ఇండో-అమెరికన్ ప్రొడక్షన్ పతాకంపై.. శ్యామ్ మాదిరాజు దర్శకత్వంలో ఫీచర్ ఫిల్మ్‌గా తెరకెక్కిన చిత్రం 'హరామి'. ఇమ్రాన్ హష్మీ ప్రధానపాత్రలో నటించారు. ఈ సినిమా బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(బీఐఎఫ్‌ఎఫ్)కు ఎంపికైంది. ఈ ఏడాది భారత్ నుంచి బుసాన్ వేడుకలకు ఎంపికైన ఏకైక చిత్రం 'హరామి' కావడం విశేషం. మొత్తం 194 చిత్రాలను ఈ వేదికపై ప్రదర్శించనున్నారు.
దక్షిణ కొరియా ఆతిథ్యంలో.. అక్టోబర్ 21 నుంచి 30 వరకు బీఐఎఫ్‌ఎఫ్ జరగనుంది. అంతర్జాతీయ సినీ వేడుకకు తమ చిత్రం ఎంపికవ్వడం పట్ల హీరో, దర్శకుడు హర్షం వ్యక్తం చేశారు.
"నాకు ఈ కథను శ్యామ్ మాదిరాజు చెప్పగానే నన్నెంతో ఆకర్షించింది. ఇలాంటి గొప్ప వేడుక ప్రదర్శనకు మా చిత్రం ఎంపికవ్వడం గొప్ప వరం".
- ఇమ్రాన్ హష్మీ, బాలీవుడ్ నటుడు
"ఈ చిత్రం పూర్తి చేయడానికి రెండేళ్లు పట్టింది. ఇమ్రాన్ హష్మీ 'సాగర్ భాయ్' పాత్రను చాలా బాగా పోషించారు. అంతేకాదు మాజీ ఇంగ్లీష్ టీచర్ గాంగ్ లార్డ్‌గా మారిపోయారు. ఈ పాత్ర చాలా సంక్లిష్టంగా, సూక్ష్మమైనా సరే ఇమ్రాన్ ఇంతకు ముందు చేసినదానికి భిన్నంగా చేశారు. ఇది మా ఇద్దరికీ నిజమైన సవాలుగా చెప్పుకోవచ్చు. చిత్రీకరణలో భారీ సవాళ్లు ఉన్నప్పటికీ విక్టోరియా టెర్మినస్, బొంబాయి సెంట్రల్, ఇతర రైళ్ల స్టేషన్లలో చిత్రీకరణ జరిపాం. సినిమా కోసం అమెరికా, యూకే, డెన్మార్క్, దక్షిణాఫ్రికా నుంచి అంతర్జాతీయ ప్రతిభావంతులతో సహా 200 మందికి పైగా సిబ్బందితో కలిసి పనిచేశాము" అని దర్శకుడు శ్యామ్ మాదిరాజు వెల్లడించారు.