మీ అభిమాన నటుడు ఒక్కసారిగా కళ్లముందు కనిపిస్తే ఎంత బావుంటుంది. అదీ ఆయనతో కలిసి ఫొటో దిగే అవకాశం వస్తే ఆ ఆనందం అంతా ఇంతా కాదు. అయితే సరిగ్గా ఇలాంటి గొప్ప అవకాశం కొంతమంది ఉద్యోగులు, సిబ్బందికి దక్కింది. అదీ రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి తహసీల్దార్ కార్యాలయం. అక్కడి ఉద్యోగులు, సిబ్బంది పనిలో నిమగ్నమైన వేళ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. అయితే తహీసీల్దార్ కార్యాలయానికి ఆయన ఎందుకు వచ్చారు అనుకుంటున్నారా? అందరు వచ్చినట్లే ఆయనా... రిజిస్ట్రేషన్ పనుల కోసం వచ్చారు.
సందడి వాతావరణం
శంకర్‌పల్లి మండలం పరిధిలోని గోపాలపురంలో తారక్ ఇటీవల ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. ఆ భూమి రిజిస్ట్రేషన్ పనుల కోసం ఆయన శుక్రవారం మధ్యాహ్నం శంకర్‌పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. ఎన్టీఆర్ రాకతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది.
నెట్టింట్లో వైరల్
కార్యాలయంలోని ఉద్యోగులు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. రిజిస్ట్రేషన్ పనులు పూర్తైన వెంటనే కొంతమందితో ఫొటోలు దిగిన ఆయన హైదరాబాద్‌కు పయనమయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
సినిమాలతో బిజీ
ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్న తారక్... రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే ఆయన కొరటాల శివతో ఓ ప్రాజెక్ట్ పట్టాలెక్కించే అవకాశమున్నట్లు సమాచారం. మరోవైపు, ‘అరవింద సమేత’ తర్వాత తారక్-త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా ఓకే అయిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: 'అక్కినేని' ఫ్యాన్స్‌కు షాకిచ్చిన సమంత