కరోనా మహమ్మారి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. కరోనా సోకిన చాలామంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తరుణంలో ఆక్సిజన్ కొరతను తగ్గించేందుకు డైరెక్టర్ సుకుమార్ ముందడుగు వేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలంలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకోసం తన మిత్రుడు అన్యం రాంబాబుతో కలిసి సబ్‌కలెక్టర్ హిమాన్ష్ కౌశిక్, అనంతపురం అసిస్టెంట్ కలెక్టర్ గోకరకొండ ప్రవీణ్(స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా)తో బుధవారం చర్చించారు.
ప్లాంట్ నిర్మించేందుకు చేయాల్సిన కార్యాచరణపై మాట్లాడారు. అనుమతులు లభిస్తే వెంటనే నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని సుకుమార్ తెలిపారు. రూ.25లక్షలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులకు మాటిచ్చారు. అనుమతుల కోసం వేచి చూస్తున్నట్లు చెప్పారు. ముందస్తుగా ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న వారికి సిలిండర్లు అందించేందుకు ఆజాద్ ఫౌండేషన్‌కు రూ.7లక్షల విలువైన ఆక్సిజన్ సిలిండర్లు అందించారు. కరోనాపై పోరుకు తన వంతు సాయంగా గతేడాది ఏప్రిల్‌లో సుకుమార్ రూ.10 లక్షలు అందజేశారు.
డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా 'పుష్ప' తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు 'పుష్ప' పూర్తవగానే రామ్ చరణ్‌తో ఒక సినిమా చేయనున్నట్లు మరో ఆసక్తికరమైన వార్త కూడా చక్కర్లు కొడుతోంది. మరి ఈ రెండింట్లో నిజమెంత..? ఒకవేళ రెండూ నిజమే అయితే.. ఏ సినిమా ముందు పట్టాలెక్కుతుందో తెలియాలంటే మాత్రం కొంతకాలం వేచి చూడాల్సిందే.
ఇదీ చూడండి.. ఈ హైదరాబాదీ సుందరి రూటే సెపరేటు!