గ్లామరే కాకుండా హాస్యభరతి పాత్రలు చేస్తూ అభిమానులను అలరిస్తున్న హీరోయిన్ రాశీఖన్నా. వెంకటేశ్-నాగచైతన్య మల్టీస్టారర్ 'వెంకీమామ'లో ఓ కథానాయికగా నటించింది. ఈ సినిమాకు కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకుడు. ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాశీఖన్నా పంచుకున్న చిత్ర విశేషాలు
చాలా సన్నబడినట్లు ఉన్నారు?
ఈ ఫిజిక్ కోసం చాలా కష్టపడ్డాను. ఉదయం, సాయంత్రం జిమ్‌లో కసరత్తులు చేశా. షూటింగ్.. జిమ్ ఇప్పుడు నా జీవితంలో ఈ రెండే ఉన్నాయి. కేవలం బరువు తగ్గడానికి, పాత్ర కోసం మాత్రమే జిమ్‌కు వెళ్లడం లేదు. మరింత దృఢంగా తయారు కావడానికి కసరత్తులు చేస్తున్నా. కాస్త బొద్దుగా కనిపించినా అవకాశాలొస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఓ నటిగా నేను ఫిట్‌గా ఉండాలి కదా.
'వెంకీమామ'లో మీ పాత్ర ఏంటి?
ఇందులో హారిక అనే ఫిలిం మేకర్ పాత్రలో నటిస్తున్నా. ఒకరోజు సడెన్‌గా సురేశ్‌బాబుగారి నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు నేను 'అయోగ్య' షూటింగ్‌లో భాగంగా పుదుచ్చేరిలో ఉన్నా. 'వెంకీమామ'లో నటించాలని అడిగారు. సంతోషంగా ఒప్పుకొన్నా. చైతూతో 'మనం'లో కలిసి నటించా. అది కేవలం ఒకరోజు షూటింగ్ మాత్రమే. చైతన్యతో కలిసి లవ్‌స్టోరీలో నటించాలని ఉండేది. అనుకోకుండా ఈ అవకాశం వచ్చింది. బాబీతో 'జై లవకుశ' కోసం కలిసి పనిచేశా. ప్రథమార్ధంలో నా పాత్ర ఎక్కువగా ఉంటుంది.
కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నారా?
అలా ఏం లేదు. కథ విన్న తర్వాతే సినిమా ఒప్పకున్నా. సురేశ్‌బాబు నిర్మాత కావడం వల్ల ఈ చిత్రం ఒప్పుకొన్నా. ఆయన తీసే సినిమాల్లో కథానాయిక పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది.
వెంకటేశ్‌తో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?
అద్భుతమైన నటుడు. హావభావాలు చాలా చక్కగా పలికిస్తారు. వెంకటేశ్‌తో కలిసి పనిచేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయన కామెడీ టైమింగ్ బాగుంటుంది.
ఇద్దరు హీరోలు తెరపై కనిపిస్తుంటే, హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని మీరు అనుకుంటున్నారా?
ఇద్దరు హీరోయిన్లు ఉన్న సినిమాల్లో నేను నటించా. ఏ పాత్రకు ఉండే ప్రాధాన్యం ఆ పాత్రకు ఉంటుంది. ప్రేక్షకులు నన్ను గుర్తు పెట్టుకుంటే చాలు. మలయాళంలో ఇలా చాలా సినిమాలు చేశా. హీరోయిన్ పాత్ర కాకపోయినా, అవి ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. ఒక నటిగా కేవలం హీరోయిన్‌గా గ్లామరస్ పాత్రలే చేస్తానంటే కుదరదు కదా! ఒక కేటగిరీకీ మాత్రమే పరిమితం కావాలని నేను ఎప్పుడూ అనుకోను. అన్ని రకాల పాత్రలు చేయాలి. ఈ సినిమాలో నాకు మంచి పాత్రే దక్కింది. చూస్తే మీకు అర్థమవుతుంది. బాబీ చాలా చక్కగా రాశారు. అలా వచ్చి వెళ్లిపోయే పాత్ర అయితే అస్సలు కాదు.
ఎప్పటి నుంచి మీరు వెంకటేశ్‌కు అభిమానిగా మారారు
నా చిన్నతనంలో ఆయన నటించిన కొన్ని సినిమాలు హిందీలో డబ్ అయ్యేవి. వాటిని చూసేదాన్ని. ఆయనతో నటించడం నా అదృష్టం. ఆధ్యాత్మికంగా ఆయన నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు.
ఒక వారం విరామంతో మీరు నటించిన రెండు సినిమాలు వస్తున్నాయి కదా! ఒత్తిడిగా ఫీలవుతున్నారా?
ఒత్తిడేమీ లేదు. గతంలోనూ వారం గ్యాప్‌తో 'టచ్ చేసి చూడు', 'తొలిప్రేమ' చిత్రాలు వచ్చాయి.
ఒకేసారి వేర్వేరు సినిమాల్లో నటించడం వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డారా?
'వెంకీమామ', 'ప్రతిరోజూ పండగే' చిత్రాలకు ఇబ్బంది పడలేదు. కానీ, 'వరల్డ్ ఫేమస్ లవర్'లో నా పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకోసం చాలా కష్టపడాల్సి వచ్చేది.
డబ్బింగ్ చెప్పటానికి సమయం ఉందా?
'వెంకీమామ'కు నేనే డబ్బింగ్ చెబుదామనకున్నా. కానీ వరుస షూటింగ్‌లు ఉండటం వల్ల కుదరలేదు. 'వరల్డ్ ఫేమస్ లవర్'కు మాత్రం నేను డబ్బింగ్ చెబుతున్నా.
సింగర్‌గా ఏమైనా ప్రయత్నిస్తున్నారా?
చిన్నప్పటి నుంచి సింగర్ కావాలన్నది నా కల. ఏడేళ్ల వయసులోనే సంగీతం నేర్చుకున్నా. కొన్ని పోటీల్లోనూ పాల్గొన్నా. ఆ తర్వాత లక్ష్యాలు మారిపోయాయి. ఇప్పుడు ఒక సినిమాలో పాట పాడుతున్నా. అయితే అది ఏ సినిమా.. ఏ పాట పాడుతున్నానో ఇప్పుడే చెప్పలేను. ఆ వివరాలు తర్వాత చెబుతా.
హిందీ నుంచి వచ్చిన మీరు మళ్లీ అటు ఎందుకు వెళ్లడం లేదు?
ఇక్కడే చాలా బిజీగా ఉన్నా. వరుస అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్‌కు వెళ్లిపోవాలి.. సినిమాలు చేయాలన్న ఆత్రుత ఏం లేదు. దక్షిణాది చిత్రాల్లోనూ నాకు మంచి పేరు వస్తోంది. ఎక్కడ ఉన్నా, మంచి సినిమా చేశామా? లేదా? అన్నది మాత్రమే చూసుకుంటా.
హీరోయిన్ల మధ్య పోటీని మీరెలా తీసుకుంటారు?
ప్రతి రంగంలోనూ పోటీ అనేది ఉంటుంది. పోటీ ఉంటేనే మనం ఏంటో తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న వారిలో రకుల్ నాకు బెస్ట్ ఫ్రెండ్. ఒక రకంగా 'వెంకీమామ'లో నేను చేసిన పాత్ర తను చేయాల్సి ఉంది.
తెలుగులో మీరు అనుకున్న పాత్రలు వస్తున్నాయా?
ఇప్పుడు చేస్తున్న పాత్రలన్నీ నాకు నచ్చినవే. అయితే, 'వరల్డ్ ఫేమస్ లవర్'లో నా పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చాలామందికి 'తొలి ప్రేమ'లో నా పాత్ర నచ్చింది. జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. అయితే ఒక సినిమా ఫ్లాఫయినా, అందులో నా పాత్రను ప్రేక్షకులు ప్రేమిస్తున్నారు.
వెబ్ సిరీస్‌లో నటిస్తారా?
మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తా.
మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఏమైనా ప్రయత్నిస్తున్నారా?
కొన్ని వచ్చాయి. ఆ పాత్ర చాలా ప్రభావవంతంగా ఉంటేనే చేస్తా.
'దిశ' ఘటనలాంటివి చదివినప్పుడు భయమేస్తుందా? కోపం వస్తుందా?
రెండూ వస్తాయి. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. నేరస్థులను నడిరోడ్డులో అందరి ముందూ నరికేయాలి. ప్రతి ఒక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. అయితే, న్యాయవ్యవస్థ, ప్రభుత్వం మాత్రమే సరైన నిర్ణయం తీసుకుంటాయి. చాలా కోపం ఉంది. అదే సమయంలో నిస్సహయ స్థితిలో ఉన్నా. ఎందుకంటే ఈ ఘటనపై నా అభిప్రాయం మాత్రమే చెప్పగలను. నిందితులను శిక్షించలేను కదా! నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రతి నటుడూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అమ్మాయిలు బయటకు వెళ్లినప్పుడు పెప్పర్ స్ప్రే తప్పకుండా తీసుకెళ్లండి.
సినిమాల్లో అశ్లీలత పెరగడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే దానిపై మీ అభిప్రాయం?
అదంతా మన ఆలోచనల బట్టి ఉంటుంది. ప్రజల్లో ప్రతి ఒక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది. ఏది మంచో ఏది చెడో వాళ్లే నిర్ణయించుకోవాలి.
మీ తర్వాతి సినిమాలు ఏంటి?
'వెంకీమామ' తర్వాత 'ప్రతి రోజూ పండగే' విడుదలకు సిద్ధమవుతోంది. 'శ్రీనివాస కల్యాణం' తర్వాత 'వరల్డ్ ఫేమస్ లవర్' ఒప్పుకొన్నా, ఈ రెండు సినిమాలకన్నా ముందే ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">