గ్యాంగ్‌స్టర్స్... అండర్ వరల్డ్ మాఫియా...ఈ నేపథ్యంలో సాగే కథలకు మంచి క్రేజ్ ఉంది. వాస్తవికతను దగ్గరగా ఆకట్టుకునేలా తీర్చిదిద్దే ఈ కథలకు విజయం ఖాయం. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి నేటి వరకూ ఈ తరహా చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి. 'దీవార్', 'పరిందా', 'సత్య', 'వాస్తవ్'. 'షూటవుట్ ఎట్ లోఖండ్ వాలా', 'ఒన్స్ అప్ ఆన్ ఎ టైమ్ ఇన్ ముంబయి', 'షూటవుట్ ఎట్ వడాలా'.. ఇవన్నీ బాలీవుడ్‌లో తెరకెక్కి విజయం సాధించిన చిత్రాలు. ఇవన్నీ గ్యాంగ్‌స్టర్ కథలే. ఇప్పుడు మళ్లీ బాలీవుడ్‌లో ఇలాంటి కథలు జోరందుకున్నాయి.
- గ్యాంగ్‌స్టర్ గంగూబాయి కొతేల్‌వాలి జీవిత కథతో ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న చిత్రం 'గంగూబాయి కతియావాడి'. టైటిల్ పాత్రలో బాలీవుడ్ నాయిక ఆలియా భట్ నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో ఆలియాను చూసి వావ్ అనేలా ఉందంటూ ప్రశంసలు కురిపించారు.
- సంజయ్ దత్, అర్షద్ వార్షి కలిసి ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో నటించబోతున్నారు. అంధుడైన ఓ గ్యాంగ్‌స్టర్ కథతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు సమాచారం. దర్శకురాలు జోయా అక్తర్ ఓ గ్యాంగ్‌స్టర్ కథను తెరకెక్కించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో రణ్‌వీర్‌సింగ్, కత్రినాకైఫ్ కీలక పాత్రల్లో నటించే అవకాశాలున్నాయి.
- బాలీవుడ్ నటులు ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్వానీ కూడా ఓ గ్యాంగ్‌స్టర్ కథలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఇది సినిమా కాదు వెబ్‌సిరీస్. 'డోంగ్రీ టు ముంబయి: సిక్స్ డికేడ్స్ ఆఫ్ ముంబయి మాఫియా' అనే పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ సాగనుంది.
- జాన్ అబ్రహం, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న గ్యాంగ్‌స్టర్ డ్రామా 'ముంబయి సాగా'. సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ కొంత మినహా పూర్తయింది. మిగిలిన భాగాన్ని జులైలో రామోజీ ఫిల్మ్‌సిటీలో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 'షూటవుట్..' ఫ్రాంఛైజీలో మూడో చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
ఆ పాత్రల స్టైలే వేరు!
"ప్రేక్షకుల్ని అలరించే ఏ కథను తెరకెక్కించేందుకైనా దర్శకనిర్మాతలు సిద్ధంగానే ఉంటారు. గ్యాంగ్‌స్టర్ చిత్రాలంటే మరింత శ్రద్ధ ఉంటుంది. ఆ పాత్రల స్టైల్.. వాటి తీరు అంతా కొత్తగా ఉంటుంది. అలాంటి పాత్రలు నిజం జీవితంలో తారసపడవు. అందుకే వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడతారు" అని అంటున్నారు సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్.
'ముంబయి సాగా'ను తీస్తున్న సంజయ్ గుప్తా మాట్లాడుతూ "నా తొలి చిత్రం సమయంలో ఎంత ఆత్రుత ఉందో ఇప్పుడు ఈ చిత్రానికి అంతే. కచ్చితంగా వెండితెరపై చూపెట్టాల్సిన కథ ఇది" అని అన్నారు. ఇమ్రాన్ హష్మీ చెబుతూ "అండర్‌వరల్డ్ కథలోకి సంజయ్ సార్ మమ్మల్ని తీసుకెళ్లిన తీరుకు నేను ఫిదా అయిపోయాను. ఈ గ్యాంగ్‌స్టర్ కథలో నేను పోలీస్‌గా నటిస్తున్నాను"అని చెప్పారు.
నిజ జీవితంలో చూడరు కదా
"గ్యాంగ్‌స్టర్లు, మాఫియా డాన్‌లు, అండర్ వరల్డ్ వ్యవహారాల గురించి సామాన్య జనానికి టీవీలు, వార్తాపత్రికల ద్వారానే తెలుస్తుంది. సామాన్యులకు నిజ జీవితంలో అలాంటి వ్యక్తులు కనపడటం అరుదు. అందుకే అలాంటి కథల్ని వెండితెరపై చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగానే ఉంటారు. పైగా సినిమాకు ప్రధానమైన హీరోయిజం, విలనిజం బాగా పండే ఆస్కారముండే కథలివి. సాధ్యమైనంత వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలు కచ్చితంగా బాక్సాఫీసు వద్ద విజయం సాధిస్తాయి" అని అంటున్నారు ఓ ప్రముఖ బాలీవుడ్ ఎగ్జిబిటర్.