గోపీచంద్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'పక్కా కమర్షియల్'. జీఏ2 పిక్చర్స్, యు.వి.క్రియేషన్స్ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. బన్నీ వాసు నిర్మాత. అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. దీని షూటింగ్ శనివారం మొదలైంది. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగామని నిరూపిస్తూ, చిత్రాన్ని పట్టాలెక్కించిన రోజే విడుదల తేదీనీ ప్రకటించారు. అక్టోబరు 1న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది.
"జీఏ2, యు.వి.క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మించిన 'భలే భలే మగాడివోయ్', 'టాక్సీవాలా', 'ప్రతి రోజూ పండగే' ఘన విజయాల్ని సొంతం చేసుకున్నాయి. మరో హ్యాట్రిక్‌కు శ్రీకారం చుడుతూ గోపీచంద్ - మారుతి కలయికలో సినిమా ఆరంభమైంది. ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచుతుందీ చిత్రం. గోపీ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం" అని సినీ వర్గాలు వెల్లడించాయి.