ఓటీటీల్లో వస్తున్న వెబ్‌సిరీస్‌లపై తరచూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న వేళ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటీటీలకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు తీసుకురానున్నామని తెలిపారు. థియేటర్లలో నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతులపై ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఓటీటీల్లో వస్తున్న కొన్ని సీరియళ్లపై పెద్దసంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని జావడేకర్ అన్నారు. ప్రెస్ కౌన్సిల్, కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (నియంత్రణ) చట్టం, సెన్సార్ బోర్డు వంటి వాటి పరిధిలో ఓటీటీలు లేకపోవడం ఒక కారణమని చెప్పారు. అందుకే త్వరలోనే ఓటీటీ వేదికలకు సంబంధించిన మార్గదర్శకాలు తీసుకొస్తామని చెప్పారు. అశ్లీలత, హింస, మతపరమైన అంశాల విషయంలో గత కొన్నాళ్లుగా ఓటీటీల్లో వస్తున్న వెబ్ సిరీస్‌లపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల హిందూ దేవుళ్లను అవమానించేలా ఉందంటూ 'తాండవ్' వెబ్‌సిరీస్‌పై ఫిర్యాదులు వచ్చిన వేళ కేంద్రమంత్రి ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి:'చావు కబురు..' రిలీజ్ డేట్.. కిచ్చా సుదీప్ @25