కథలో బలం ఉండి.. పాత్రలో వైవిధ్యం కనిపించాలే కానీ, సినిమాలే కాదు.. లఘు చిత్రాల్లో నటించడానికైనా నేను వెనుకాడనంటున్నారు కథానాయకుడు సత్యదేవ్. తాజాగా 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రంతో ఓటీటీ వేదికగా ఓ చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారాయన. వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది.
ఈ సినిమా ఆదివారం సాయంత్రం 6గంటలకు ఈటీవీలో ప్రసారం కాబోతోంది. 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' థియేటర్లలో రిలీజ్ కాకుండానే.. నేరుగా ఈటీవీలో తొలిసారి ప్రసారం అవుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈనాడు సినిమాతో ప్రత్యేకంగా ముచ్చటించారు సత్యదేవ్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
తొమిదేళ్ల నిరీక్షణకు ఫలితం
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య విజయం నాకెంతో ప్రత్యేకం. నిజానికి దీన్ని వెండితెర లక్ష్యంగానే తెరకెక్కించినప్పటికీ.. పరిస్థితుల కారణంగా ఓటీటీలోకి తీసుకురావాల్సి వచ్చింది. ఇది కాస్త బాధగా అనిపించినా, మంచి ఫలితాన్నే అందించింది. దాదాపు 9ఏళ్ల నిరీక్షణ తర్వాత నేనందుకున్న తొలి భారీ విజయమిది. నటుడిగా నాకెంతో పేరు తెచ్చిపెట్టింది.
పవన్ కల్యాణ్, నాని, రామ్ చరణ్, క్రిష్, ఇంద్రగంటి.. ఇలా అనేక మంది సినీ పెద్దలు మా చిత్రాన్ని మెచ్చుకోవడం చాలా సంతృప్తినిచ్చింది. ఇప్పుడీ చిత్రం ఈటీవీ ద్వారా ఇంటింటికీ చేరువ కానుండటం ఆనందాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే ఈటీవీ యాజమాన్యం సినిమాల్ని తీసుకునే విషయంలో చాలా సెలక్టివ్‌గా ఉంటుంది. ఈటీవీకి ప్రజల్లో ఉన్న ఆదరణ చాలా ఎక్కువ. అందుకే ఇప్పుడిందులో ప్రసారం కావడం ద్వారా మరింత ఎక్కువ మందికి మా చిత్రం చేరువ కాబోతుందని సంతోషంగా ఉంది. అందులోనూ మా కుటుంబానికి ఈటీవీ - ఈనాడుకున్న అనుబంధం ప్రత్యేకమైనదే. గతంలో నాన్న ఈనాడులోనే అడ్వర్టయిజింగ్ మేనేజర్‌గా పని చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కొత్త సినిమాలు..
ప్రస్తుతం 'గుర్తుందా శీతాకాలం', 'తిమ్మరుసు' చిత్రాలతో పాటు స్కైల్యాబ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఓ సైన్స్ ఫిక్షన్ చిత్రం చేయనున్నా. వీటిలో ముందు ఏది సెట్స్‌పైకి వెళ్తుందన్నది ఇప్పటికైతే స్పష్టత లేదు. ఇవి కాక మరో రెండు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.
ప్రతినాయక పాత్రలకూ సై..
'అందరూ ఎక్కువ రీమేక్‌లే చేస్తున్నారేంటి?' అని అడుగుతుంటారు. నిజానికి నేనిది అనుకొని చేస్తున్నది కాదు. కథ బాగుంటే ఏదైనా చేయొచ్చని అనుకుంటా. కథ నచ్చక నేను వదిలేసిన రీమేక్‌లు చాలానే ఉన్నాయి. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్‌సిరీస్‌లు చేస్తున్నానంటే.. అది కథ నచ్చడం వల్లే. నటుడిగా సినిమా సినిమాకూ వైవిధ్యం చూపించేందుకు ఇష్టపడతా.
కథ బలంగా ఉండి మంచి పాత్ర దొరికితే విలన్‌గా కనిపించడానికీ వెనుకాడను. కాకపోతే ఆ పాత్ర నటుడిగా నాకు సవాల్ విసిరేలా ఉండాలి. అవతల కథానాయకుడి పాత్రకు దీటుగా ఉండాలి. ఆపద్బాంధవుడు, సాగర సంగమం, అపరిచితుడు, దశావతారం తరహా వైవిధ్యభరిత చిత్రాలు చేయాలనేది నా కోరిక.
పాత్ర కోసం.. ఓ ప్రయోగం
దర్శకుడు వెంకటేష్ మహా.. నేను గతంలోనే ఓ సినిమా చేయాలనుకున్నాం. అనుకోని కారణాల వల్ల అది కుదర్లేదు. ఆ తర్వాత ఈ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్ర కథ చెప్పారు. నిజానికి నేనప్పటికే మలయాళంలో ఈ చిత్ర మాతృక మహేషింటే ప్రతికారమ్‌ను చూశా. నాకు బాగా నచ్చింది. అందుకే ఇంత మంచి కథను తెలుగులో ఆయన దర్శకత్వంలో చేస్తున్నా అనగానే మరింత సంతోషమనిపించింది.
ఈ చిత్రాన్ని 35 రోజుల్లో పూర్తి చేశాం. దీంట్లో నేను ఉమా మహేశ్వరరావు అనే నెమ్మదస్థుడైన ఫొటోగ్రాఫర్‌గా కనిపిస్తా. ఈ పాత్ర కోసం నేను చిన్న ప్రయోగం చేశా. ఈ సినిమా చేయడానికి నెల రోజుల ముందు నుంచే నేను అందులోని పాత్రలా ఉండటానికి ప్రయత్నించా. ఎక్కడైనా ట్రాఫిక్‌లో ఇరుక్కున్నా.. ఏదైనా చిరాకుల్లో ఉన్నా ఉమామహేశ్వరరావులాగే సైలెంట్‌గా ఉండేవాణ్ని. అలా చిత్రీకరణకు ముందుగానే నేను పాత్రలోకి దిగిపోవడం వల్ల తెరపై దాని ప్రభావం చక్కగా కన్పించింది.
మరో ఆసక్తికర విషయం ఏంటంటే సినిమాలో ప్రతినాయకుణ్ని కొట్టే వరకు నేను చెప్పులేసుకోకుండా తిరుగుతుంటా కదా. వాస్తవానికి సినిమా చిత్రీకరణ జరుగుతున్నన్ని రోజులూ.. నేను నిజంగానే చెప్పుల్లేకుండానే తిరిగా. ఈ సినిమాలో విరామానికి ముందు, క్లైమాక్స్ సమయాల్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం. ఆ ఫైట్లలో నేనూ విలన్ పాత్ర చేసిన నటుడు కాస్త నిజంగానే కొట్టుకున్నాం. చిన్న చిన్న దెబ్బలూ తగిలాయి.
ఇదీ చూడండి 18 ఏళ్లకే సరికొత్త చరిత్ర సృష్టించిన అమెరికా యువ గాయని