బాలీవుడ్‌కు, ఫ్యాషన్‌కు మధ్య చాలా దగ్గరి సంబంధం ఉంది. ఎందుకంటే బాలీవుడ్ తారలు ఏది ధరించినా.. అదొక సరికొత్త ట్రెండ్. ఆధునిక కాలంలో అలియా భట్, దీపికా పదుకొణె, సోనమ్ కపూర్ వంటి హీరోయిన్లు ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త పోకడలను తెస్తున్నప్పటికీ.. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే చాలా మంది ఫ్యాషన్ క్వీన్లుగా ఉన్నారు. మధుబాల వస్త్రధారణ నుంచి సాధన కేశాలంకరణ వరకు ప్రతి ఒక్క తార అప్పట్లోనే కుర్రకారు మతి పొగొట్టినవాళ్లే.
మధుబాల.. 50వ దశకంలో ఓ ఫ్యాషన్ ఐకాన్. అందం, అభినయంతోనే కాకుండా వస్త్రాలంకరణ ద్వారా ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. అప్పట్లో ఆమె ధరించే లూజ్ ప్యాంట్, రంగురంగుల చొక్కాలు మహిళలను బాగా ఆకట్టుకున్నాయి. ఆమె నటించిన 'మొఘల్-ఎ-అజామ్' చిత్రంలో వేసుకున్న అనార్కలి డ్రెస్‌లు అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేశాయి.
మీనా కుమారి.. హీరోయిన్లలో ప్రత్యేక కేశాలంకరణతో ప్రేక్షకులను ఆకర్షించేది. 'పాకీజా' సినిమాలో ఆమె ధరించిన దుస్తులు చాలా కాలం ఫ్యాషన్‌గా మారాయి. మీనా ఇష్టపడే లాంగ్ రౌండ్ కుర్తా, దుపట్టా ఇప్పటికీ భారతీయ వస్త్ర మార్కెట్లో ప్రాచుర్యం పొందుతున్నాయి.
బాలీవుడ్ నటీమణుల్లో అత్యంత స్టైలిష్‌గా ఆశా పరేఖ్ ఉండేది. వయసు పెరగడం వల్ల నటించడం మానేసినా.. ఆమె రాయల్ లుక్‌తో అవార్డుల కార్యక్రమాల్లో రెడ్ కార్పెట్‌పై వీక్షకులను చూపు తిప్పుకోకుండా చేసేది. ఆమె ధరించే గాగ్రా చోళీకి సరిపడే దుపట్టా అప్పట్లో ఓ ట్రెండ్. 'ఆన్ మీలో సజ్నా' చిత్రంలోని 'తేరే కరణ్ మేరే సాజన్' పాట ద్వారా ప్రేక్షకుల్లో మరింత గుర్తింపు తెచ్చుకుంది.
'శ్రీ 420' చిత్రంతో తెరంగేట్రం చేసిన సాధన.. బాలీవుడ్లో తొలి ఫ్యాషన్ ఐకాన్‌గా నిలిచింది. ఆమె కేశలాంకరణను 'సాధన హెయిర్‌కట్' అని పిలిచేవారట. 'చుడీదార్ సల్వార్' ట్రెండ్ సాధన నుంచే మొదలైంది.
బాలీవుడ్ నటీమణుల్లో ఎక్కువ కాలం ప్రేక్షకుల్లో మదిలో నిలిచిన హీరోయిన్ నర్గీస్ దత్. ఆమెకు చీరలంటే ఎక్కువ ఇష్టం. దేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి చీరలను సేకరించేది. సంప్రదాయ దుస్తులపై ఆమెకున్న అభిమానాన్ని తెలుసుకొని.. నర్గీస్ భర్త వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడల్లా చీరలను బహుమతిగా తెచ్చవారట.
బాలీవుడ్ తారల్లో వహీదా రెహ్మాన్.. తన అందం, అభినయంతో పాటు తెలివితేటలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. అమయాకమైన నటనతో ప్రేక్షకులను ఆకర్షించేది వహీదా.
మాలా సిన్హా.. తన నటనతో చాలా కాలం ప్రేక్షకుల హృదయాన్ని దోచేసింది. 'అన్పద్' చిత్రంలోని 'ఆప్కీ నజ్రూన్ నే సంజా ప్యార్' పాటలో అందంతో ఆకట్టుకుంది.
మిస్ ఇండియా టైటిల్ గెలిచిన తర్వాత సినిమాలపై దృష్టి సారించిన తొలి నటి నూతన్. 1958లో విడుదలైన 'దిల్లీ కా థగ్' చిత్రంలో స్విమ్ సూట్లో కనిపించి అందర్ని ఆశ్చర్యపరిచింది. అందాల భామలకు నేటి చిత్రాల్లో అవకాశాలు లభించడం సులభమే. కానీ, నూతన్.. సినిమా అవకాశం కోసం చాలా కష్టపడింది. ఆ తర్వాత తన నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది.
తన అసమానమైన అందంతో గతంలో చర్చనీయాంశమైంది నవాబ్ భాను (నిమ్మీ). బర్సాత్, ఆన్, మేరే మెహబూబ్ చిత్రాల్లో తన నటనకు ప్రేక్షకుల నుంచి విశేషాదరణ లభించింది. అప్పట్లో హాలీవుడ్ రొమాంటిక్ స్టార్ ఫ్లిన్.. ఒక సినిమా షూటింగ్ సమయంలో ఆమె చేతిని ముద్దాడటానికి ప్రయత్నించగా.. నిమ్మీ అందుకు నిరాకరించింది. అప్పటి నుంచి ఆమెను 'అన్ కిస్డ్ గర్ల్ ఆఫ్ ఇండియా'గా పిలిచేవారు.
ఇదీ చూడండి... షూటింగ్‌లు పునః ప్రారంభంపై బాలకృష్ణ క్లారిటీ