ETV Bharat / sitara

సుమధుర గానానికి 'వంద'నం - ఘంటసాల పాటలు

Ghantasala 100 Years: ఓ సుమధుర గీతాల సంగీత పాఠశాల, ఓ అమృత సుస్వరాల కమ్మని వంటశాల, దివినుండి భువికి ప్రభవించిన సరస్వతీ కళ, ప్రవహించె గాన గంధర్వుమయి ఇల ఘంటశాల, ఆ మహా గాయకుని కని పరవశించెనుకదా తెలుగునేల అని అభివర్ణించారు ఓ గొప్ప కవి. సిరిమువ్వల సవ్వడిలా.. చిరు జల్లుల సందడిలా.. విరి తేనియ పుప్పొడిలా మరు మల్లెల తాకిడిలా మదిని పులకింపచేసి, మనసుని మరిపింపచేసే అద్భుత గాయకుడు, స్వర ఇంద్రజాలికుడు మన ఘంటసాల వెంకటేశ్వరరావు. 1922 డిసెంబర్‌ 4న ఆయన జన్మించారు. వందో వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఆ మహా గాయకుడికి 'ఈటీవీ భారత్'​ అక్షర నివాళులు.

Ghantasala Birthday
ఘంటసాల
author img

By

Published : Dec 4, 2021, 5:32 AM IST

Ghantasala Birthday: "అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానమని, సత్వసాధనకు సత్యశోధనకు సంగీతమే ప్రాణము" అంటారు శంకారాభరణంలో శంకరశాస్త్రి. తెలుగు సినీ చరిత్రలో ఘంటసాల వెంకటేశ్వరరావు అడుగు పెట్టాక పాటకు అమరత్వం సిద్ధించింది. సినిమా పాట కానీ, లలితగీతం కానీ, పద్యం కానీ ఘంటసాల గళంలో జాలువారితే అది రసప్లావమై నిలిచింది. పరమేశ్వరుడు గరళాన్ని గొంతులో నిలుపుకున్నట్లే, ఘంటసాల స్వరామృతాన్ని తన స్వరపేటికలో భద్రపరిచి ఆ స్వరఝరిని జీవనదిలా తన గళంలో ప్రవహింపజేశారు.. అజరామరమైన సంగీత నిధిని భావితరాలకు వదిలి స్వరార్చనకోసం స్వర్గారోహణ చేశారు. ఘంటసాల ఈ లోకాన్ని వీడి దశాబ్దాలు గడిచినా, తరాలు మారినా తెలుగుజాతి ఉన్నంతవరకు ఘంటసాల చిరంజీవిగా ఉండిపోతారు. ఆయన సంగీత చరిత్ర అభిమాన లోకానికి అవగతమే. 1944లో మద్రాసులో అడుగుపెట్టి సినిమాలలో పాడేందుకు ప్రయత్నిస్తూ, హెచ్​ఎంవీ కంపెనీకి వెళితే, అప్పుడు రికార్డిస్టుగా వున్న లంకా కామేశ్వరరావు వాయిస్ టెస్ట్ చేసి "నీది మెటాలిక్ వాయిస్ కనుక నీ కంఠం మైకుకు సరిపడదు" అని నిరాశపరచినప్పుడు 1945లో రికార్డిస్టు ఇన్-చార్జి గా ఉంటున్న పేకేటి శివరాం ఘంటసాలను పిలిపించి హార్మనిస్టు రతన్ రావు చేత రాయించిన 'గాలిలో నా బ్రతుకు తేలిపోయినదోయి' అనే భావగీతాన్ని ఒకవైపు, ఎవరో అజ్ఞాతకవి రాసిన 'నగుమోమునకు నిశానార్ధ బింబము తోడు' అనే పద్యాన్ని సముద్రాల రాఘవాచార్యచేత సరిదిద్దించి రెండోవైపు రికార్డుచేసి 1946 జూలై లో (రికార్డు నెంబరు N.18795) మార్కెట్ కి విడుదల చేశారు. ఈ ఘంటసాల శతజయంతి సంవత్సరంలో ఘంటసాల ఆలపించిన కొన్ని పాటల విశ్లేషణతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.. ముందుగా మన తెలుగు తల్లి గారాల స్వరపుత్రుడు ఘంటసాల ఆలపించిన తొలి రికార్డును విందాం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'శివశంకరి'...

తెలుగు చలనచిత్ర సంగీత చరిత్రలో ప్రామాణికమైన గీతాలలో సంగీత ప్రియులు మరచిపోలేని పాట 1961లో విజయా వారు నిర్మించిన 'జగదేకవీరుని కథ' చిత్రంలో ఘంటసాల మేస్టారు ఆలపించిన అద్భుతగీతం 'శివశంకరి శివానందలహరి'. ఈ పాటతో సంబంధంలేని సంగీత ప్రియుడు తెలుగు నేలమీద వుండదనేది నిజం. పింగళి రచనలో పెండ్యాల స్వరపరచిన ఈ పాటను దర్శకుడు కె.వి.రెడ్డి ఘంటసాలకు వినిపించమని చెప్పగా, అది వినిన ఘంటసాల మేస్టారు "బ్రహ్మాండం బాబూ. ఈ పాటకోసం నేను పదిహేనురోజులైనా రిహార్సల్స్​కి వస్తాను. బాగా పాడతాను" అని చెప్పి సాధన చేసి పాటను పాడి రికార్డు చేయించారు. పాట విన్న కథా నాయకుడు ఎన్.టి. రామారావు ఘంటసాలతో నాలుగు రోజులు కూర్చుని అందులో చేయవలసిన స్వర విన్యాసాలను లిప్ సింక్ అయ్యేలా ప్రాక్టీస్ చేశారు. పైగా ఈ పాట చిత్రీకరణ సమయంలో ఘంటసాల కూడా తప్పకుండా వుండాలని కోరారు. అలా ఈ పాట చరిత్ర సృష్టించింది. ఈ పాట నేపథ్యంలోకి వెళితే.. జగదేకవీరుని కథ చిత్రంలోని పాటలన్నీ రికార్డింగు, చిత్రీకరణ పూర్తిచేసిన తరవాత చివరిగా స్వరపరచిన పాట 'శివశంకరి'. దర్శకుడు కె.వి. రెడ్డి పెండ్యాలతో "పూర్వం నారద తుంబురులు వాదించుకుంటూ వుంటే ఆంజనేయుడు పాడితే శిలలు కరిగాయని శాస్త్రం చెబుతోంది. ఈ యుగంలో కూడా తాన్ సేన్ పాడితే దీపాలు వెలిగాయట. మీరు చేయబోయే పాట కూడా అలాంటిదే. ఈ పాట సినిమా మొత్తానికి ప్రాణం వంటిది. ఈ పాటకు మీరు అంతటి స్థాయిని తీసుకురావాలి" అన్నప్పుడు పింగళి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని 'శివశంకరి' పాటకు అక్షరరూపం కల్పించారు. ఆరున్నర నిమిషాల ఈ పాటను పెండ్యాల దర్బారీ రాగంలో స్వరపరచారు. రకరకాల విన్యాసాలతో సాగే ఈ పాట ఘంటసాల మేస్టారు ఏ కచేరీలోనూ పాడే సాహసం చేయలేదు. అంతటి క్లిష్టమైన ఈ పాట మీకోసం.

ఘంటసాల పాటల్లో మరో ఆణిముత్యం

1967లో ఎన్.టి. రామారావు మాతృసంస్థ ఎన్​ఏటీ నిర్మించిన 'పాండురంగ మాహాత్మ్యం' అద్భుతం చిత్రం. ప్రతి పాటా ఆణిముత్యం. ఎన్‌టీఆర్ నటన మేలిమి బంగారం. పాటలు జూనియర్ సముద్రాల రచించగా, సంగీత దర్శకుడు టి.వి. రాజు మనోహరంగా రాగమాలికగా స్వరపరచిన పాట "జయ కృష్ణా ముకుందా మురారీ జయా గోవిందా బృందా విహారీ" అనే పాట. ఘంటసాల మేస్టారు ఆలపించిన పాటల్లో ఇది ఒక కలికితురాయి.

శ్రీకృష్ణుడిని కీర్తిస్తూ పాడిన ఈ పాట పల్లవితో బాటు "దేవకి పంట వాసుదేవు వెంట" అనే తొలి చరణాన్ని టి.వి. రాజు మోహనరాగంలో స్వరపరచగా, రెండవ చరణం "నీ పలుగాకి పనులకు గోపెమ్మ కోపించి నిను రోట బంధించెనంట" కోసం కళ్యాణి రాగాన్ని వాడుకున్నారు. "అమ్మా తమ్ముడు మన్ను తినేనూ" అనే పద్య రూపానికి ఆరభి రాగాన్ని వాడారు. ఇక "కాళీయ ఫణి ఫణ జాలాన ఝణ ఝణ" అనే చరణాన్ని మాండ్ రాగంలో స్వరపరచారు. శ్రీకృష్ణ కర్ణామృతంలోని "కస్తూరీ తిలకం లలాట ఫలకే" అనే శ్లోకానికి హిందోళ రాగం ఉపయోగించారు. "లలిత లలిత మురళీ స్వరాళీ పులకిత వనపాళీ గోపాళీ" అనే చరణాన్ని యమన్ రాగాన్ని ఆధారం చేసుకొని స్వరపరచారు. ముఖ్యంగా ఈ చరణం తరవాత వచ్చే రెండున్నర నిమిషాల వాద్యసంగీతం ఈ పాటకు హైలైట్. ఈ పాటకు విజయనిర్మల నాట్యం చేయడం విశేషం. ఇంతటి మనోహరమైన పాట మీకోసం.

1955లో అంజలీ పిక్చర్స్ పతాకం మీద విడుదలైన 'అనార్ కలి' చిత్రంలో ఘంటసాల, జిక్కి ఆలపించిన మరో మధురమైన పాట "రాజశేఖరా నీపై మోజు తీరలేదురా" గురించి కూడా ఈ సందర్భంగా మననం చేసుకోవాలి. సముద్రాల రాఘవాచార్య రచించగా పి. ఆదినారాయణ రావు స్వరపరచిన ఈ పాట "మదన మనోహర సుందరనారీ, మధుర ధరస్మిత నయన చకోరీ" అనే సాకీతో ఘంటసాల స్వరంలో మొదలౌతుంది. రసికజన హృదయాలకు చలివేంద్రంగా మారిన ఈ పాటను ఆదినారాయణ రావు మాల్కోస్ రాగంలో స్వరపరచారు. ఈ పాటలో 'వహ్వా' అనే మాటనుంచి చివర వచ్చే 'చేరరారా' వరకు అద్భుతంగా గమకాలు పలుకుతాయి. ఆ చివర వినవచ్చే వాద్యగోష్టి ఈ పాటకు మకుటాయమానంగా నిలిచింది. ఈ పాటలో అక్బర్ పాదుషా ఆస్థాన గాయకుడుగా నటించినవారు ఆ చిత్ర దర్శకుడు, నాట్యాచార్యుడు వేదాంతం రాఘవయ్య. ఈ యుగళగీతం మీకోసం.

భూకైలాస్​

ఏవియం అంటేనే ఆరోజుల్లో అద్భుత నిర్మాణ సంస్థ. ఏవీఎం చిత్రాల్లో నటించటం అంటే మామూలు విషయం కాదు. అనేక హిట్ చిత్రాలు అందించిన ఆ సంస్థ ఎందరో నటీనటుల ఉజ్వల భవిష్యత్తుకు బాటుల వేసింది. ఏవీఎం సంస్థ గొప్ప చిత్రాల్లో 1958 లో నిర్మించిన 'భూకైలాస్' ఒకటి. చిత్రానికి సుదర్శనం-గోవర్దనం సంగీతం సమకూర్చారు. గేయరచయిత సముద్రాల రాఘవాచార్య.

భూకైలాస్ సినిమాలో ఎన్.టి. రామారావు మీద చిత్రీకరించిన "నీలకంధరా దేవా దీనబాంధవా రారా నన్ను గావరా" పాట ఘంటసాల ఆలపించిన భక్తి గీతాలలో మకుటాయమానమైనది. 'నీలకంధరా దేవా' నుంచి 'దర్శనంబు నీరా మంగళాంగా గంగాధరా' వరకు ఘంటసాల తిలంగ్ రాగంలో శ్రావ్యంగా ఆలపించారు. ఇక ‘దేహియన వరములిడు దానగుణ సీమా’ నుంచి ‘హరహర మహాదేవ కైలాసవాసా’ వరకు శుద్ధ సావేరి రాగం పలుకుతుంది. ఇక చివరి పాదాలకు నాదనామక్రియ రాగాన్ని సంగీత దర్శకులు వాడారు. పాటల పోటీలలో ప్రశంసలకు నోచుకోగలిగే పాట ఇది.

డి.ఎల్. నారాయణ వినోదా బ్యానర్ మీద 1953లో నిర్మించిన 'దేవదాసు' చిత్రంలో ఘంటసాల ఆలపించిన ఒక్క పాటైనా వినకుంటే ఈ శతజయంతి నాందీ ప్రస్తావనకు అర్ధం వుండదు. ఈ చిత్రనిర్మాణం సగంలో వుండగానే సంగీత దర్శకుడు సి.ఆర్. సుబ్బురామన్ తన 29 వ యేటనే హఠాన్మరణం చెందడం విచారించ తగిన విషయం కాగా ఆయన స్వరపరచిన పాటలన్నీ ఆణిముత్యాలే. సముద్రాల రాఘవాచార్య కలంనుండి జాలువారిన "కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్" పాటను జీవితం మీద విరక్తి కలిగిన నాయకుడు వేదాంతాన్ని వల్లిస్తూ పాడుతున్నట్లే ఘంటసాల ఆలపించారు. కళ్యాణి రాగంలో ఈ పాటను సుబ్బురామన్ స్వరపరచారు. 'సుడిలో దూకి ఎదురీదక మునకే సుఖమనుకొవోయ్' అంటూ చరణం చివర వచ్చే ఆలాప్ లో మంద్రస్థాయిలోను, తారాస్థాయిలోను ఘంటసాల పలికించిన గమకాలు అనితరసాధ్యాలు. ఇవి కళ్యాణి రాగానికి దివ్యాభరణాలుగా చెప్పుకోవాలి. అక్కినేని నటన, బి.ఎస్. రంగా ఛాయాగ్రహణం, ఘంటసాల ఆలాపన ఈ పాటకు వన్నె చేకూర్చాయి. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలచింది అనే అర్ధంలో ఈ పాట రచన చేశారు సముద్రాల. కవి హృదయాన్ని అందిపుచ్చుకొని అంతే ఆర్తితో అనుభవించి పాడారు ఘంటసాల.

1954లో కన్నడ కంఠీరవుడు రాజకుమార్ తొలిసారి నటించిన 'కాళహస్తి మహాత్మ్యం' చిత్రంలో తోలేటి గీత రచనకు సుదర్శనం సంగీత దర్శకత్వం సమకూర్చగా ఘంటసాల ఆలపించిన భక్తిగీతం "మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా నిను నమ్మినాను రావా నీలకంధరా" పాట ప్రతి శివాలయంలో నిత్యం వినిపిస్తూనేవుంటుంది. గాయకుడిగా ఘంటసాల సంగీత జీవనయానంలో మరో మైలురాయిగా నిలిచిపోయిన పాట ఇది. ఈ పాట ఎంతటి ప్రజాదరణ పొందిందంతే, రైలు ప్రయాణంలో బిచ్చగాళ్ళు తప్పకుండా పాడేవారు. ఆ పాట ఎత్తుకోగానే ప్రయాణీకులు కూడా ట్యూన్ అయిపోయేవారు. ఈ పాటకు పీలూ రాగం ఆధారం.

జయభేరి

1959లో విడుదలైన 'జయభేరి' చిత్రంలో రెండు పాటలను మీకు వినిపించి ఘంటసాల శతజయంతి సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సర కాలం పొడవునా ఘంటసాలను స్మరించుకుందాం. కళ అనేది దైవ స్వరూపం. కళారాధకులకు జాతి, మతం అనే వ్యత్యాసాలు వుండవు. ఇలాంటి అభ్యుదయ భావాలను ప్రగాఢంగా నమ్మి ఆచరణలో పెట్టిన ఒక సద్బ్రాఃహ్మణ యువకుడు మానవత్వానికి మించిన మతం లేదని నడుంకట్టి సాధించిన విజయ గాథే 'జయభేరి' సినిమా.

పెండ్యాల నాగేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించిన జయభేరి సినిమా కథ మొత్తం సంగీతం చుట్టూ పరిభ్రమిస్తూవుంటుంది. ఇందులో మల్లాది రామకృష్ణ శాస్త్రి రచించిన "రసికరాజ తగువారము కామా అగడు సేయ తగునా? ఏలు దొరవు అరమరికలు ఏలా? ఏలవేల సరసాల సురసాల" అనే పాటగురించి చెప్పుకుందాం. రాజసభలో కథానాయకుడు అక్కినేని తన సంగీత ప్రతిభకు పరీక్షా సమయం వచ్చినప్పుడు ఆలపించే గీతమిది. పెండ్యాల ఈ పాటకోసం 'విజయానందచంద్రిక' అనే ఒక నూతన రాగాన్ని సృష్టించారు. చక్రవాక, కానడ రాగాలను మేళవించి రూపొందించిన రాగమిది. రిషభ, గాంధారాలను త్రిస్థాయిలో వచ్చేలా రూపకల్పనచేయడం ఈ రాగం ప్రత్యేకలక్షణం. సన్నివేశ విషయానికి వస్తే... రాజసభలో విజయానంద రామ గజపతి మహారాజు ఎదుట రాజనర్తకి అక్కినేనిని పండిత స్థానంలో ఆసీనుడయ్యేందుకు తగిన అర్హత ఏమిటో నిరూపించమని కోరినప్పుడు అతడు రాగాలాపన చేస్తాడు.

కథానాయకుడు ఆలపిస్తున్న రాగమేమిటో చెప్పమని రాజనర్తకి ప్రశ్నించినప్పుడు, మహారాజు పేరు కలిసేలా విజయానంద చంద్రిక అంటాడు కథానాయకుడు. మహారాజు పేరుమీద సృష్టించడిన ఆ రాగలక్షణం ఏమిటని రాజనర్తకి ప్రశ్నించినప్పుడు "సలక్షణం" అంటూ "ప్రభూ! దేవరవారికి చక్రవాక, కానడ రాగాలంటే మిక్కిలి మక్కువని లోకవిదితం. ఆ రెండు రాగాలను మేళవించి ప్రభువులను, పండితులను రంజింపచేయ ప్రయత్నిస్తున్నాను" అని జవాబిస్తూ కథానాయకుడు పాటకు ఉపక్రమిస్తాడు. ఈ పాటకోసం ఘంటసాల పదిరోజులపాటు రిహార్సల్స్ చేసి మరీ పాడటం జరిగింది. రాగస్వరూపం తెలియజేసేలా సినిమా అవసరంకోసం అరనిమిషానికి కుదించి సభికులకు ఆ రాగానుభూతిని చేకూర్చిన సన్నివేశంలో ఘంటసాల ఈ పాటను ఆలపించిన తీరు 'న భూతో నా భవిష్యతి'.

'జయభేరి' సినిమాలోనే మహాకవి శ్రీశ్రీ రచించిన "నందుని చరితము వినుమా పరమానందము గనుమా" అనే పాత జనరంజకమైనది. "అధికులనీ, అధములనీ నరుని దృష్టిలోనే భేదాలూ... శివుని దృష్టిలో అంతా సమానులే" అంటూ, కులనిర్మూలన వాదానికి ఊతమిచ్చే సాకీతో ప్రారంభమౌతుంది ఈ పాట. చిన్న పిల్లలకు కూడా అర్ధమయ్యే రీతిలో ఎంతో సరళమైన భాషలోసాగే ఈ పాట చివరిలో తారాస్థాయిని చేరుకొనే సన్నివేశం అత్యద్భుతం. సంగీతాభిమానుల మన్ననలు చూరగొన్న ఈ 'జయభేరి' పాటలు ఘంటసాల-పెండ్యాల అవిరళ కృషికి దర్పణాలు. ఈ పాటను నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16 ఎంఎంలోకి మార్పించి సాంఘిక సమానత్వం, కులనిర్మూలన మొదలైన అంశాలపై ప్రచారం కోసం వినియోగించుకోవడం విశేషమే కాదు ఈ పాట ప్రత్యేకత కూడా! ఈ చిత్రంలో ఘంటసాల ఆలపించిన మరొక ఆణిముత్యం "నీదాననన్నదిరా నిన్నే నమ్మిన చిన్నదిరా" మద్యపాన నిషేధం వున్న కారణంగా సెన్సార్ అధికారి జి.టి. శాస్త్రి ఆర్డర్​ మేరకు చిత్రం నుంచి తొలగించారు.

సంగీత సార్వభౌముడు ఘన ఘంటసాల నోట పల్లవించే ప్రతి పాటా చిలికిన అమృత కలశమట. మరువాల తోటలో మది మీటే పాట మన ఘంటసాల వారి పాట. మధుర మధుర మకరందపు తేట. ఆణిముత్యాల మూట, ఎల కోయిల పాట. మన ఘంటసాల వారి పాట చిగురాకు చిటపట. మంచి గంథపు పూత.. జిలిబిలి సొగసుల పోత.

ఇవీ చూడండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.