'జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమాకు సంబంధించిన రహస్యాల్ని మనకు చెప్పనున్నాడు హీరో నాని. అదేంటి చిత్రం ఎప్పుడో వచ్చింది కదా? అయినా ఇప్పుడు చెప్పడమేంటి అని అనుకుంటున్నారా. మరేం లేదు. ఈనెల 9వ తేదీకి 30 ఏళ్లు పూర్తి చేసుకోనుందీ సినిమా. అందులో భాగంగానే మూడు సీక్రెట్స్‌ను రేపు(5వ తేదీ), 7న, 9న నాని వెల్లడించనున్నాడు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది.
మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవిల కెరీర్లో ఎన్నో అద్భుత చిత్రాలున్నా 'జగదేకవీరుడు అతిలోకసుందరి' ప్రత్యేకమే. ఎందుకంటే వారిద్దరూ ఇందులో నటించారు అనడం కన్నా జీవించేశారు అని చెప్పాలి. రాజు పాత్రలో చిరు, దేవకన్య ఇంద్రజగా శ్రీదేవి అత్యద్భుతంగా ప్రదర్శన చేశారు.
తొలుత ఈ సినిమా స్టోరీని చక్రవర్తి అనే రచయిత నిర్మాత అశ్వనీదత్‌కు చెప్పగా, జంధ్యాలతో పూర్తి కథను సిద్ధం చేయించారు. ఆ తర్వాత కె.రాఘవేంద్రరావు తన దర్శకత్వ ప్రతిభతో మరపురాని చిత్రంగా మలిచారు. ఇళయరాజా అందించిన బాణీలు ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమా హైదరాబాద్‌లోని 'ఓడియన్ 70 ఎమ్ఎమ్' థియేటర్‌లో ఏడాది పాటు ఆడటం మరో విశేషం.