నిలిచిపోయిన సినిమాలు పట్టాలెక్కబోతున్నాయి. క్లాప్ బోర్డుల చప్పుళ్లు మళ్లీ వినిపించబోతున్నాయి. రెడీ... స్టార్ట్... యాక్షన్ అంటూ ఇదివరకటిలా చిత్రసీమ పరుగులు పెట్టబోతోంది. కరోనా ప్రభావంతో కొన్నాళ్లుగా కళ తప్పిన సినిమా రంగంలో సందడి మొదలు కాబోతోంది. ఇప్పటికే నిర్మాణానంతర పనులకి అనుమతులు లభించాయి. వచ్చే నెలలోనే చిత్రీకరణలు కూడా మొదలు కాబోతున్నాయి. ప్రదర్శనలకి మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిత్రసీమలోని పరిస్థితుల్ని, కార్మికుల ఉపాధి గురించి సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సానుకూలంగా స్పందించడం వల్ల సినిమాల్ని పట్టాలెక్కించడానికి దర్శకనిర్మాతలు సన్నద్ధమవుతున్నారు.
తెలంగాణలో లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగులు, పోస్టు ప్రొడక్షన్ కార్యకలాపాలను దశల వారీగా పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తక్కువ మందితో, ఇండోర్‌లో నిర్మాణానంతర పనులు తొలుత ప్రారంభించుకోవాలని, జూన్‌లో సినిమా షూటింగులు మొదలు పెట్టుకోవాలని చెప్పారు. సినీరంగ ప్రముఖులతో సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్... సినీప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేశ్‌బాబు, అల్లు అరవింద్, ఎన్.శంకర్, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కిరణ్, రాధాకృష్ణ, కొరటాల శివ, సి.కల్యాణ్, మెహర్ రమేశ్, దాము తదితరులు పాల్గొన్నారు. షూటింగులకు అనుమతివ్వాలని, థియేటర్లు తెరిచేందుకు అనుమతించాలని.. సినీ ప్రముఖులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు.
సినీ పరిశ్రమ బతకాలి
"సినిమా రంగంపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారు. సినీ పరిశ్రమ బతకాలి. అదే సందర్భంగా కరోనా వ్యాప్తి కూడా జరగవద్దు. నిర్మాణానంతర పనులు, చిత్రీకరణలు, థియేటర్లలో ప్రదర్శనలను దశల వారీగా పునరుద్ధరించాలి. అందుకోసం తక్కువ మందితో కరోనా కట్టడి మార్గదర్శకాలను అనుసరించి సినిమా షూటింగులను నిర్వహించుకోవాలి. ఎందరితో షూటింగులు చేపట్టాలి? తదితర అంశాలపై సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సినీ ప్రముఖులు సమావేశమై చర్చించాలి. తర్వాత ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించి, షూటింగులకు అనుమతిస్తుంది. కొద్ది రోజులు నడిచాక.. పరిస్థితిపై కొంత అంచనా వస్తుంది కాబట్టి, సినిమా థియేటర్లు పునఃప్రారంభించే విషయంపై నిర్ణయం తీసుకుంటాం" అని సీఎం చెప్పారు.
సినిమా, టీవీ, డిజిటల్ మీడియాకి సంబంధించిన సమస్యల్ని సానుకూలంగా విని... వేలాది మంది దినసరి వేతన కార్మికులకి ఊరట కలిగేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. వినోద పరిశ్రమని పునః ప్రారంభించే దిశగా త్వరలోనే ప్రభుత్వం విధి విధానాలు రూపొందిస్తుందని, అందరికీ మేలు కలిగేలా చేస్తుందని హామీ ఇచ్చారు. ఆయనకి పరిశ్రమ తరఫున కృతజ్ఞతలు.
- చిరంజీవి, కథానాయకుడు
సినిమాల్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకువచ్చే విషయంపై జరిగిన చర్చల్లో మా అభ్యర్థనల్ని ఓపికగా విన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆయన మాపై ఎంతో సానుభూతితో ఉన్నారు. చిత్ర పరిశ్రమకి అవసరమైన ఓదార్పునిస్తూ మాట్లాడారు. దీనిపై త్వరలోనే ఒక తీర్మానం చేస్తామని మాటిచ్చారు. మా అభ్యర్థనల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినందుకు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసానికి ధన్యవాదాలు
- దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి
ఇదీ చూడండి.. ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు.. దర్శకుడిగా మారితే!