వేగం పెంచబోతున్నారు హీరో ప్రభాస్. కొత్తగా ఒప్పుకున్న రెండు సినిమాల్నీ, వచ్చే ఏడాది ఆరంభంలోనే మొదలుపెట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 'రాధేశ్యామ్'లో నటిస్తున్నారు. వచ్చే వారం నుంచే చిత్రీకరణ తిరిగి ప్రారంభం అవుతుంది. సుదీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాల్ని పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. తదుపరి సినిమాల కోసం ప్రభాస్ పక్కా వ్యూహంతో అడుగు వేయబోతున్నారు.
ఇందులో భాగంగా తొలుత విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సన్నివేశాల్ని పూర్తి చేయాలని దర్శకనిర్మాతలకు ప్రభాస్ సూచించినట్టు సమాచారం. ఆ మేరకు నాగ్ అశ్విన్ చిత్రం, 'ఆదిపురుష్' బృందాలు పూర్వ నిర్మాణ పనుల్లో తలమునకలు కానున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకుడిగా, వైజయంతీ మూవీస్ పతాకంపై రూపొందనున్న చిత్రం కోసం ప్రభాస్ ఫిబ్రవరి నుంచి రంగంలోకి దిగనున్నారట. 'ఆదిపురుష్' సినిమాను ఇంచుమించు అదే సమయంలోనే ప్రారంభిస్తారని తెలిసింది. ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్నవే. విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి తెరకెక్కిస్తున్నారు.