అమృత తుల్యమైన గీతాలతో ఆబాలగోపాలాన్ని రంజింపజేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఇక లేరన్న వార్తను సినీ సంగీత ప్రపంచం జీర్ణించుకోలేకపోతుంది. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సినీతారలంతా సామాజిక మాధ్యమాల వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రముఖ దర్శకుడు సుకుమార్.. ఎస్పీబీకి భావోద్వేగభరిత అక్షర నివాళి అర్పించారు.
ఈసారికి క్షమించేయండి సర్..
"అదేంటో..
రాసుకున్న ప్రతిమాట మీ వాయిస్‌లోనే వినిపిస్తుంది..
ఒక్క పాటేంటి..
ప్రతి వాక్యం, కథా, నవల ఏదైనా సరే..
వాటి గొంతు మాత్రం మీదే..
అంతలా మాలో అంతర్భాగమైపోయింది..
మీ గాత్రం మీ పాటలు వింటూనో..
మీ రాగాలు హమ్ చేస్తూనో..
మీ గాత్రమాధుర్యం గురించి చర్చిస్తూనో..
ఎన్నో గంటలు.. కాదు..
రోజులు.. సంవత్సరాలు బ్రతికేశాం.. బ్రతికేస్తాం..
ఆ రోజులన్నీ మీవే కదా..
మీరు మాతో గడిపినవే కదా..
అంటే ఒకేరోజు కొన్ని కోట్ల రోజులు బతకగల నైపుణ్యం మీది..
ఇంక మీకు మరణం ఏంటి???
మరణం పిచ్చిది..
పాపం తనొచ్చాక మీరుండరని అనుకుంది..
ఇలా వచ్చి..
అలా చేయి పట్టుకుని తీసుకెళ్లి పోవచ్చు అనుకుంది.
కానీ ఎక్కడ చూసినా మీరే, ఎక్కడ విన్నా మీ పాటే..
మా ప్రతి అనుభూతిలోనూ మీ గానామృతమే..
మా హృదయాలలో..
మా అంతరంగాలలో..
అజరామరమైన మిమ్మల్ని..
ఎలా తీసుకెళ్లాలో దానికర్థంకాలేదు..
మిమ్మల్ని తీసుకెళ్లడమంటే..
ఈ భూమండలం మొత్తాన్ని మోసుకెళ్లడమేనని దానికర్థమైంది..
మొదటిసారి మరణం ఒంటరైంది.
ఏం చేయాలో తెలియక.. బిత్తర చూపులు చూస్తోంది..
దిక్కుతోచక భోరున ఏడుస్తోంది..
'మృతిలో తలదాచుకున్న బ్రతుకు..
శృతిలో కలిపింది నిన్ను జతకు' మళ్లీ మీ పాటే దానికి ఓదార్పు..
పోన్లెండి బాలు సర్..
ఈసారి దాన్ని క్షమించేయండి..
ఇంకెప్పుడూ రాదులేండి..
('మరణంతో నిజమయ్యే ఈ బతుకు.. ఒక కలయేలే.. కల నిజాల సంధిరేఖ కలిసిపోవు నీలోనే..' -ఎప్పుడో రాసుకున్న వాక్యాలు గుర్తొస్తున్నాయి. అది కూడా మీ గొంతుతోనే)"
- సుకుమార్