ఆలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న చిత్రం 'గంగూబాయి కతియావాడి'. ఇందులో వేశ్యగా కనిపించనుంది ఈ భామ. కరోనా కారణంగా మార్చిలో నిలిచిపోయిన షూటింగ్ ఇప్పుడు ప్రారంభమైంది. ఆలియా ఈ సినిమా కోసం నైట్ షిఫ్ట్‌లో పనిచేస్తోందట. గతంలో రాత్రి సన్నివేశాలను తెరకెక్కిస్తున్న సమయంలోనే కొవిడ్ పరిస్థితుల కారణంగా ఆగిపోయింది. ఈ క్రమంలోనే ఎక్కడ సినిమా నిలిచిపోయిందో.. ఆ సన్నివేశాలనే తెరకెక్కిస్తున్నారు సంజయ్ లీలా భన్సాలీ.
అప్పట్లో ఈ సినిమా కోసం వేసిన సెట్ వర్షాల కారణంగా చాలా వరకు తీసేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కామటిపుర సెట్‌ను అలాగే ఉంచారు. ఇప్పుడు అందులోనే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. రాత్రి 7 నుంచి ఉదయం వరకు ఆలియా షూటింగ్లో పాల్గొంటున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 50 మంది చిత్రబృందంతోనే షూటింగ్ చేస్తున్నారట.
అనుకోని పరిస్థితుల్లో చిన్నవయసులోనే వేశ్యగా మారిన గంగూబాయి తర్వాత క్రమంలో ముంబయి మాఫియా క్వీన్‌గా ఎదిగిన కథతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనుంది చిత్రబృందం.