'కళ్లు.. కళ్లూ ప్లస్సు.. వాళ్లు వీళ్లు మైనస్’ అంటూ సినిమా పాటలకు లెక్కల సూత్రాలు బోధించిన మాస్టారాయన. విలన్ పరిగెత్తే వేగానికి.. వాడు కింద పడాలంటే ఎన్ని డిగ్రీల కోణంలో వస్తువు విసరాలో చెప్పి.. ఫైట్లలో భౌతికశాస్త్రాన్ని చొప్పించిన గురువాయన. సన్నివేశాల్లో రసాయన శాస్త్రాన్ని.. మాస్ డైలాగుల్లో తత్వ శాస్త్రాన్ని చెప్పగల లెక్చరరాయన. 'పుష్ప'తో తెలుగు కథను పాన్‌ఇండియా స్థాయిలో చెప్పి మెప్పించారాయన. ఆ విజయానందంలో ఈసారి సంక్రాంతి జరుపుకోనున్న ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ను 'ఈనాడు సినిమా' ప్రత్యేకంగా పలుకరించింది. తన జీవితంలోని మూడు దశల్లో ముఖ్యమైన సంక్రాంతుల గురించి చెప్పమని కోరింది. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
Sankranti festival: "సంక్రాంతికి మా ప్రాంతంలో మంచు దుప్పటి కప్పుకొని ఉంటుంది. మనిషికి మనిషి కన్పించనంతగా పొగమంచు. భలే ఉండేది ఆ వాతావరణం. మా పెద్దక్క నలుగుపిండి పెట్టి, కుంకుడు పోసి.. బాగా స్నానం చేయించేది. ఏడ్చినా వదిలిపెట్టేది కాదు. మా నాన్న (తిరుపతి నాయుడు) అందరికీ కొత్త బట్టలు కుట్టించేవాడు. మా నాన్న ఫ్రెండే టైలర్. ఆయన పేరు చిన్నంశెట్టి. ఒకే రంగు క్లాత్ తెచ్చి అందరికీ నిక్కరు, షర్టులు.. మా ఇంటి దగ్గరే టైలర్లు మిషన్లు పెట్టేవారు. ఉదయాన్నే కొత్త బట్టలు కట్టుకొని.. పొగమంచులో పరిగెత్తుతూ భలే ఆడుకునే వాళ్లం. నాకు ఇష్టమని అమ్మ(వీర వేణి) బూరెలు చేసేది. అందులోని పూర్ణం అంటే ఇంకా ఇష్టం. నాకోసం దాన్ని అమ్మ పక్కకు తీసి ఉంచేది.
* ఇంటి ముందు అలకడానికి, గొబ్బెమ్మలు చేయడానికి ఆవు పేడ తీసుకురావడం అనేది పెద్ద పని. గేదె పేడ వాడేవారు కాదు. ఆవు పేడ కిందపడకుండా పట్టుకురావాలి. తట్టలు పట్టుకొని ఆవుల వెనుకే తిరిగేవాళ్లం. ఇది భలే తమాషాగా ఉండేది.
* ఇంకా సంక్రాంతి అంటే నాకు బాగా గుర్తొచ్చేది శివకోడు ముసలమ్మ తీర్థం. అది పెద్ద సంత అన్నమాట. అక్కడ చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మల దగ్గర నుంచి ఆడపిల్లలకు, ఇంట్లోకి పనికొచ్చే వస్తువులు, వ్యవసాయ పరికరాలు ఇలా.. అన్నీ అమ్మేవారు. అక్కడ మా పెద్దనాన్న మిఠాయి కొట్టు పెట్టేవారు. మా పెద్దనాన్న పేరు వెంకటరత్నం. ఇంకో పెద్దనాన్న సూర్రావు. చిన్న పెద్దనాన్నకు ఊర్లో కొట్టు ఉండేది. అందుకు ఆయన్ను కొట్టునాన్న అనే వాళ్లం. వెంకటరత్నం పెద్దనాన్న నడిపే మిఠాయి కొట్టు దగ్గరికి వెళ్లే వాళ్లం. అక్కడ జీడి పాకం బాగుంటుంది. మా సూర్రావు పెద్దనాన్న.. వెంకటరత్నం పెద్దనాన్నకు తెలియకుండా జీడిపాకం ఇచ్చేవారు. మేం దాన్ని తీసుకొని పక్కకు వెళ్లి తినేసేవాళ్లం. తీర్థంలో పెద్ద నాటక సంస్థలు వచ్చి నాటకాలు ఆడేవారు. కనుమ రోజు రికార్డింగ్ డ్యాన్స్‌లు పెట్టేవారు.
* తీర్థంలో ఏమైనా కొనుక్కోవడానికి డబ్బులిస్తే.. తను తక్కువ ఉపయోగించుకొని, అందులో ఎక్కువ నాకే ఇచ్చేది మా చిన్నక్క. మా అమ్మకు పకోడి, ఖర్జూర పళ్లంటే ఇష్టం. ఆ రెండు కొనుక్కొని అమ్మకు ఇచ్చేవాడిని. పాకుండలు అనే ఒక మిఠాయి లాంటిది తయారుచేసేవాళ్లు. నెల రోజుల పాటు నిల్వ ఉండేవి. అవి ఎక్కువగా తినేవాళ్లం. పోయిన వస్తువులు దొరకాలని ముసలమ్మకు మొక్కుకొనే వాళ్లం. పెన్నులు, నోట్స్‌లు, పెన్సిళ్లు.. ఇలాంటివి అన్నమాట. అదో నమ్మకం. అవి తిరిగి దొరికితే.. అమ్మకు 5 పైసలు.. అలా హుండీలో వేస్తామని మొక్కుకొనేవాళ్లం.
* చిన్నపిల్లలం పరికొసలతో దండలు చేసేవాళ్లం. ఎవరు పొడుగ్గా చేస్తే వాళ్లు గొప్పన్నమాట. ఎవరిదైనా పొడుగ్గా ఉందంటే.. దాన్ని కొలిచి.. దానికంటే పెద్దది చేయాలని ప్రయాసపడేవాళ్లం. చివరికి అవి ఎంత పెద్దవి అయ్యేవంటే.. మోసుకెళ్లలేనంత. భోగికి ముందు రోజు యువకులేమో జట్లుగా తయారయ్యేవారు. ఊర్లో ఇళ్ల దూలాలు, మంచాలు, కొట్టిన చెట్లు.. ఇలా అన్ని దొంగతనంగా సేకరించేవారు. ఉదయాన్నే వాటిని భోగిమంటల్లో వేసేవారు. అలా వేసేటప్పుడు చాలామంది వచ్చి.. ఇది మాదని గొడవలు పడేవారు. ఇదంతా చాలా సరదాగా ఉండేది. ఊరి వీధుల్లో పరిగెత్తే లేగదూడల్లా.. ఆ రోజుల హుషారే వేరు."
ఆ సంక్రాంతికి అనువాదకుడిని
నా భార్య పేరు తబిత. ఆమెది తెలంగాణ. మాదేమో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర మట్టపర్రు. మా అమ్మ వీరవేణి పూర్తి గోదావరి యాసలోనే మాట్లాడుతుంది. తబితది పూర్తిగా తెలంగాణ యాస. దీంతో ఆమె మాట్లాడే తెలంగాణ యాస అమ్మకు పూర్తిగా అర్థమయ్యేది కాదు. అమ్మ చెప్పేది తనకు తెలిసేది కాదు. పెళ్లైన ఏడాది వచ్చిన సంక్రాంతికి ఊరికి తీసుకెళితే.. వాళ్లిద్దరి మధ్య నేను అనువాదకుడిలా ఉండేవాడిని(నవ్వుతూ). భోగి పిడకలు తయారు చేయడం ఆమెకు అసలు రాదు. ఆ సంక్రాంతికి తబితను ఊరంతా తిప్పాను. నా స్నేహితులు, బంధువులను పరిచయం చేశా. నేను చదివిన బడి, ఆడుకున్న ప్రదేశాలు, కాల్వ గట్లు.. ఇలా అన్నీ తిప్పి చూపించా. జీవిత భాగస్వామితో.. జీవితంలో భాగమైన విషయాలు పంచుకోవడం.. ఓ తియ్యని వేడుక. ఎన్ని సంక్రాంతులు వచ్చినా.. బాల్యంలోని మధుర జ్ఞాపకాలే అప్పటి మంచు తెరల్లా హృదయాన్ని కప్పేస్తుంటాయి. తెలుగు లోగిళ్లలానే మనసును కళకళలాడేలా చేస్తుంటాయి.
ప్రశాంతంగా పండగ..
పరిశ్రమలోకి వచ్చాక.. నాకు సంతోషంగా అనిపించిన సంక్రాంతి.. అంటే వన్ నేనొక్కడినే కథ ఓకే అయిన సంవత్సరం. సాధారణంగా నా సినిమాలు వేసవిలో విడుదలకు సిద్ధం చేస్తుంటా. అప్పుడు సిద్ధం చేయాలంటే.. జనవరిలో బాగా పని ఉంటుంది. ఊపిరిసలపనంత పని ఉంటుంది. పండగ రోజుల్లో షూటింగ్ లేకపోయినా.. ఏదో టెన్షన్ మైండ్ నిండా ఉంటుంది. సినిమాకు సంబంధించిన విషయాలే నన్ను వెంటాడుతుంటాయి. అవి నన్ను కుదురుగా ఉండనివ్వవు. మిగతా సమయాల్లో కథ నాకు అంత త్వరగా తృప్తి నివ్వదు. అందుకే నేను కథను పూర్తి చేయలేను. ఎన్నో ప్రశ్నలు వేధిస్తుంటాయి. దాంతో కుస్తీ పడుతుంటా.. చర్చిస్తుంటా.. అలా మనశ్శాంతే ఉండదు. అందుకే ఎప్పుడు సంక్రాంతి వచ్చినా నేను పెద్ద ఎంజాయ్ చేసినట్లు నాకు గుర్తులేదు. 2012లో మాత్రం వన్ నేనొక్కడినే కథ మొత్తం పూర్తి చేసి, సినిమా ఓకే చేయించుకొన్నా. షూటింగ్‌కు ఇంకా చాలా సమయం ఉంది. మెదడుకు ఎలాంటి టాస్క్‌లు లేవు. హాయిగా, ప్రశాంతంగా ఉన్నా. ఆ ఏడాది ఊరికెళ్లి.. సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేశా. తెలుగు వాకిళ్లన్నీ తోరణం కట్టి ఆహ్వానించి, అభిమానించే సినిమాల్లో నేను భాగమై ఉండటాన్ని అదృష్టంగా భావిస్తుంటా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">