'అల వైకుంఠపురములో..' సినిమా తనను తెలుగు వారికి మరింత దగ్గర చేసిందని చెప్పింది హీరోయిన్ పూజా హెగ్డే. 'ముకుంద'తో పరిచయమై.. 'దువ్వాడ జగన్నాథమ్', 'సాక్ష్యం', 'అరవింద సమేత', 'గద్దలకొండ గణేష్' సినిమాలతో ఆకట్టుకుందీ భామ. అల్లు అర్జున్‌తో రెండోసారి ఆమె నటించిన చిత్రం 'అల వైకుంఠపురములో'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఈనెల 12న విడుదలై హిట్ అందుకుంది. బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సినిమాలో 'అమూల్య'గా నటించిన పూజ.. మీడియాతో మాట్లాడింది. తెలుగు సినిమాల్లో నటించడం గురించి ముచ్చటించింది.
న్యాయం చేయడం లేదు
నేను నా పనిపైనే దృష్టి పడతా. సినిమాలు, హిట్లను లెక్కించుకోను. ఈ సినిమా కోసం డబ్బింగ్ చెప్పా. చాలా కష్టంగా అనిపించింది. ఇంగ్లీష్ పదాలకు తెలుగు నేటివిటీ కలిపి చెప్పడం ఇంకా కష్టం. ఇప్పుడు ఓ పరంగా నేను తెలుగు అమ్మాయి అయిపోయా. నేను తెలుగు నేర్చుకోవడానికి ఎవరి దగ్గర శిక్షణ తీసుకోలేదు. నా సిబ్బందితో తెలుగులోనే మాట్లాడుతుంటా. కానీ ఇంటర్వ్యూలో తెలుగు మాట్లాడాలంటే భయంగా ఉంది. డబ్బింగ్ ఆర్టిస్టుల్లో కొందరు సరిగ్గా డబ్బింగ్ చెప్పడం లేదు. నా నటనకు తమ డబ్బింగ్ ద్వారా కొందరు ఆర్టిస్టులు న్యాయం చేయడం లేదు అనిపించింది. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవడానికి ఇది ఓ కారణం.
హీరోయిన్ మెసేజ్ చేసింది
"అరవింద సమేత' సినిమాలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. ఆ సమయంలో ఓ హీరోయిన్ నాకు మెసేజ్ చేసింది. నీకు ఎవరు డబ్బింగ్ చెప్పారు?, చాలా బాగుంది. నా సినిమాలో పాత్రకూ ఆమెతోనే డబ్బింగ్ చెప్పిస్తానంది. నేను నవ్వి.. ఆమె పారితోషికాన్ని మీరు ఇవ్వలేరులే అన్నా (నవ్వుతూ). ఆ హీరోయిన్ పేరు బయటపెట్టలేను. ఆ రోజు నాకు చాలా సంతోషంగా అనిపించింది. "సర్ నేనే డబ్బింగ్ చెప్పాలి అనుకుంటున్నా.. సరిగ్గా ఉంటే నా వాయిస్ పెట్టుకోండి, లేకపోతే డబ్బింగ్ ఆర్టిస్టుతో చెప్పించండి" అని 'అరవింద సమేత' తొలి షెడ్యూల్‌లో త్రివిక్రమ్ గారితో అన్నా. నాతో డబ్బింగ్ చెప్పించారు.. త్రివిక్రమ్ సర్‌కు నచ్చింది.
కెమిస్ట్రీ కుదిరింది
ఈ సినిమా షూటింగ్‌లో చాలా నవ్వుకున్నాం. ఫన్నీ స్క్రిప్టులో నటించాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. త్రివిక్రమ్, బన్నీ.. అదే మూడ్‌లో ఉన్నారు. నేను ఈ సినిమాకు సంతకం చేయడానికి అది ఓ కారణం. అదేవిధంగా త్రివిక్రమ్ సర్‌తో కలిసి మరోసారి పనిచేయొచ్చని ఒప్పుకున్నా. ఈ సినిమా కథ అందరికీ నచ్చేలా ఉంది. ఇందులో నా పాత్ర చాలా బలంగా ఉంటుంది. అల్లు అర్జున్ హీరోయిన్లను రిపీట్ చేయడు. కానీ నన్ను తీసుకున్నాడు (నవ్వుతూ) అతడితో నటన సౌకర్యంగా ఉంటుంది. 'డీజే'లో మా కెమిస్ట్రీకి మంచి స్పందన వచ్చింది కాబట్టి ఇప్పుడు నన్ను తీసుకున్నారేమో. "నువ్వు ఎందుకు హీరోయిన్స్‌ను రిపీట్ చేయవు" అని నేనూ ఓసారి అల్లు అర్జున్‌ను ఏడిపించా.
అసభ్యంగా లేవుగా!
సినిమాలో మీ కాళ్లపై చాలా సీన్లు ఉన్నాయి. మీకు ఇబ్బందిగా అనిపించలేదా? అని ప్రశ్నించగా.. సాధారణంగా నా కాళ్లను చూసిన ప్రతి ఒక్కరికీ పాఠం చెప్పాలని నేను అనుకుంటే నా పని పక్కనపెట్టాలి. అలా చేయడం సరికాదు. షార్ట్ కాకుండా లంగా ఓణీ వేసుకున్నా.. నడుం చూస్తారు. అప్పుడు లేనిది.. ఇప్పుడు ఎందుకు? ఏదైనా సరే మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఈ సినిమా కథలో భాగంగానే నా కాళ్లపై సీన్లు ఉన్నాయి. అసభ్యకరంగా అయితే లేవు కదా. అతడు నేను నడిచే విధానం గురించి మాట్లాడారు.. అంతేకానీ నా కాళ్లు ఎలా ఉన్నాయని కాదు.
త్రివిక్రమ్‌కు ఈగో లేదు
త్రివిక్రమ్ సర్ చాలా కామ్‌గా ఉంటారు. "సర్.. సెట్‌లో అగ్నిప్రమాదం జరిగింది" అని ఎవరైనా వచ్చి ఆయనకు చెబితే.. "హో.. మంటలు వ్యాపించాయా! ఫర్వాలేదు, ముందు ఇది పూర్తికానీ.." అంటారు. నేను చాలా మంది దర్శకులతో కలిసి పనిచేశా. వారిలో ఎవరూ ఇంత ప్రశాంతంగా లేరు. ఇలాంటి ఘటన జరిగితే కేకలు పెట్టేవారు.. అక్కడ ఉన్న మేం భయపడిపోయేవాళ్లం. ఓపికగా ఉండాలనే విషయం త్రివిక్రమ్ నుంచి నేర్చుకున్నా. ఆయన సీన్‌ను పూర్తిగా వివరిస్తారు. 'సామజవరగమన..' పాట లిరిక్స్ మొత్తం నాకు వివరించారు, అసలు పాట గురించి నాకు చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ మొత్తం చెప్పారు. ఇవాళ నేను ఆ పాట గురించి మరొకరికి చెప్పగలను. ఆయన ప్రతి ఒక్కరి మాట వింటారు, ఈగో లేదు. సరైన సలహాను తుది నిర్ణయంగా తీసుకుంటారు.
ఆ సీన్ ఇష్టం
ఈ సినిమాలో నేను బన్నీకి సరిపోయేలా డ్యాన్స్ చేశాననే అనుకుంటున్నా. ఇప్పటికే బెస్ట్ డ్యాన్సర్స్ హృతిక్ రోషన్, బన్నీతో కలిసి పనిచేశా. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా డ్యాన్స్ సాధన చేయలేదు. సెట్‌లోనే ప్రాక్టీస్ చేశా. ఈ సినిమాలో నాకు ఇష్టమైన సన్నివేశాన్ని కట్ చేశారు. దాన్ని ఓ రోజు విడుదల చేస్తారని ఆశిస్తున్నా (నవ్వుతూ). ఇప్పుడు సినిమాలో ఉన్న సన్నివేశాల్లో నాకు 'బుట్టబొమ్మ..' పాటకు ముందు వచ్చే సీన్ ఇష్టం.
ప్రభాస్ స్వీట్
ప్రభాస్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నా. ఆయనతో పనిచేయడం చాలా సరదాగా ఉంది, ప్రభాస్ చాలా స్వీట్. ఆ సినిమాకు సంబంధించి రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. ఒకటి ఇటలీలో, మరొకటి హైదరాబాద్‌లో జరిగింది. త్వరలో మూడో షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఆ సినిమా వాయిదా పడటం నాకు ఇబ్బందిగా ఏమీ అనిపించలేదు. నా కాల్‌షీట్‌కు ఇబ్బందిరాలేదు. మరోపక్క అఖిల్‌తో నటిస్తున్నా. అతడు చాలా సరదాగా ఉంటాడు.
అలా ఎప్పుడూ అనుకోను
నాకు విభిన్నమైన పాత్రలు చేయాలని ఉంది. దానికి తగ్గట్టే సినిమాలకు సంతకం చేస్తున్నా. తెలుగులో కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు తక్కువగా ఉన్నాయి. అలాంటి సినిమాలు నేను నటించలేనని ఎప్పుడూ అనుకోలేదు, అనుకోను. జీవితం ఎప్పుడూ అలా ఉండకూడదు. కొన్నిసార్లు సినిమా హిట్ అవ్వొచ్చు.. కానీ వసూళ్లు రాకపోవచ్చు. హిట్ టాక్ రాకపోయినా.. కలెక్షన్స్ సాధించిన సినిమాలు ఉన్నాయి. స్టార్ హీరోలు చేసిన సినిమాలు ఎన్నో ఫట్ అయ్యాయి. నాకు ఫలానా భాషలోనే నటించాలనే నియమం లేదు. ఓ ఇండియన్ యాక్టర్‌గా ఉండాలి అనుకుంటున్నా. తెలుగులోనే కాదు తమిళంలోనూ మంచి కథ వస్తే చేస్తా.
ఒత్తిడి అనిపించలేదు
'అరవింద సమేత' షూటింగ్‌కు హైదరాబాద్‌కు రావడం సవాలు అయ్యింది. అప్పుడు ఎన్టీఆర్ తండ్రి కన్నుమూశారు. దీంతో సినిమా షెడ్యూల్ వాయిదా పడింది. అయినా సరే ఎన్టీఆర్ గ్యాప్ తీసుకోకుండా షూటింగ్‌కు వచ్చాడు. నిజంగా అతడికి హ్యాట్సాఫ్ చెప్పాలి. అప్పుడు నేను 'హౌస్‌ఫుల్ 4'లో నటిస్తున్నా. జైపూర్‌లో ఆ షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో అక్కడి షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు రాత్రి 1.30కి వచ్చి.. ఉదయం 5కి నిద్రలేచి 'అరవింద సమేత' షూట్‌కు వెళ్లేదాన్ని. తిరిగి జైపూర్‌కు పరుగులు తీసేదాన్ని.
హైవేలో ఒంటరిగా కారులో ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. అప్పుడు నాతో నా హెయిర్ స్టైలిస్ట్ మాత్రం ఉన్నారు. మా అమ్మానాన్న భయపడుతూ ఉండేవారు. వారికి నా లైవ్ లొకేషన్ షేర్ చేసేదాన్ని. నువ్వెలా విశ్రాంతి లేకుండా పనిచేయగలుగుతున్నావని నన్ను చాలా మంది ప్రశ్నించారు. నాకు మాత్రం ఒత్తిడిగా కాదు.. ఉత్సాహంగా ఉండేది. ఉదయం షూటింగ్‌కు ముందు నిద్రలేచి 'అరవింద సమేత' డబ్బింగ్ చెప్పేదాన్ని. ఒక్కరోజులో మూడు షిఫ్ట్‌లు చేశా. శ్రీదేవి తర్వాత మూడు షిఫ్ట్‌లలో చేసిన నటి నువ్వే అని అందరూ అన్నారు.