అమెరికాలో ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు టీవీల్లో ప్రసారమయ్యే 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'కు లీకుల సెగ తగులుతోంది. ప్రీమియర్ విడుదలకు ముందే వీడియోలు అంతర్జాలంలో దర్శనమిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఫైనల్ సిరీస్ నాలుగో ఎపిసోడ్ థాయ్‌లాండ్‌లో లీకైనట్లు ఆ దేశానికి చెందిన ఓ మీడియా సంస్థ వెల్లడించింది. చిత్రాలు నెట్టింట షేర్ అవగా విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని క్లిప్‌లు ట్విట్టర్, యూట్యూబ్‌లలో దర్శనమిచ్చాయని.. కానీ కొంత సమయం తర్వాత తొలగించినట్లు ఆ వార్తా సంస్థ పేర్కొంది.
ప్రధాన పాత్రకు సంబంధించిన 30 సెకన్ల వీడియో మాత్రమే నెట్టింట చక్కర్లు కొట్టిందని కొన్ని ఛానెళ్లలో వార్తలు వచ్చినా... నివేదికలు మాత్రం ఓ ప్రధాన సన్నివేశం సహా చాలా సీన్లు అంతర్జాలంలోకి వచ్చేసినట్లు వెల్లడించాయి.
- గత వారం విడుదలైన మూడో ఎపిసోడ్‌కు చెందిన కొన్ని చిత్రాలు బయటకు రావడం బాగా చర్చనీయాంశమైంది. అయితే ఈ ఘటనలపై హెచ్‌బీఓ సంస్థ ప్రతినిధులు ఇంకా స్పందించలేదు. ఈ ఫైనల్ సిరీస్ నుంచి ఇంకా మూడు ఎపిసోడ్లు రానున్నాయి.
- మొదటి ఎపిసోడ్ ప్రీమియర్ విడుదలకు నాలుగు గంటల ముందే 'డైరెక్ టీవీ నవ్'లో కనిపించింది. జర్మనీలో అమెజాన్ ప్రైమ్ ద్వారా ముందే విడుదలైన రెండో ఎపిసోడ్‌ను... పైరసీ చేసి అమెరికాలో ప్రదర్శనకు ముందే నెట్టింట్లో విడుదల చేశారు.