2019లో వైవిధ్యంతో కూడిన సినిమాలు బాలీవుడ్లో సందడి చేశాయి. కుల విభజన, మహిళా సాధికారత, వివక్ష సహా సామాజిక సమస్యలపై వచ్చిన కొన్ని హిందీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. మాస్ మసాలా చిత్రాలను ఎక్కువగా ఇష్టపడే బాలీవుడ్ ప్రేక్షకులు వైవిధ్యంగా తీసిన బాల, గల్లీబాయ్, సూపర్ 30 లాంటి సినిమాలకూ ఘనవిజయాన్ని అందించారు.
గల్లీబాయ్.. గోల చేశాడు..
ముంబయిలో మురికివాడకు చెందిన ఓ యువకుడి కథగా 'గల్లీబాయ్' చిత్రం రూపొందింది. ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా నటించాడు. ఆలియా భట్ కథానాయక. దేశంలోని ధనికులు, పేదలను వేరుచేసే వర్గ విభజనపై పోరాడే నేపథ్యంతో ఈ సినిమా రూపొందింది. అంతేకాకుండా మనదేశం నుంచి ఆస్కార్ నామినేషన్‌కు వెళ్లింది. అయితే తుది నామినేషన్లో ఎంపిక కాలేదు.
కులతత్వాన్ని ప్రశ్నించేలా..
దేశంలో అనతి కాలంగా పాతుకుపోయిన కులతత్వాన్ని ప్రశ్నించే కథతో తెరకెక్కిన సినిమా 'ఆర్టికల్-15'. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడు. ఉత్తరాదిలో చూసిన కొన్ని నిజ జీవిత సంఘటనలను ప్రేరణగా తీసుకొని ఈ సినిమా తెరకెక్కించాడు అనుభవ్ సిన్హా. నిజాయతీగా నిలిచే పోలీసు అధికారిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నాడు ఆయుష్మాన్.
బట్టతలపై 'బాల'
అతి పిన్న వయసులో శిరోజాలు కోల్పోయే వ్యక్తుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అనేదాన్ని ప్రధాన కథాంశంగా 'బాల' చిత్రం రూపొందింది. ప్రస్తుత యువతరం నిత్యం ఎదుర్కొంటున్న ఈ సమస్యను హాస్యం జోడిస్తూ..తెరకెక్కించారు. ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్ర పోషించాడు. అంతే కాకుండా ఈ సినిమాలో భూమి పెడ్నేకర్ నల్లగా ఉండే మహిళ పాత్ర పోషించి మెప్పించింది. అయితే ఆ రంగు విషయంలో చాలా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
వయోధిక షూటర్ల కథ..
ప్రపంచంలోనే వయోధిక షూటర్లుగా పేరుగాంచిన చాంద్రో తోమర్, ప్రకాశీ తోమర్ జీవితాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'సాండ్ కీ ఆంఖ్'. వీరిద్దరూ షూటింగ్లో 700కు పైగా జాతీయ పతకాలు గెల్చుకున్నారు. చాంద్రోగా భూమి పెడ్నేకర్ నటించగా.. ప్రకాషి పాత్రను తాప్సీ పోషించింది. అక్టోబరు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.
విద్యపై ప్రత్యేక దృష్టి..
బిహార్‌లోని ఆనంద్ కుమార్ అనే వ్యక్తి తన స్వగ్రామంలో నిరుపేద విద్యార్థుల కోసం ఓ కోచింగ్ సెంటర్ నడుపుతున్నారు. అతని బయోపిక్ ఆధారంగా హృతిక్ రోషన్ హీరోగా 'సూపర్ 30' అనే చిత్రం రూపొందింది. ఈ సినిమాలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ వసుళ్లనే సొంతం చేసుకుంది.
సామాన్యుడి ఆక్రోశం..
1980లో విడుదలై ఘనవిజయాన్ని సాధించిన చిత్రం 'ఆల్బర్ట్ పింటో కో గుస్సా క్యో ఆతా హై'. ఈ సినిమాను అదే పేరుతో రీమేక్ చేశాడు దర్శకుడు సౌమిత్రా రనాడే. మానవ్ కౌల్, నందితా దాస్ కీలక పాత్రలు పోషించారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై.. రాజకీయ, సాంఘిక పరిస్థితులపై ఓ సామాన్యూడు ఆవేదన చెంది... ఆక్రోశిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపారు.
స్వలింగ సంపర్కుల కథ..
స్వలింగ సంపర్కం.. ప్రధాన కథాంశంగా తెరకెక్కిన చిత్రం 'ఏక్ లడకీ దేకా తోయి ఐసా లగా'. ఈ సినిమాలో సోనమ్ కపూర్ ప్రధానపాత్ర పోషించింది. దక్షిణాది హీరోయిన్ రెజీనా కసాండ్రా ఈ సినిమాతో హిందీలో తెరంగేట్రం చేసింది.
అమ్మాయికి జుట్టు రాలిపోతే...
అకారణంగా జుట్టు రాలిపోవడం వల్ల సదరు వ్యక్తిని చూసి అందరూ ఎగతాళి చేస్తే వారి పరిస్థితి ఎలా ఉంటుందో అన్న అంశంతో 'గాన్ కేశ్' చిత్రం తెరకెక్కింది. ఈ విషయంపై ఇప్పటికై చాలా చిత్రాలు వచ్చాయి. అయితే అమ్మాయికి జట్టు రాలిపోతే ఆమె పరిస్థితి ఏంటనే ఈ సినిమాలో ప్రధాన కథాంశం. ఈ చిత్రంలో అలోపేసియా అనే వ్యాధితో బాధపడుతున్న ఔత్సాహిక నర్తకిగా శ్వేతా త్రిపాఠి నటించింది. అందమంటే మనసుకి సంబంధించినది సందేశాత్మకంగా చెప్పిందీ సినిమా.
లైంగిక దాడుల నేపథ్యంలో..
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించే కథాంశంతో రూపొందిన చిత్రం 'మర్దానీ-2'. ఈ సినిమాలో రాణి ముఖర్జి ప్రధానపాత్ర పోషించింది. చిన్నారులపై జరిగిన అఘాయిత్యాలపై రూపొందిన ఈ చిత్రం ఎంతో మందిని ఆలోచింపజేసేలా చేసింది.
సెక్షన్ 375..
అక్షయ్ ఖన్నా, రిచా చద్ధా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సెక్షన్ 375'. ఇంతకు ముందు బాలీవుడ్లో వచ్చిన ఏ సినిమాలో చూపించని విధంగా అత్యాచారాలపై ఈ సినిమాలో ప్రస్తావించారు. చట్టం, న్యాయం అనేవి ఇందులో ఎంతమేరకు బాధితులకు అందుతున్నాయో అనేవి చూపించారు. సున్నితమైన అంశాన్ని ఎంచుకొని అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు అజయ్ బాల్.
ఇదీ చదవండి: మహాభారతంపై జక్కన్న క్లారిటీ.. పూర్తి చేస్తానని వెల్లడి