది.
రకుల్.. పవర్‌ఫుల్!
ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా గుర్తింపు పొందిన రకుల్... లాక్‌డౌన్ కారణంగా దొరికిన ఈ ఖాళీ సమయాన్ని వర్కవుట్లు చేయడం, ఆరోగ్యంపై శ్రద్ధ వహించడానికే కేటాయిస్తోంది. ‘టీ-షర్ట్ ఛాలెంజ్ ’అంటూ వివిధ రకాల ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లు విసురుతూ తన అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటోందీ బ్యూటీ.
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ నుంచి రక్షణ పొందాలంటే రోగనిరోధక శక్తి ఎంతో కీలకమని సూచిస్తోంది రకుల్. ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవడానికి తాను పాటిస్తోన్న ఓ చిట్కాను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అందరితో షేర్ చేసుకుందీ అందాల తార.
కెఫీన్‌కు ప్రత్యామ్నాయం!
‘ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. అది కూడా సహజ పద్ధతుల్లో అయితే మరీ ఉత్తమం. 500 మిల్లీ లీటర్ల నీటిలో చిటికెడు అల్లం, మిరియాలు, పసుపు, దాల్చిన చెక్క, లవంగాలను కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా మరిగించండి. ఆపై పూర్తిగా చల్లారనిచ్చి తర్వాత తాగండి. ఈ మిశ్రమంలోకి కొంచెం సహజమైన తేనె కూడా కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పానీయం శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. అదేవిధంగా ఇది కెఫీన్‌కు సరైన ప్రత్యామ్నాయం కూడా!’ అని అందులో రాసుకొచ్చింది రకుల్.