'మహానటి'లో జెమినీ గణేశన్‌గా నటించి, తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు దుల్కర్ సల్మాన్. మమ్ముట్టి నట వారసుడిగా తెరకు పరిచయమైనా, వైవిధ్యమైన చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన కథానాయకుడిగా నటించిన 'కనులు కనులు దోచాయంటే' శుక్రవారం విడుదలవుతోంది. ఆయనకి ఇది 25వ చిత్రం. రీతూ వర్మ కథానాయిక. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పలు విషయాలు పంచుకున్నారు దుల్కర్.
8 ఏళ్ల ప్రయాణంలో 25 సినిమాలు చేశారు. ఈ ప్రస్థానం మీకెలా అనిపిస్తోంది?
ఏ భాషలోకి అడుగుపెట్టినా ప్రేక్షకులు వాళ్ల మనిషిలా స్వాగతిస్తున్నారు. ఇక చిత్రాల సంఖ్య అంటారా.. మలయాళంలోని మిగతా హీరోలతో పోల్చితే నేను నెమ్మదిగానే చేస్తున్నానేమో. వాళ్లలా నేనూ వేగం పెంచాలి.
'మహానటి' తర్వాత మళ్లీ తెలుగులో నటించలేదు, కారణమేంటి?
నేను ఏ భాషలోకి వెళ్లినా నాకు ఇదే ప్రశ్న ఎదురవుతుంటుంది. మార్కెట్ లెక్కలేసుకుని సినిమా చేయాలనుకోను. ఓ కథ ఎంచుకున్నప్పుడు అది ఏయే వర్గాలకు చేరువవుతుందో వాళ్ల వద్దకే తీసుకెళ్తా. ఈ చిత్ర దర్శకుడు దేసింగ్ పెరియసామి కథ చెప్పినప్పుడే ఇది తమిళం, తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనిపించింది.
ఈ చిత్ర కథ ఏంటి? ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
నేనిందులో సరదాగా గడిపేసే ఓ కుర్రాడి పాత్రను పోషించా. విభిన్న రకాల జోనర్లు కలిసిన థ్రిల్లింగ్ కథాంశంతో ఇది రూపొందింది. కథలో మలుపులు ఉత్కంఠకు గురిచేస్తాయి. గౌతమ్ మేనన్ ఇందులో ప్రతినాయకుడిగా నటించారు. ఆయన పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
రీతూ వర్మ మీకు తెలుగు సంభాషణల్లో ఏమైనా సహాయం చేసిందా?
ఆమె నాకు తెలుగు నేర్పించడం కాదు, నేనే తనకి మలయాళం నేర్పించా. నాకు కొత్త భాషలు నేర్చుకోవడమంటే ఇష్టం. ఓ భాష గురించి తెలియకుండా అందులో సినిమా చెయ్యడానికి సాహసించను. ‘మహానటి’లో నా సంభాషణల్లోని ప్రతి పదాన్ని నేర్చుకుని డబ్బింగ్ చెప్పుకున్నా. ఇప్పుడీ చిత్రానికీ తెలుగులో నేనే డబ్బింగ్ చెప్పా.
మీ తండ్రి మమ్ముట్టి ‘మామాంగం’ లాంటి చారిత్రక చిత్రాలు చేశారు. మీకూ అలాంటి ఆలోచన ఉందా?
నిజానికి నాకు అలాంటి కథలు అంతగా సరిపడవేమో అనిపిస్తోంది. ఈ తరానికి కనెక్ట్ అయ్యేలా ఉండే ‘మహానటి’ లాంటి గొప్ప స్ఫూర్తిదాయక కథలు చెయ్యడానికి నేనెప్పుడూ సిద్ధమే. త్వరలోనే తెలుగులో ఓ కొత్త సినిమా ప్రకటిస్తా. మిగిలిన భాషల్లో ఆరు చిత్రాల వరకు చేయాల్సినవి ఉన్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">