మాదక ద్రవ్యాల కేసు విచారిస్తున్న బెంగళూరులోని బాణసవాడి ఉపవిభాగం పోలీసులు తెలుగు సినీ నటుడు తనీష్‌తోపాటు మరో ఐదుగురిని శనివారం విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. వీరిలో ఓ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత తదితరులున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. మాదకద్రవ్యాల కేసులో ఇద్దరు విదేశీయులను తొలుత అరెస్టు చేసి విచారించారు. వారిచ్చిన సమాచారం మేరకు మస్తాన్, విక్కి మల్హోత్రా పేర్లు బయటకు వచ్చాయి.
మస్తాన్‌ను విచారించగా సినీ నిర్మాత శంకరగౌడ పేరు వెలుగులోకి వచ్చింది. ఆయన తన కార్యాలయంలో మద్యం, విందు పార్టీలు ఇస్తున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఈ పార్టీలకు ప్రముఖులు హాజరయ్యేవారు. తెలుగులో పలు సినిమాల్లో నటించిన తనీష్‌కు నోటీసు పంపినట్లు నగర పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. 2017 జులైలో జరిగిన మాదక ద్రవ్యాల కేసులో ఆయన హైదరాబాద్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు హాజరయ్యారు.